Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Ram Mandir: రామమందిరంతో సామరస్యం సాధ్యమా?

Ram Mandir: రామమందిరంతో సామరస్యం సాధ్యమా?

వైషమ్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి

అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఘట్టం. దేశాధినేత స్వయంగా వచ్చి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ చేయడం, దగ్గరుండి పూజాదికాలు నిర్వహించడం, దేశమంతా పండుగ వాతావరణం నెలకొనడం ఒక చరిత్రాత్మక విశేషమే కానీ, దీని వ్యతిరేకులు మాత్రం తమకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే భయాందోళనలతో కాలం గడపాల్సి వస్తోంది. దేశంలోని రెండు ప్రధాన వర్గాలకు ఇది రెండు రకాల జాతీయవాదంగా కనిపిస్తోంది. రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ అనేవి తప్పకుండా ఒక మైలురాయి లాంటివే. అందులోనూ, బీజేపీ, నరేంద్ర మోదీకి సంబంధించినంత వరకూ ఇది ఒక సమగ్ర విజయమే.
దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమయిందని, ఇది అనేక వేల శతాబ్దాల పాటు కొనసాగుతుందని మోదీ అభివర్ణించడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం. విజయోత్సావాలను జరుపుకోవడంతో పాటు వినయాన్ని కూడా అలవరచుకోవాలంటూ ఆయన, శ్రీరామచంద్రుడిలో ఉన్న ఈ గుణాలు యావత్ మానవాళికి వర్తిస్తాయని అన్నారు.

- Advertisement -

దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, భవిష్యత్ కార్యాచరణకు, భావిఆశయాలకు మధ్య ఈ రామమందిర నిర్మాణం ఒక వారధిలాంటిదని, దేశంలోని వివిధ వర్గాలు, ప్రాంతాలకు ప్రయోజనం కలిగించడానికి దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుందని మోదీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఉన్నతాశయాలు కలిగి ఉండాలని, సంకుచిత భావాలకు అతీతంగా వ్యవహరించాలని, సామరస్యంతో దేశ
పురోగతికి పాటుపడాలని ఆయన కోరారు. రామ రాజ్య స్థాపన అని చెప్పడంలో తమ ఉద్దేశం పురాతన కాలాన్ని ముందుకు తీసుకు రావడం కాదని అంటూ ఆయన, భావి భారతదేశ పురోగతిని దృష్టిలో పెట్టుకుని, కలిసికట్టుగా, సఖ్యతగా ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు.

అయోధ్యలో రామ మందిరాన్ని పూర్తిగా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్మించిన విషయాన్ని విస్మరించవద్దని మోదీ సూచించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందూ పిటిషన్ దార్లకు హస్తగతం చేస్తూ, 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల గొట్టడం చట్టవిరుద్ధ వ్యవహారమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా విస్మరించకూడదు. రామ మందిర నిర్మాణంలో ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న వర్గాలు భవిష్యత్తులో ఇతర వర్గాలకు కూడా ఆశ కల్పించాలని, వారితో సామరస్యాన్ని పెంపొందించుకోవాలని కూడా గుర్తుంచుకోవడం మంచిది. ప్రార్థనా మందిరాలపై వివాదాలను లేవనెత్తడం, వాటిని సానుకూలంగా పరిష్కరించుకుని విజయోత్సవాలు
నిర్వహించడం కలకాలం సాగే వ్యవహారం కాకూడదు. ప్రతి చారిత్రక తప్పిదాన్ని వెలికి తీసి, ఇప్పుడు ప్రతీకారాలు తీర్చుకోవడం వల్ల చివరికి దేశ సమగ్రత, దేశ సమైక్యత దెబ్బతినే అవకాశం ఉంది.

వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ కూడా తన ప్రసంగంలో అంగీకరించారు. రామ జన్మభూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశమంతటికీ వర్తింపజేయడం భావ్యం కాదని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిసారీ గతాన్ని తవ్వుకోవడం అనేది ఏ విధంగానూ సమంజసం కాదు. గత చరిత్రను అడ్డుపెట్టుకుని వైషమ్యాలను, వైరుధ్యాలను పెంచి పోషించుకుంటూ ప్రశాంతతను చెడగొట్టడం కంటే, దీనితో వైషమ్యాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అత్యవసరంగా సామరస్యాన్ని పెంపొందించడానికి పాటపడాల్సి ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుని, సరైన విధంగా, అన్ని వర్గాలనూ కలుపుకునిపోయే విధంగా నిర్ణయాలు తీసుకోవడమే వివేకవంతమైన పాలన అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News