అయోధ్యలో రామ మందిర నిర్మాణం వల్ల దేశానికి ఒరగబోయేదేమిటి? ఇది దేశ భవిష్యత్తును మార్చేయగలదా? దేశంలోని ఇతర వర్గాలకే కాకుండా హిందువులకు కూడా కలుగుతున్న సందేహాలివి. ఇరవై రెండేళ్ల క్రితం బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేసినప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక మరాఠీ రచయిత ఇది భారతదేశ చరిత్రను మార్చేయబోతోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ జనం చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వారంతా ఏ భాషైనా మాట్లాడవచ్చు. ఏ
కులానికి చెందినవారైనా అయిఉండవచ్చు. ఈ ప్రాంతం వారైనా కావచ్చు. కానీ, వారందరికీ తామంతా హిందువులమన్న భావన మనసుల్లో బలంగా ఉంది’’ అని ఆయన అభివర్ణించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అయోధ్య ఉద్యమం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హిందువుల మధ్య ఐక్యతకు, సంఘీభావానికి తోడ్పడిందనడంలో సందేహం లేదు. కులాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా
హిందువులంతా ఒకే తాటి మీదకు రావడానికి ఇది అనివార్యంగా కారణమైందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయోధ్య ఉద్యమ ఏకైక లక్ష్యం అదేనని వేరుగా చెప్పనక్కర లేదు.
నిజానికి, 1981లో మీనాక్షిపురం మత మార్పిళ్ల వ్యవహారం తర్వాత అయోధ్య ఉద్యమం అనేక ఒడిదుడుకులకు, అనేక అనూహ్య పరిణామాలకు లోనయింది. దాని తర్వాత రామ శిలాన్యాసం జరిగింది. ఆ తర్వాత ఎల్.కె. అద్వానీ సారథ్యంలో రథయాత్ర జరిగింది. ముఖ్యంగా షాబానో సంఘటన తర్వాత దేశంలో అమలు జరుగుతున్న లౌకికవాద కార్యక్రమాల మీద హిందువులందరి దృష్టిపడింది. అంతకు ముందు నెహ్రూ కాలం నుంచి కుహానా లౌకికవాద ధోరణులను భరిస్తూ వస్తున్న ప్రజానీకంలో షాబానో కేసులో రాజీవ్ గాంధీ నిర్ణయంతో ఒక్కసారిగా అసహనం పెరిగిపోయింది. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ లకు సంబంధించని ప్రజలు సైతం దీనిమీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. షాబానో కేసులో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద చివరికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వంటి ముస్లిం నేతలకు కూడా ఏవగింపు కలిగింది. లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాగిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలపై ప్రజలు దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించారు.
కాంగ్రెస్ నిర్వాకమే ఇది హిందూ వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డూ ఆపూ లేకుండా కొనసాగిస్తుండడంతో 1990ల నుంచి పత్రికల్లో బుజ్జగింపు ధోరణులు, కుహానా లౌకికవాదం వంటి పదజాలం చేరడం మొదలైంది. కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీయేతర పార్టీలు సాగిస్తున్న కుహానా లౌకికవాదాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ప్రజలు బీజేపీ, ఆరెస్సెస్ ల వాదనలకు సరైన కారణమే ఉందన్న అభిప్రాయానికి రావడం ప్రారంభించారు. అప్పట్లో ఎల్.కె. అద్వానీ ఇచ్చిన నినాదం ‘‘అందరికీ న్యాయం, బుజ్జగింపులకు స్వస్తి’’ ప్రజల్లోకి బాగా ఎక్కిపోయింది. హిందువుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఇతర మతాలవారిని తమ బుజ్జగింపు ధోరణితో ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో రాజ్యాంగ
విలువలను కూడా తోసిరాజనడం జరిగింది. ముస్లింల ఓటు బ్యాంకును పెంచి పోషించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370ని రద్దు చేయకపోవడం, యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకు రాకపోవడం, తలాక్ పద్ధతిని రద్దు చేయకపోవడం వంటివి జరుగుతూ వచ్చాయి. నరేంద్ర మోదీ, బీజేపీలకు సంబంధం లేకుండా, అత్యధిక సంఖ్యాక హిందువుల మనోభావాల మీద వీటి ప్రభావం పడుతూ
వచ్చింది.
