మైక్రోగ్రీన్స్ గురించి వినే వుంటారు. వీటిల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ‘బేబీ గ్రీన్స్’ అని కూడా అంటారు. కాయగూరల విత్తనాలు, మూలికల నుంచి ఇవి పెరుగుతాయి. వీటిని చల్లిన రెండు వారాల్లో చిన్న చిన్న మొక్కలుగా మొలకెత్తుతాయి. పచ్చని చిగుర్లతో కూడిన చిన్న చిన్న ఆకులను ఇవి కలిగి ఉంటాయి. వీటిని అలాగే వదిలేస్తే పెద్ద మొక్కలుగా కూడా ఎదుగుతాయి. వేసిన విత్తనాలను బట్టి మైక్రోగ్రీన్స్ లో పోషకాలు ఉంటాయి. సాధారణంగా వీటిల్లో విటమిన్లు, పోషకాలు బాగా ఉంటాయి.
పెద్ద పెద్ద మొక్కల్లో కన్నా కూడా వీటిల్లో పోషకాల విలువలు అధికంగా ఉంటాయి. సాధారణంగా మైక్రోగ్రీన్స్ ను సలాడ్స్, సూప్స్ పైన అలంకరించడానికి వాడుతుంటారు. అలా అని అవి ఫుడ్ డెకరేటివ్స్ అనుకుంటే పొరబడ్డారన్నమాటే. వీటిల్లో సువాసనలు వెదజల్లే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు మైక్రోగ్రీన్స్ లో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్లు అధికంగా ఉంటాయి.
యాంటాక్సిడెంట్లు కూడా వీటిల్లో బాగా ఉంటాయి. శరీరానికి లాభకరమైన ప్లాంట్ కాంపౌండ్లు కూడా వీటిలో ఎక్కువగానే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మైక్రోగ్రీన్స్ పోషకాల పవర్ హౌస్. వీటిని ఇండ్లల్లో, ఆరుబయట కూడా ఎంతో సులువుగా పెంచుకోవచ్చు. మైక్రోగ్రీన్స్ అనగానే తులసి, తోటకూర, మెంతి, కొత్తిమీర, బీట్ రూట్, కేరట్ ఆకులు, ముల్లంగి ఆకులు, పాలకూర, బటానీ మొక్కలు, అరుగూలా ఆకు, కేబేజీ, పుదీనా, వీట్ గ్రాస్, చియా ఇలా ఎన్నో గుర్తుకువస్తాయి.
మైక్రోగ్రీన్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుండెజబ్బులు, అల్జమర్ లాంటి జబ్బుల బారిన పడకుండా శరీరారోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిల్లోని యాంటాక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించి మధుమేహం పాలబడకుండా కాపాడతాయి. వీటిల్లో ఉండే పోలీఫెనల్స్ రకరకాల కాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి కూడా. మైక్రోగ్రీన్స్ ను మనం తినే రకరకాల డైట్లలో వాడొచ్చు. సలాడ్లు, శాండ్ విచ్ లలో కూడా వీటిని వాడొచ్చు. స్మూదీలు, జ్యూసుల్లో కూడా ఉపయోగించవచ్చు. పిజ్జాలు, సూపులు, ఆమ్లెట్లు, కూరలపై వీటిని చల్లి తింటే బాగుంటాయి. శరీరానికి పోషకాలు అందుతాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వీటిని ఎక్కువ వేడి చేయకూడదు. అలా చేస్తే వీటిల్లో ఉండే ఎంజైమ్స్, విటమిన్లు, పోషకాలు పోతాయి. మైక్రోగ్రీన్స్ చర్మ ఆరోగ్యానికి సైతం బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ముల్లంగి, బ్రోకోలీ, మెంతి, సన్ఫ్లవర్ లు చర్మానికి అవసరమైన జింకు, విటమిన్లు, ఎ, డి, బి, ఇ , పోలీఫెనల్స్ లాంటి యాంటాక్సిడెంట్లను అందిస్తాయి.
శిరోజాల సంరక్షణలో కూడా మైక్రోగ్రీన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. వెంట్రుకలు చిట్లిపోవు. బీట్రూట్ వంటి మైక్రోగ్రీన్స్ లోని ఐరన్, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటివి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముల్లంగి ఆకు తినడం వల్ల శరీరానికి ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు అందుతాయి. మైక్రోగ్రీన్లు అన్నింటిలో సూక్ష్మపోషకాలు బాగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ ప్రమాణాలను కూడా తగ్గిస్తాయి. జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తాయి. గొంతునొప్పిని తగ్గిస్తాయి. ఇలా మైక్రోగ్రీన్స్ ను నిత్యం మీ డైట్ లో చేరిస్తే పొందే ఆరోగ్య లాభాలు ఎన్నో…మరి ఆలస్యం ఎందుకు మీ డైట్ లో వీటిని చేర్చేయండి…