బీహార్ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నాయకుడు అయిన కర్పూరీ ఠాకూర్ కు ఆయన శత జయంతి సందర్భంగా ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించడం అన్నది అన్ని విధాలా సమంజసమైన, ప్రశంసనీయమైన నిర్ణయమే. కొందరికి ఇందులో రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాలు కనిపించినప్పటికీ, ఆయనకు భారతరత్న ప్రకటించడమనేది మాత్రం చాలా గొప్స విశేషం. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాటాలు సాగించిన రాజకీయవేత్త. బీహార్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సాధికారికత కోసం చిత్తశుద్ధితో కృషి చేసిన నాయకుడు. ఆయన పోరాటాల ప్రభావం ఒక్క బీహార్ మీదే కాదు, ఉత్తర భారతదేశమంతటా ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలవారికి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. రాజకీయ జీవితంలో నిరాడంబరంగా, నిస్వార్థంగా ప్రజాసేవ చేయవచ్చనడానికి ఆయన జీవితమే ఒక ప్రబల నిదర్శనం. అట్టడుగు సామాజిక, ఆర్థిక స్థాయి నుంచి పైకి వచ్చిన కర్పూరీ ఠాకూర్ జీవితం రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచింది. ఆయనకు భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం అనేది ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపనే చెప్పాలి. అదే సమయంలో, బీహార్ లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం
పాలకపక్షం ఎంతగా ప్రయత్నిస్తున్నదీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
తమ ఎన్నికల ఎజెండాలో భాగంగా ప్రతిపక్ష ఇండియా కూటమి సామాజిక న్యాయాన్ని, కుల గణనను తలకెత్తుకోబోతోందన్న విషయం తెలిసిందే. దీనికి ప్రతిగానే పాలక బీజేపీ కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో కుల గణన అనే నినాదం ఎంత వరకూ పనిచేస్తుందో తెలియదు కానీ, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఈ నినాదాన్నే నమ్ముకోదలచుకున్నట్టు కనిపిస్తోంది. వెనుకబడిన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయనడంలో సందేహం లేదు. కేంద్ర మంత్రి వర్గంలో వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట వేయడం జరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా వెనుక బడిన వర్గాల నాయకుడినే నియమించారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెనుక బడిన వర్గాలకు చెందిన నాయకుడే. కర్పూరీ ఠాకూర్ కు అత్యున్నత పురస్కారంతో సన్మానించడం కూడా ఇందులో భాగమే. వాస్తవానికి సోషలిస్టులన్నా, సోషలిజమన్నా బీజేపీకి ఇష్టముండదన్న విషయం తెలిసిన విషయమే.
కర్పూరీ ఠాకూర్ ను ఈ పురస్కారంతో సత్కరించదలచుకున్న పక్షంలో ఈ పనిని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో చేసి ఉండాల్సింది. కర్పూరీ ఠాకూర్ కు దీటుగా దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసినవారెందరో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లో రాం మనోహర్ లోహియా, కర్ణాటక దేవరాజ్ అర్స్,
కేరళలో నారాయణ గురు వంటివారు ఎందరో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ అత్యున్నత పురస్కారాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. కర్పూరీ ఠాకూర్ కు కూడా ఇది అవమానకరమైన విషయమేనని అది విమర్శించంది. వాస్తవానికి, భారతరత్న పురస్కారాన్నే కాక, పద్మ పురస్కారాలను కూడా గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. నిజానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పురస్కారాన్నీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే జరిగింది. ప్రతిపక్షాల విమర్శలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పందనలు గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి.