మండల కేంద్రమైన రుద్రవరం సమీపంలోని నల్లమల అటవీ తీర ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లో పెద్దపులి సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు తెలిపిన వివరాల మేరకు నల్లమల అటవీతీర ప్రాంతంలోని గుట్టకొండ నరసింహ స్వామి కొత్త గుడి సమీప ప్రాంతంలో తువ్వపల్లె గ్రామానికి చెందిన ఓ రైతు సాగు చేసిన మినుము పంటలో రెండు రోజుల క్రితం పులి సంచరించినట్లు పాద ముద్రలను రైతులు గుర్తించారు. సోమవారం ఉదయం మినుము పంటకు నీరు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లగా పులి సంచరించిన పాదముద్రలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యానని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమీప రైతులకు తెలియజేశారు.
అలాగే పంట పొలాల్లో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న విశాఖ అధికారులు సిబ్బందిని పురమాయించడంతో పులి సంచరించిన ప్రదేశంలో అటవీశాఖ సిబ్బంది గాలింపు చేపట్టి పులి పాద ముద్రలను సేకరించారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావద్దని అటవీ ప్రాంతం నుండి వన్య మృగాలు, అడవి జంతువులు, పంట పొలాల వైపుకు వచ్చినట్లు తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు. అలాగే పంట పొలాలకు వెళ్లే రైతులు వ్యవసాయ కూలీలు ఒంటరిగా పంట పొలాల్లో ఉండరాదని, కనీసం ఇద్దరు ముగ్గురైన తోడుగా అప్రమత్తంగా పంట పొలాల్లో ఉండాలని అటవీశాఖ సిబ్బంది రైతులకు సూచించారు.