Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Teachers problems: కొత్త ప్రభుత్వమైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారించేనా?

Teachers problems: కొత్త ప్రభుత్వమైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారించేనా?

ఇతర రాష్ట్రాల్లో మంచి వేతనాలిస్తుండగా తెలంగాణాలో ఎందుకు ఇవ్వలేరు?

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా నయా బానిసత్వం లో మగ్గుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆశలన్ని ఇప్పుడు కొత్త ప్రభుత్వంపైనే ఉన్నాయి.

- Advertisement -

సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆశలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైనే
దేశవ్యాప్తంగా 2001-2002 సంవత్సరంలో సర్వ శిక్ష అభియాన్ ప్రారంభము కాగా, 2018లో దాన్ని సమగ్ర శిక్ష అభియాన్ గా మార్చారు.అందులో భాగంగా జిల్లా స్థాయిలో ఎ పి ఓ లు,సిస్టం ఎనాలసిస్టులు,టేక్నికల్ పర్సన్లు,ఆపరేటర్లు, డి ఎల్ ఎం టి లు, మెసెంజర్లు పనిచేస్తున్నారు. మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఐఆర్పీలు,డేటాఎంట్రీ ఆపరేటర్లు,మెసెంజర్లు పని చేస్తున్నారు. క్లస్టర్ స్థాయిలో సిఆర్పీలు పనిచేస్తున్నారు. పాఠశాల స్థాయిలో పిటిఐలు(ఆర్ట్స్,పిఈటీలు,వర్కర్లు)కంప్యూటర్ ఇన్స్టటర్లు, వాచ్ ఉమెన్లు,స్వీపర్లు మరియు వంట వారు పనిచేస్తున్నారు. కె.జి.బి.వి/యు.ఆర్. యస్ లో ఎస్ఒలు, పీజీసిఆర్టీలు, సిఆర్టీలు, పిఈటిలు, ఎఎన్ఎం న్లు, అకౌంటెంట్లు, క్రాఫ్ట్ టీచర్లు పనిచేస్తున్నారు.

మన రాష్ట్రంలో 2005-2006లో కే జీ బి వీ లు ప్రారంభించబడ్డాయి. అంటే గత 18 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా 475 కే జీ బి వి పాఠశాలల్లో సుమారు 13 వేల బోధన, బోధనేతర సిబ్బంది నియామకమై పని చేస్తున్నారు. ప్రస్తుతం సమగ్రశిక్ష అభియాన్ లో భాగంగా ప్రభుత్వ, లోకల్ బాడీ ఉపాధ్యాయుల వలె జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో రోస్టర్,మెరిట్,రుల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా నియామకం అవుతూ, వారి పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు పొందుతున్నారు. కాబట్టి రెగ్యులర్ చేయాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే.
రాష్ట్రంలో ఉన్న ఇతర ఆశ్రమ పాఠశాలలతో పోల్చితే కే జీ బి వి ఉపాధ్యాయుల వేతనాలు చాలా తక్కువ. రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయుల మినిమం బేసిక్ పే తో పోలిస్తే సగం జీతం కూడా కే జీ బి వి ఉపాధ్యాయులకు లేదు. వార్డెన్ లేకపోవడం వల్ల వారంలో ఒక రోజు తప్పనిసరిగా మరియు ఆదివారాల్లో, పండుగ రోజుల్లో రాత్రి డ్యూటీ చేయాల్సివస్తుంది. చాలా కాలంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నప్పటికి, గత పీఆర్సీ కమిషన్ మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సిఫారసు చేసినప్పటికీ 30 శాతం జీతాలు మాత్రమే పెంచారు. మినిమం టైం స్కేల్ ప్రస్తావనే రాలేదు. ఇతర కాంట్రాక్ట్ అధ్యాపక, ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులర్ చేశారు. మిగిలిన వారికి టైం స్కేల్ ఇస్తున్నారు. కానీ ఎంతో కష్టపడి బాలిక అక్షరాస్యతకు కృషి చేస్తున్నా కే జీ బి వి ఉపాధ్యాయునియులను మరిచారు.

2004 సంవత్సరం నుంచి అంటే సుమారు 19 సంవత్సరాలుగా మండల వనరుల కేంద్రంలో సీసీఒలు కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా భవిత కేంద్రాలలో ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐఈఆర్పిలు) ఇప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా సిఆర్పిలు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఎమ్ ఐ యెస్ కోఆర్డినేటర్లు ఎంఆర్సి పరిదిలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా మెసెంజర్స్ కూడా ఎంఆర్సి పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పాఠశాల స్థాయిలో
పీటీఐఎస్ లు, డిఈఓ కార్యాలయంలో ఏపీఓలు, సిస్టం అనాలసిస్టులు, డి పీ ఓ ఆపరేటర్లు, అటెండర్లు సమగ్ర శిక్ష అభియాన్ లో భాగంగా సుమారు 27000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కాంట్రాక్టు పద్దరిలోనే పని చేస్తూన్నారు. చాలీచాలని వేతనాలతో జీవితాలు కొనసాగిస్తున్నారు.

