Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Seethakka fire on KTR: అధికారం లేనందుకే కేటీఆర్ కు మైండ్ పని చేస్తాలేదు

Seethakka fire on KTR: అధికారం లేనందుకే కేటీఆర్ కు మైండ్ పని చేస్తాలేదు

సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తాం

రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డి. అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న సీతక్క అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై, గత ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అయ్యారు. అధికారం లేకుండా కేసీఆర్, కేటీఆర్ లు ఉండటం లేదని, అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ కు మైండ్ పని చేయడం లేదని, అందుకే విధ్వంస రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

కేసీఆర్ ఫ్యామిలీ అహంకారమే..

తండ్రి, కొడుకు, వారి కుటుంబ సభ్యుల అహంకారమే బి.ఆర్.ఎస్ పార్టీ ఓటమికి కారణమని, తొమ్మిదేళ్లు గడిలలో ఉండి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఇప్పటికి ఇంకా ప్రమాణ స్వీకారం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తమపై మాట్లాడే ముందు కేటీఆర్ బుద్ది వాడాలని, ప్రజలు వ్యతిరేకించినప్పటికి కేటీఆర్ కు ఇంకా నీచపు, కుళ్ళు రాజకీయాలు ఎందుకని అన్నారు. రాష్ట్ర
ప్రజలు తమవైపే ఉన్నారని, మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాల వారు జీర్ణించు కోలేకపోతున్నారని, సోషల్ మీడియా వేదికగా చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తారని, సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లులను పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు.

హుందాగా లేకపోతే మళ్లీ ఇంతే..

గత ప్రభుత్వాల తప్పిదాలతో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నామని, త్వరలోనే అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని అన్నారు. తాము సక్రమంగా పని చేస్తేనే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారని చేయకపోతే అవకాశం ఇవ్వరని గుర్తుచేశారు. ప్రతిపక్ష హోదాలో కేటీఆర్ బుద్దిగా, హుందాగా పని చేస్తేనే ప్రజలు గుర్తిస్తారని, లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారని హితబోధ చేశారు.

రాజన్న మా ఇలవేల్పు..

వేములవాడ రాజన్న తమ ఇలవేల్పని, ఎప్పుడైనా కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామని, అదివాసి కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అని అందుకే రాజన్నను దర్శించుకున్నట్లు, భగవంతుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, తమ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలు ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు సుపరిపాలన అందించేలా దీవించాలని రాజన్నను వేడుకున్నట్లు ఆమె తెలిపారు.

రాజన్న ఆలయాన్ని కనివినీ ఎరుగనట్టు అభివృద్ధి చేస్తాం..

బి.అర్. ఎస్ ప్రభుత్వం హయంలో రాజన్న ఆలయం అభివృద్ధి నోచుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలో రాజన్న ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సీఎం నేతృత్వంలో వేములవాడలోనే సమావేశం ఏర్పాటు చేసి రాజన్న అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తామని, రాజన్న ఆలయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో, చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.

వారి వెంట ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీ రాములు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News