Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Ramsetu: రామ సేతు ఎక్కడిదక్కడే

Ramsetu: రామ సేతు ఎక్కడిదక్కడే


సుమారు 2007 ప్రాంతంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ షిప్పింగ్‌ ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం కలిగేలా కనిపించడం లేదు. నిజానికి ఈ ప్రాజెక్టు అధ్యాయం మూతబడినట్టేనని కూడా రెండేళ్ల క్రితమే నిర్ధారణ అయింది. దీనికి ఏదో విధంగా జీవం పోయాలన్న ప్రస్తుత డి.ఎం.కె ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఫలించేలా కనిపించడం లేదు. ఈ సేతు సముద్రం షిప్‌ కెనాల్‌ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ కొద్ది రోజుల క్రితం తమిళనాడు శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. శ్రీలంక చుట్టూరా ఒక ద్వీపం నుంచి మరో ద్వీపానికి తిరగాల్సిన అవసరం లేకుండా పాక్‌ జలసంధితో గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ను నేరుగా కలపడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. నిజానికి, ఈ అంశం డి.ఎం.కె ఎన్నికల ప్రచార వాగ్దానాల్లో ఒకటి. డి.ఎం.కె తన పదవీ కాలంలో ఏదో ఒక రోజున ఈ అంశాన్ని శాసనసభలో చర్చించడం, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగే వ్యవహారమే. యు.పి.ఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి దీనికి నాందీ ప్రస్తావన చేశారు. అంతే, ఈ ప్రాజెక్టు వల్ల రామ సేతు దెబ్బతింటుందంటూ ప్రజలు దీన్ని గట్టిగా వ్యతిరేకించే సరికి, సుప్రీంకోర్టు కల్పించుకుని దీనికి అడ్డుకట్ట వేసింది.
పంబన్‌, మన్నార్‌ ద్వీపాల మధ్య సున్నపు రాయితో నిర్మించిన రామ సేతు వారధిని శ్రీరాముడు వానరుల సహాయంతో నిర్మించాడని ఇతిహాసాల ప్రకారం తెలుస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం కొద్దిగా తన వైఖరిని మార్చుకుని, రామ సేతుకు ఏవిధంగానూ దెబ్బ తగలకుండా తాము ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ప్రత్యామ్నాయ మార్గం ఆచరణ యోగ్యంగా లేదనే విషయం మొదట్లోనే తేలిపోయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడానికి అప్పట్లో యు.పి.ఏ ప్రభుత్వం పచౌరీ కమిటీని నియమించింది. తమిళనాడు ప్రభుత్వం ఈ కమిటీని తాజాగా సంప్రదించింది. అయితే, ఈ ప్రాజెక్టు లాభదాయకం కాదని, దీనివల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని ఆ కమిటీ తేల్చిచెప్పింది. ఆర్థికపరంగా, పర్వావరణ పరంగా ఇది నష్టదాయకమేనని కూడా చెప్పింది.
సాచివేత ధోరణి
యు.పి.ఎ ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రాజెక్టులను మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న మాట నిజమే కానీ, రామసేతు ప్రాజెక్టును దెబ్బతీసే విధంగా ఉన్న ఈ షిప్పింగ్‌ ప్రాజెక్టును కొనసాగిస్తుందా అన్నది చెప్పలేం. ముఖ్యంగా అయోధ్యలో పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో రామసేతు ప్రాజెక్టును దెబ్బ తీయడానికి మోదీ ప్రభుత్వం ఒప్పుకునే అవకాశమే లేదు. ఇది ఇలా ఉండగా, రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఈ మధ్య డిమాండ్‌ చేయడం ప్రారంభించడంతో మోదీ ప్రభుత్వం సందిగ్ధావస్థలో పడింది. తన డిమాండుకు మోదీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 12 లోగా తమ అఫిడవిట్‌ను సమర్పిస్తామని తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఫిబ్రవరిలో విచారణకు వస్తుంది.
కాగా, కొద్ది రోజుల క్రితం పార్లమెంట్లో శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ రామ సేతు గురించి ప్రస్తావించి, సభలో గందరగోళానికి కారణమయ్యారు. ఉపగ్రహ సమాచారం ఆధారంగా రామ సేతును సరిగ్గా ఏ ప్రాంతంలో నిర్మించారన్నది నిర్ధారణ కాలేదని ఆయన వ్యాఖ్యానించడం దుమారాన్ని రేపింది. రామ సేతును ఎవరు, ఎలా నిర్మించారన్నది నిర్ధారించడానికి కొంత కాలం క్రితం ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, అధ్యయనం చేయిస్తోంది. ఈ అధ్యయనం పూర్తయ్యే వరకూ రామ సేతు వ్యవహారం మూలనబడే అవకాశం ఉంది. ఈలోగా తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానంపై కేంద్రం స్పందించే అవకాశమే లేదు.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News