ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుకను అధిష్ఠానం ఖరారు చేసింది. విజయవాడలో తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ రాయలసీమ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, బుట్టా రేణుక , వైసిపి నేత ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి, బనవాసి బసి రెడ్డి, బుట్టా నీలకంఠ లు కలిశారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, బుట్టా రేణుకల మధ్య చర్చలు జరిగాయి. చెన్నకేశవ రెడ్డిని కలిసిన బుట్టా తనకు సహకారం అందించి అండగా ఉండాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే ఒకే చెప్పారు.
మొదటి లిస్టులో ప్రకటించిన మచాని వెంకటేష్ కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తనయుడు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డికి ఎంఎల్సీ పదవి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. మచాని వెంకటేష్ ను ప్రకటించినప్పటి నుండి ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో బుట్టా రేణుక అయితే బాగుంటుందని అధిష్టానం బావించి వెంకటేష్ ను తప్పించి రేణుక ను ఎంపిక చేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. బుట్టా రేణుకకు టికెట్ రావడం పట్ల ఆమె మద్దతుదారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే వైసిపి శ్రేణులు ఆనందంలో ఉన్నారు.