Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Yogi Vemana: సమాజ చైతన్య దీప్తి-యోగి వేమన

Yogi Vemana: సమాజ చైతన్య దీప్తి-యోగి వేమన

ఈ రోజు వేమన జయంతి

ప్రజాకవి తాత్వికుడు తేలికైన పదాలతో అనుభవాలకు అక్షర రూపం కల్పించి, అలవోకగా ఆట వెలదులను రాసి, పండిత పామరులు మెప్పించిన కవివర్యులు యోగివేమన. లోకనీతులు సామాజిక చైతన్యంతో సమాజ మార్పుకోసం ఆరాటపడిన అచ్చమైన తెలుగు కవి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పుట్టి కొండవీడులో పెరిగారు. చెన్నకేశవస్వామి వరప్రసాదంగా లక్ష్మమ్మ, తుంగకేశవుల దంపతులకు 1412 సంవత్సరంలో జన్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. కొండవీటి రెడ్డి వంశంలో జన్మించిన వేమన సర్వ సౌభాగ్యాలను ఆడంబరాలను త్యజించి తాను తెలుసుకున్న వేదాంత రహస్యాలను జీవిత ధర్మాలను ఉత్తమ మార్గ విధానాలను ప్రజలందరికీ తెలియజేయడానికి దేశమంతా సంచరించారు. వానకు తడవని వారు, వేమన పద్యం నోటికి రానివారు ఉండరని లోకోక్తి.

- Advertisement -

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు..
అనగననగ రాగమతి..

