తెలుగునాట సుప్రసిద్ధమైన శతక సాహిత్యానికి ప్రాణం పోసిన వేమన, సుమతీ, దాశరథి తదితర శతకాలు తెలుగు ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే, ఇందులో ఆధ్మాత్మిక శతకాలు కూడా చేరడం వల్ల తెలుగు సాహిత్యం మరింతగా పరిపుష్టం అయింది. ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలో ఇటువంటి శతకాలు వెల్లువెత్తాయి. అందులో తప్పకుండా చెప్పుకోదగింది మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి రాసిన ‘మృత్యుంజయం’ అనే శతకం. 1940 దశకంలో ఈ చిరు శతకానికి లభించినంత ఆదరణ మరే శతకానికీ లభించలేదనడంలో అతిశయోక్తేమీ లేదు. ఇందులో పరమేశ్వరుడి ఆరాధనతో పాటు, నిందా స్తుతి, వ్యంగ్య స్తుతి కూడా మిళితమై ఉండడం, ఈ పద్యాలన్నీ పామరులకు సైతం అర్థమయ్యే విధంగా సరళ భాషలో ఉండడం ఈ పుస్తక విలువను బాగా పెంచింది. వేలాది పుస్తకాల ప్రచురణ అనంతరం ఇప్పుడు ముద్రణలో లేని పుస్తకంగా మారిపోయిన మృత్యుంజయ శతకాన్ని చదివిన
వారికి బుచ్చి సుందర రామశాస్త్రి మీద అసూయ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన రామశాస్త్రి ఒక స్కూల్ టీచర్ గా తన వృత్తిని కొనసాగిస్తూనే ఎక్కువగా పరమేశ్వరాధనలో గడిపే వారు.
‘‘ఏదో నీకొక్క దేవి గానీ, సవాలక్ష లావాదేవీలైపోయెను నాకు, జరుగుంబాటెట్టు మృత్యుంజయా’’ అని రాయడంలోని ఆయన ఉద్దేశాన్ని, పరమార్థాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. జీవితంలో అనేక కష్టనష్టాలు పడినప్పటికీ, శివుడి మీద చెక్కుచెదరని విశ్వాసంతో ఆయన ఈ మృత్యుం జయ శతకాన్ని రాసి శివుడికి అంకితం చేశారు. ఆయన రాసిన పద్యాలు చదివితే చాలు, ఆయన తన జీవితంలో పడిన కష్టనష్టాలన్నీ ఎవరికైనా అవగతం అయిపోతాయి. విచిత్రమేమింటే, ఆయనలో హాస్యప్రియత్వం కూడా ఎక్కువ. ఆయన స్థూలకాయుడు. తన మీద తానే హాస్య రసాన్ని పండించుకోవడం కూడా ఈ శతక పద్యాల్లో కనిపిస్తుంది. నీకు ఒక లంబోదరుడైన పుత్రుడు (వినాయకుడు) సరిసోడా నన్ను కూడా పుట్టించావంటూ ఆయన రాసిన పద్యం ఎవరినైనా చలింపజేస్తుంది.
ఒక లంబోదరుడైన పుత్రకుండు మున్నున్నట్టిదే నీకు జాలక కాబోలును సృష్టి చేసితివి ఈ లంబోదరుంగూడ’’ అంటూ ఆయన ఈ శతకంలో రాసిన ఒక పద్యం ఎంతో హృద్యంగా ఉంటుంది. అదే విధంగా, ‘‘మెడ నాగయ్యకు ఒక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యాబిడతో నీకెప్పుడూ నిక ఒక్కటే గుసగుసల్, వీక్షించి మీచంద మెక్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిన బడుటనేలాగునో మా మొరల్ తెలియదప్పా! మాకు, మృత్యుంజయా’’ అంటూ ఆయన రాసిన పద్యం ఎవరినైనా కదల్చి వేస్తుంది. ఇటువంటి నిందా స్తుతి పద్యాలు రాయడం అనితర సాధ్యమనే చెప్పాల్సి ఉంటుంది. ఈ శతకం దాదాపు లక్షల్లో అమ్ముడుపోయిందంటే అందులో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. అప్పట్లో ఈ పద్యాలను తెలుగు ప్రజలు దాదాపు పారాయణ మాదిరిగా పఠించడం జరిగింది.
ఆయన గురించి ప్రముఖ సాహితీవేత్త కాటూరి వెంకటేశ్వరావు 1946లో రాసిన కొద్దిపాటి వాక్యాలు ఆయనలోని ప్రతిభకు దర్పణం పడతాయి. బుచ్చన్నా! ఎంత పని చేశావు? చిరంజీవి నమశ్శివాయ కోరికపై ‘ఒక లంబోదరుడైన పుత్రకుడు’ అంటూ ఆషామాషీగా ఆరంభించినదెల్లా అగాధతలాలనూ, ఉన్నత శిఖరాలనూ అంటే అష్టోత్తర శతం చేసి, చివరికి ‘ఏరో వెన్నెల చీకటుల్ కలిసినట్లీ పర్వతాగ్రాన
నున్నారే’ అంటూ మమ్మెక్కడికి తీసుకెళ్లి వదిలావంటేనూ! నీ హాస్యతరంగాల అడుగున ఇంతటి సంస్కార పరిణతీ, ఇంతటి శాంత రస గర్భమూ ఉన్నదనుకోలేదు. పంచవటితోనే తలమున్కలై, శబరితో కాలు నిలదొక్కుకోలేక పోతున్న మాకు ఈ మృత్యుంజయముతో ‘నావంబోలి ప్రయాణమైనది మహానంద ప్రవాహ మ్ములో భావంబెచ్చటికో!’ మా బుచ్చయ్య ఇంతటి సంస్కార వృద్ధుడైనా, నువ్వు జెప్పినట్టు ‘పెద్దంజేయ మనస్కరింపదు నిన్ను, మా ఈ చనువును మనించవూ’’, ‘ఆ ధావళ్యంతో కన్నులు పగిలిపోతూ కూడా బాబుగారూ అంటూ ఎదురు వచ్చే నిన్నెప్పుడు కౌగలించు కుంటానో తెలియడం లేదు’’ అని కాటూరి రాయడం జరిగింది. బుచ్చి సుందర రామశాస్త్రి నిజంగా లబ్ధ ప్రతిష్ఠుడు.