Sunday, October 6, 2024
HomeతెలంగాణR-day in GHMC office: బల్దియాలో రిపబ్లిక్ డే వేడుకలు

R-day in GHMC office: బల్దియాలో రిపబ్లిక్ డే వేడుకలు

ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పథకాల అమలు

రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పథకాల అమలులో రాష్ట్రంలో ముందజలో ఉంటామని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.  75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వివిధ విభాగాల హెచ్.ఓ.డి లు గా పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారని, ఆ పోరాటంలో అసువులు బాసిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు…. మహాత్మాగాంధీ, జవహర్ నెహ్రూ, దాదాబాయ్ నౌరోజి,  మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్,  బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్ మరెందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని, భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన గణతంత్ర రాజ్యంగా అవతరించిన నేటి రోజున గ్రేటర్ హైదరాబాద్ నగరం లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరించడం నా బాధ్యత గా భావిస్తున్నానని తెలిపారు. 

నగర ప్రజలకు అవసరమైన సౌకర్యాల కోసం చేసిన అభివృద్ధి పనులు అందుబాటులోకి తేవడం జరిగిందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ సాధించుకున్న తర్వాతే నగరంలో ఆధునిక పద్దతిలో అనూహ్య వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, గౌ.ముఖ్యమంత్రి సూచనలు, సలహాల మేరకు వినూత్న వ్యూహాత్మక పథకాల రూపకల్పన చేసి నగర వాసులకు ఇబ్బందులను తగ్గించేందుకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, సామాజిక ఆర్థిక పథకాల అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

 హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో  అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేసి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్ర రాజధాని నగరంగా కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో ముందుకు పోతున్న తరుణంలో అందుకు మనమందరం పూర్తి సహకారం అందించాలని కోరారు. 


సాధారణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగిందని, అందుకు అధికారులు విశేష కృషి, ప్రజల సహకారం తో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన అందించాలనే సంకల్పంతో డిసెంబర్ 28 నుండి జనవరి 6 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారని, ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా 5 గ్యారంటీలు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వార్డు వారీగా ఒక్కొక్క లొకేషన్ లో 4 కౌంటర్లను ఏర్పాటు చేసి కౌంటర్ వద్దకు వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరిగిందని తెలిపారు. అభయహస్తం దరఖాస్తు లతో పాటుగా ఇతర వ్యక్తిగత సమస్యల పై వచ్చిన 5.73 వేల విన్నపాలను కూడా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని తెలిపారు.

 ప్రజా పాలన సందర్భంగా అభయహస్తం దరఖాస్తులు నగర వ్యాప్తంగా ఉన్న 150 వార్డు లకు సంబంధించిన దరఖాస్తు లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కలిపి మొత్తం 19 లక్షల 6 వేల 137 రాగా ప్రభుత్వం నిర్దేశించిన కాలవ్యవధి కంటే ఒక రోజు ముందే అట్టి దరఖాస్తులను పారదర్శకంగా డేటా ఎంట్రీ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని తెలిపారు. అందుకు రాత్రింబవళ్ళు కృషి చేసిన జిహెచ్ఎంసి సిబ్బంది, అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో ప్రభుత్వం నిర్దేశించిన ఏ పనైనా చిత్తశుద్ది, అంకిత భావంతో పని చేయాలని ఆశిస్తున్నానని తెలిపారు. నగర ప్రజల వ్యక్తిగత సామాజిక సమస్యల కోసం తిరిగి ప్రజావాణి కార్యక్రమం ను ఈ నెల 8వ తేదీన జోనల్, సర్కిల్ స్థాయి లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మేయర్ గారు ఎల్ బి నగర్, డిప్యూటీ మేయర్ గారు సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం లో పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

జనవరి 22 నుండి హెడ్ ఆఫీస్ లో కూడా ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారం చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంలో జిహెచ్ఎంసి అగ్రభాగాన నిలిచేందుకు దృడ సంకల్పం,  సమన్వయంతో ముందుకు పోయేందుకు కృషి చేస్తామని తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్-2023 లో జిహెచ్ఎంసి కి  5 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం వివిధ అంశంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో అవార్డు లు రావడం కార్మికుల సహకారం, అధికారుల కృషి ఎంతో ఉందని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కడం ప్రతి ఒక్కరి విశేష కృషి ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో అత్యంత ప్రతిష్టమైన అవార్డుకు సమిష్టి కృషి తో ముందుకు పోవాలని కోరారు.
 1. భారతదేశంలో 9వ క్లీన్ సిటీ 2. భారతదేశంలో 5 స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరం
 3. తెలంగాణలో స్వచ్ఛ నగరం
 4. తెలంగాణలో మొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన నగరం (జనాభా > 1 లక్ష)
 5. వాటర్+ సిటీగా మళ్లీ ధృవీకరించబడింది.

ఇదే స్ఫూర్తితో  హైదరాబాద్ నగరానికి ప్రతి ఏటా అవార్డుల దక్కించుకొనుటకు విశేష కృషి చేయాలని, అందుకు అధికారులు, కార్మికులు సమిష్టి కృషి తో పాటు ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 43 మంది అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఖేల్ రత్న అవార్డులు పొందిన క్రీడాకారులకు మెమోంటో లు, ప్రశంస పత్రాలు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఈవిడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, వెంకటేష్ దోత్రె, ఉపేందర్ రెడ్డి, యాదగిరిరావు, సరోజ, జయరాజ్ కెనడి, సిసిపి రాజేంద్రప్రసాద్ నాయక్, హౌసింగ్ ఓ.ఎస్.డి. సురేష్ కుమార్, సి.ఈ దేవానంద్, సి.ఎం అండ్ హెచ్.ఓ డాక్టర్ పద్మజ, యు.బి.డి ఇంచార్జి అడిషనల్ కమిషనర్ సునంద, జాయింట్ కమిషనర్ మైఖేల్ బోస్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.ఎన్.డి.పి సి.ఇ.కృష్ణ, ఈ.ఈ విద్యాసాగర్, ఏ.సి.పి సుదర్శన్, వాల్యుయేషన్ ఆఫీసర్ కులకర్ణి, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News