వంటి సులభంగా అర్థమయ్యేటట్లు అచ్చమైన తెలుగు పదాలతో చురకత్తుల వంటి మాటలతో, నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా, సూటిగా హృదయాలను తాకే విధంగా అందమైన ఆట వెలుదులలో అనంతమైన అర్థాన్ని, చిన్న చిన్న వాక్యాలతో ఎందులోనూ సంస్కృత భూఇష్టమైన పదాలు గానీ, నోరు తిరగని వర్ణాలు గానీ, వాక్యాలు గాని ఏమీ లేకుండా, నోటిలో తేనె చుక్క వేస్తే నోరంతా ఒక్కసారిగా తీయగా మారినట్టు వేమన పద్యాలు చదవడంతోనే అందులో ఉన్న సారాన్ని అమృతం వలె ఆస్వాదిస్తారు పాఠకులు. అర్థం చేసుకోవడం ఎంత సులభమో నేర్చుకోవడం అంతకంటే సులభం. పసిపిల్లల నుండి పండుముసలి వాళ్ళ వరకు వేమన పద్యాలు సుపరిచితం. అందుకే శ్రీశ్రీ అంటారు ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మన తెలుగులో మహా కవులు అని. మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను నిరసించిన ఆధునిక సమాజ తాత్వికుడు.అసత్య మాడరాదని మూఢత్వం తగదని, కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అదుపులో పెట్టుకోవాలని, భూతదయ అవసరమని, ధర్మమే జయము అని చాటుతూ విగ్రహారాధన నిరసిస్తూ సమాజానికి అవసరమైన విషయాలను సులభమైన రీతిలో అందరికీ అర్థమయ్యేటట్లు వర్ణించారు.
ఆలుమగలు మాయ-అన్నదమ్ములు మాయ
ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని
రాళ్లు రప్పలు తెచ్చి రమ్యమౌ గుడికట్టెదరు
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి
పిండములను చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టు గాడిదలరా
అంటూ మూఢ విశ్వాసాలను రూపుమాపడానికి అక్షరాలను ఆయుధాలుగా వాడి సమాజం మార్పు కోసం తన జీవితాన్ని ధార పోసిన త్యాగశీలి యోగి వేమన. అంటరానితనాన్ని నిరసించాడు. వేమన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు సిపి బ్రౌన్. తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన ఆంగ్లేయ అధికారి CP బ్రౌన్ మొదటి సారిగా వేమన పద్యాలను సేకరించడం మొదలుపెట్టాడు. వేమన ఎక్కడెక్కడ తిరిగాడో ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రజలను అడిగి తెలుసుకుని పద్యాలను చదివిస్తూ రాయడం మొదలుపెట్టాడు. ఆ పద్యాలన్నీ కలిపి 693 పద్యాలతో మొదటిసారి సిపి బ్రౌన్ వేమన పుస్తకాన్ని వెలువరించారు‌. ఆ తర్వాత మరికొన్ని సేకరించి 1214 పద్యాలతో మరొక పుస్తకం ప్రచురించారు. పూర్ణయా చారి అనే పరిశోధకుడు దాదాపు నాలుగు వేల పద్యాలను సేకరించి వేమన శతకాన్ని వెలువరించారు. వేమన ఎన్ని పద్యాలు రాసాడు అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. దాదాపు 5 వేలకు పైగా లభిస్తున్న అవన్నీ వేమన రాసినవి కాదని, కేవలం 1500 వరకు మాత్రమే రాశాడని మిగతా పద్యాలు వేరే వాళ్ళు రాసి వేమన పేరు పెట్టినట్లు తెలుస్తుంది.
వేమన ఆశు కవి, ప్రజా కవి దేశద్రిమ్మరి. అనేక ప్రాంతాలు తిరుగుతూ తన అనుభవాలను పద్యాల రూపంలో అప్పటికప్పుడు ప్రజలకు చెప్పేవాడు. అందుకే తన రాసిన పద్యాల సంఖ్య పై గంధరగోళం ఏర్పడింది. ప్రజలు పద్యాలు విని వాటిని గుర్తుపెట్టుకునేవారు. పద్యాలు విన్న ప్రజలు వేమన మా ఊరికి వచ్చినప్పుడు ఫలానా పద్యం చెప్పాడని అలా ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెంది తెలుగు నేలంతా విస్తరించడం జరిగింది. ఈ విధంగా ఎటువంటి పుస్తకం రాయకపోయినా పద్యాలు ప్రజల నోటి ద్వారా తెలుగు నేలంత విస్తరింపబడి సజీవమైన ఏకైక కవి వేమన మాత్రమే. వేమన పేరుతో మొత్తం 5010 పద్యాలు తాళపత్రాల నుండి సేకరించాననీ జానపద వాంగ్మయ బ్రహ్మ నేదునూరి గంగాధరం మరియు విద్యారణ్య స్వామి పేర్కొన్నారు. వేమన పద్యాలు అందరికీ అందుబాటులో ఉన్నాయంటే అది సిపి బ్రౌన్ గారి కృషి ఫలితమే. తను రాసిన పద్యాలకు విశ్వదాభిరామ వినర వేమ మకుటం ఉంటుంది.విశ్వదా అంటే వారి వదిన పేరు మరియు అభిరామయ్య అనేది తన బాల్యమిత్రుడు పేరును కలిపి విశ్వదాభిరామ వినురవేమా అనే మకుఠాన్ని పెట్టారని కొందరు, విశ్వాన్ని సృష్టించిన అభిరాముడికి ప్రియమైన వాడు వేమన అనే అర్థం ఉందని కొందరు వాదిస్తారు. ఈ అర్థాన్నే సిపి బ్రౌన్ తన పద్యాలల్లో వివరించడం జరిగింది.
వేమన విగ్రహాలు ఫోటోలు ఎక్కడ ఉన్నా బట్టలు లేకుండా దిగంబరంగా కనిపిస్తాడు. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు బట్టలు లేవు, భూమిని విడిచి పోయేటప్పుడు కూడా ఏమీ లేకుండా పోతామని వైరాగ్యభావంతో బట్టలు కట్టుకోకుండా ఉన్నారని, మరి కొంతమంది గోచిగుడ్డ కట్టుకున్నాడని అంటారు. వేమన దిగంబరుడిగా సమాజంలో తిరగలేదు నాకు వైరాగ్యం ఉంది, కానీ సమాజానికి లేదు కాదా అని సమాజానికి దూరంగా ఉన్నాడు. కదిరి ప్రాంతంలో వేమన వైరాగ్యం పొందినట్లు ప్రచారంలో ఉంది. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయంలో ఒక బొమ్మ దొరికింది. దాని ఆధారంగా రెడ్డి వాణి పత్రికలో 1920 ప్రాంతంలో యోగివేమన దిగంబరుడుగా ఉన్న బొమ్మ ప్రచురితమైనట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ యోగివేమన మీద పరిశోధన చేసిన సిపి బ్రౌన్ గాని ఆరుద్ర గాని ఎన్ గోపి గాని ఆయనను దిగంబరుడిగా ఎక్కడ పేర్కొనలేదు. భోగభాగ్యాలపై విరక్తి చెంది ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి లోక సంచారం చేస్తూ అనేకమంది యోగులు గురువులను కలుస్తూ వారు చెప్పేది వింటూ తాను ఏదైతే చూస్తున్నాడో ఆ నిజాలనే పద్యాల రూపంలో చెప్తూ ప్రజలకు చేరువైనాడు. వేమన గారు 1480 ప్రాంతంలో అనంతపురం జిల్లా గండ్లపేట మండలం కటారుపల్లిలో జీవ సమాధి అయ్యారని, ఆ సమాధి దగ్గర గుడి కట్టి భక్తిశ్రద్ధలతో కొలుచుకుంటున్నారు. అక్కడ వేమన గారు వాడిన తలపాగా, పాదరక్షలు, గొడుగు ఆ గుడిలో కనిపిస్తాయి. ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అనేక సంఖ్యలో వస్తారు. అది మంగళవారం మరియు శ్రీరామ నవమి మూడు రోజులపాటు వేమన తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శ్రీ కృష్ణాష్టమి అక్కడ జరిగే ఉట్ల ఉత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. 1480 నుండి ఇప్పటివరకు రేయింబవళ్లు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందని స్థానికుల కథనం. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక్కో భాష నుండి ఒక్కొక్క కవిని ఎన్నుకొని ఆ కవుల జీవితం వారి సిద్ధాంతాలు మరియు కవిత్వ విశేషాల గురించి పుస్తకాలు వెలువరించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి తెలుగులో ఎన్నుకున్న కవి వేమన. వేమన కవిత్వం గురించి వీరు ఒక పుస్తకాన్ని ఆంగ్ల భాషలో అనువదించి పబ్లిష్ చేయించడం జరిగింది. ప్రస్తుతం వేమన జయంతిని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19న నిర్ణయించి అధికారికంగా ఘనంగా జరిపిస్తుంది. సత్యాన్ని వాస్తవాలను నిజాన్ని చెప్తే వాళ్లను సమాజం ఎప్పుడు దూరం పెడుతుంది. అదే వేమన జీవితంలో కూడా జరిగింది. మానవాళికి సాంఘిక నైతిక జీవనానికి ఉపయోగపడే విధంగా సమాజంలో నీతి న్యాయం ధర్మం మంచిని పెంపొందించాలంటే సంపూర్ణమైన జ్జానం కలగాలంటే వేమన పద్యాలు నిరంతరం పాటించాల్సిందే.
కొమ్మాల సంధ్య
తెలుగు ఉపన్యాసకులు
సమ్మక్క సారక్క తాడ్వాయి
ములుగు జిల్లా
9154068272

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News