కాంగ్రెస్ తీరుతెన్నుల పట్ల విసుగెత్తిపోవడం, తమ ప్రయోజనాలను ఈ పార్టీ పట్టించుకునే అవకాశమే లేదని అర్థం చేసుకోవడం వంటి కారణాల వల్ల హిందువులు క్రమంగా ఆ పార్టీకి దూరమవుతూ వచ్చారు. మొత్తం మీద గత ముప్ఫయ్యేళ్ల కాలంలో దేశ రాజకీయ, సామాజిక మార్పులు తీవ్రంగా మారిపోతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరచూ అజ్గార్, మై అనే మాటలను వాడుతూ ఉంటుంది. అజ్గార్ అంటే
ఆహిర్లు, జాట్లు, గుజ్జర్లు, ఆదివాసీలు, రాజపుట్లు అని అర్థం. అదే విధంగా మై అంటే ముస్లింలు, యాదవులని అర్థం. ఈ వర్గాల ఓటు బ్యాంకుల కోసం తాపత్రయపడిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఆ వర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనాలు అర్థమైపోయాయి. ఇదంతా హిందువులను దెబ్బతీసేందుకు, బలహీన పరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలని ఈ వర్గాలకు సైతం అవగాహన కలిగింది. మతపరమైన కోటాలకు పట్టుబట్టిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా కోటాలనే మాటకు స్వస్తి చెప్పడం ప్రారంభించాయి. ప్రస్తుతం బీజేపీ చెబుతున్నట్టుగా దేశంలో నాలుగే కులాలున్నాయి. అవిః యువత, మహిళలు, రైతులు, పేదలు. ఇది యువతకు బాగా అర్థమవుతోంది.
మారిపోతున్న కాలం
హిందువుల్లో కులాల మధ్య ఐక్యత పెరుగుతున్నట్టు గమనించిన కొన్ని పార్టీలు దేశంల కులగణన చేపట్టాలనే డిమాండ్ తీసుకువచ్చాయి. బీహార్ లో కులగణన చేపట్టడం కూడా జరిగింది. అయితే, దీనివల్ల వెనుకబడిన వర్గాలో పురోగతి సాధించిన వారికి ప్రాధాన్యం లేకుండా పోతుందనే విషయాన్ని గమనించిన వివిధ కులాల వారు దీన్ని ప్రోత్సహించడానికి విరమించుకోవడం జరిగింది. అయోధ్యలో
జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తాము హాజరు కాబోమంటూ నెహ్రూ-గాంధీ వంశస్థులు ప్రకటిస్తే ప్రకటించవచ్చు కానీ, ఆలయాలకు వెళ్లినంత మాత్రాన తమ లౌకిక వాదానికి నష్టమేమీ లేదని భావించే అవకాశం ఉంది. 2018లో మధ్యప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రామాయణంలో వనవాసం సమయంలో రాముడు నడిచిన ప్రాంతాలన్నిటినీ అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించింది. బాబ్రీ మసీదును పునర్నిస్తా మంటూ పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రకటన చేసిన కాలం నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు బాగా తేడా వచ్చింది. అయోధ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ వీలైనంత వరకూ మౌనం పాటించదలచుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. హిందువుల బలపడడమంటే, అయోధ్యలో రామాలయం నిర్మించడమంటే, వలసవాద ప్రభావం నుంచి బయటపడడం. వలస పాలకుల ప్రభావం నుంచి బయటపడడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది సాధించడం కష్టసాధ్యమైన విషయమే కానీ, అసాధ్యమేమీ కాదు. భారతదేశంపై దాడులు చేసి, విధ్వంసాలు చేసి, దోపిడీలు చేసి వెళ్లిపోయిన మొగల్ రాజుల పేర్లను రోడ్లకు, ప్రాంతాలకు కొనసాగించడం ఇక పాతకాలపు మాట. దేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మొగల్ రాజులు, బ్రిటిష్ పాలకుల ప్రభావం నుంచి దేశం తప్పకుండా బయటపడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి దేశంలోని హిందువుల్లో సంఘీభావం, ఐక్యత పెరుగుతున్నాయి. వారు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. ఇతర వర్గాలు, పార్టీల
దౌర్జన్యాలను వీరు భరించే స్థితిలో లేరు. ఇప్పటి సరికొత్త హిందువును ఏది చేసినా చెలామణీ అవుతుందన్న దృష్టితో చూడక పోవడం మంచిది. ఈ హిందువు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేడుకగా, సంబరంగా జరుపు కుంటాడే తప్ప దీన్ని అడ్డం పెట్టుకుని ఇతర వర్గాల మీద దాడులు చేయడు.
– ప్రొఫెసర్ ఎస్. దేవేంద్ర