పైకం తక్కువ-పని ఒత్తిడి ఎక్కువ
సమగ్ర శిక్ష విభాగంలో స్పెషల్ ఆఫీసర్స్ 32500 వేతనానికి, పీజీసీఆర్టీలు 30000వేతనానికి, సీఆర్టీలు 26000 వేతనానికే, సీఆర్పీలు, ఎమ్ ఐ యెస్ కోఆర్డినేటర్లు, ప్రత్యేక ఒప్పంద ఉద్యోగులు 19500 వేతనానికే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పి ఈ టీ లు 15000 వేతనానికి, మెసెంజర్స్ 12000వేతనానికి, ఎ ఎన్ ఎమ్ లు 14500 వేతనానికే, క్రాఫ్ట్ టీచర్లు, కంప్యూటర్ టీచర్లు, అకౌంట్టెంట్లు, వాచ్ ఉమెండ్లు, వర్కర్లు, స్కావింజర్లు అతి తక్కువ వేతనానికే గత పదిహేను, పద్దెనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్నారు. అయినప్పటికీ వారికి ఉద్యోగ భద్రత లేదు, పే ప్రోటక్షన్ లేదు. గ్రూప్ లైఫ్ ఇన్సూరన్స్ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ట్రావెలింగ్ అలవెన్స్ లేవు. ప్రభుత్వ సిమ్ కార్డులు లేవు.

తెలంగాణ పల్లెల్లో బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్నది సమగ్ర శిక్ష అభియాన్ లో భాగమైన కేజీబీవీ ఉపాధ్యాయనీయులు.తెలంగాణ గ్రామాల్లో దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నది సమగ్ర శిక్ష అభియాన్ లో భాగమైన ఒప్పంద ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐ.ఈ.ఆర్.పిలు). ప్రాథమిక స్థాయి విద్యా సమాచారాన్ని జిల్లాకు చేరవేయలన్నా, జిల్లా స్థాయి విద్యా సమాచారాన్ని ప్రాథమిక స్థాయికి చేరవేయలన్నా సమగ్ర శిక్ష అభియాన్ లో పని చేస్తున్న సీఆర్పీలు, ఎమ్ ఐ యెస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లదే కీలకపాత్ర. ఇంతటి సేవలందిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కానిస వేతనం ఇవ్వక పోవడం శోచనీయం. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వమైనా ముందుగా మినిమం టైం స్కేల్ ఇచ్చి,వారి సర్వీస్ రెగ్యులరైజేషన్ దిశగా ఆలోచించాలి.

ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న
కె జీ బీ వీ ఉపాధ్యాయనియులకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కూడా కల్పించింది. ఓటు హక్కు కల్పించిన గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ఉసే ఎత్తక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఉపాధ్యాయుల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అనేక రకాల హామీలు ఇస్తూ ఓట్లు వేయించుకున్న తదుపరి వారిని పలకరించిన పాపాన పోలేదు. వారికి కనీస సౌకర్యాలు కల్పించలేక పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన వారికి కానిస సౌకర్యాలు కల్పించాలి.

క్రమబద్దీకరణ ఇక్కడెందుకు సాధ్యం కాదు?
దేశంలో 28 రాష్ట్రాలలో వెస్ట్ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, హర్యానా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు వంటి 8 రాష్ట్రాలలో మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ లో భాగంగా సీఆర్టీలను జమ్ము కాశ్మీర్, హర్యానాలో, సీఆర్పీలను ఒరిస్సా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో, ఐఆర్పీలను హర్యానా, కేరళలో రెగ్యులర్ చేయగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రం కంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్స్ తో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరిని ఇప్పటికే పంజాబ్, మేఘాలయ, త్రిపురా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు. ఢిల్లీలో రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇన్ని రాష్ట్రాలలో వారి సర్వీస్ ను క్రమబద్దీకరణ సాధ్యం అయినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు. కేంద్రం వాటా, రాష్ట్రం వాటా అనడం తప్పించుకునే ప్రయత్నంమే తప్ప మరేమీకాదు. మాడల్ స్కూల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలి.
రెగ్యులర్ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే పని కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే పని ఒక్కటే అయినప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకపోవడం వెట్టిచాకిరి కాదా? ఈ కాంట్రాక్ట్ విధానమే నయా బానిసత్వం కాదా? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం.
గత 19 సంవత్సరాలుగా పని చేస్తున్నా రెగ్యులరైజేషన్ దేవుడెరుగు కనీసం మినిమం టైం స్కేల్ అయినా వర్తింపజేస్తే బాగుండని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వాపోతున్నారు. రెగ్యులరైజేషన్ చేయాలి.
విద్యా వ్యవస్థకు వెన్నముక్కగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. బాలికల విద్య అంటేనే కేజీబీవీలు అనే విధంగా విద్యారంగంలో కేజీబీవీలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించి సేవలు అందిస్తున్నాయి. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆశలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైనే పెట్టుకున్నారు. కాబట్టి వారందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంతవరకు వారికి మినిమం టైమ్స్ స్కేల్ ఇవ్వాలి. రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం అని మారో మారు నిరూపించాలి.
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
(జిల్లా అధ్యక్షులు)
మహబూబ్ నగర్,
9494019270.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News