2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా ఆనాడు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సిడబ్ల్యూసి సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం మాజీ మంత్రి డీ కె అరుణ కాంగ్రెస్ పార్టీని 15 కోట్లు డిమాండ్ చేసిందని, అందుకు తనే సాక్ష్యం అని సిడబ్ల్యూసి మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం స్థానికంగా ఒక ప్రైవేట్ పంక్షన్ హాల్ లో నిర్వహించగా ఆయన ఈ సంచలన విషయం ప్రకటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. మాజీ మంత్రి డీ కె అరుణ మీద విమర్శలు చేశారు. నేడు రామ జపం చేస్తున్న ఆమె ఆనాడు తను డబ్బులు అడిగిన విషయం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏ రామాలయం దగ్గరికి రమ్మన్నా తను వస్తాను అని, డీకె అరుణ తన నిజాయితీ నిరూపించుకోవాలంటూ సవాలు విసిరారు. తను చెప్పిన మాట అబద్దం అని రాముల వారి సాక్షిగా చెబితే తను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆయన డీ కె అరుణకు సవాల్ విసిరారు.
యెన్నం బాహుబలి, శ్రీనివాస్ గౌడ్ కాలికేయుడు
పాలమూరు బాహుబలి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అని, కాలకేయుడు వంటి శ్రీనివాస్ గౌడ్ ను చిత్తుగా ఓడించిన ఘనత యెన్నంకు దక్కుతుందని చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. యెన్నంను కాంగ్రెస్ సైనికులు బాహుబలిగా మార్చారని అన్నారు. ఆయన మంచితనం ఇక్కడి ప్రజలకు వరం అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లో 1000 కోట్ల పెట్టుబడితో పార్లేజీ బిస్కెట్ కంపెని మంజూరు అయ్యిందని, దీనివలన ఇక్కడ 3వేల ఉద్యాగాలు వస్తాయని తెలిపారు.పాలమూరు లో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. కష్టకాలలంలో కాంగ్రెస్ కు అండగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం ను గెలిపించి కానుకగా ఇద్దాం అని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్ళు ఎంత మంది వచ్చినా గెలుపు కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టం అన్నారు. ఈ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి, నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణ రెడ్డి, ఎస్ వినోద్ కుమార్, ఒబేదుళ్ల కొత్వాల్, ఎన్ పి వెంకటేష్, ఎమ్ సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, సాయిబాబా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.