భారత ప్రజానీకం ఎవరిని నమ్మాలి. మానవ జీవన ప్రస్థానమంతా నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. అది మన కుటుంబ వ్యవస్థ, వృత్తి, ఉద్యోగాలు, వాణిజ్యం, పరిపాలన, అనుబంధాలు ఏవైనా నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. నమ్మకం అమ్మకమైతే పతనమే.. పరాజయమే. మనిషి నమ్మి మోసపోతే కలిగే బాధ అనుభవించే వాడికే తెలుస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు పాలకులను నమ్మి ఓటేసి అధికార పీఠాన్ని అప్పగిస్తే?. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. మనదేశంలో విలాసవంతమైన జీవితాల్లో నాయకులు, ధనికులు బిజీబిజీగా ఉన్నారు. జీవన భారం భరించలేక కడుపులు మాడ్చుకుంటూ పేదరికం కబంధహస్తాల్లో పేదలు నలిగిపోతున్నారు. వీరికి నిలువ నీడ లేదు, పూట గడవడం లేదు. దేశం (రాష్ట్రాల)లో అప్పులు పెరిగిపోతున్నాయి. ధనవంతుల ఆస్తులూ పెరిగిపోతున్నాయి. మరి ఎక్కడ పోతుంది దేశ సంపద. స్వాతంత్రం తరువాత ప్రజాపాలనలో దేశ సంపద ఎవరి పాలయిందో ప్రభుత్వం గణాంకాలే రూఢి చేస్తున్నాయి. భారతదేశంలో ప్రాణం లేని మతాల దేవుళ్లకు గుళ్ళు, చర్చులు, మసీదులు మరియు రాజకీయ పార్టీలు, నాయకుల ఆస్తుల పెరుగుదల అంతం లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రజలకు సేవ చేస్తామని పాలన పగ్గాలు చేపట్టిన వారు దేశంలో నింగి నుండి నేల వరకు అన్నింటిని టోకున కార్పొరేట్, పారిశ్రామికులకు కారు చౌకగా అమ్మేస్తున్నారు. మరోవైపు వారికి రాయితీలు, పన్నులు మినహాయింపులు ఇస్తూ, ఆర్థిక ఎదుగుదలకు మనం ఎంచుకున్న పాలకులే తోడ్పడుతున్నారు. ఓటేసిన ప్రజల బాగోగులు విస్మరిస్తున్నారు. అలా దేశంలో గుప్పెడు మంది చేతిలో జాతి సంపద చేరడం అభివృద్ధి అని చెప్పడం ఈ నాయకులకు భావ్యమా!. ఇదిలా ఉంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దేశంలో పేదరికంలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాదు భారతదేశంలో పేదరికం తగ్గలేదని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక తెలిపింది. ఇలా కేంద్ర ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వము చేయలేని విధంగా వాస్తవాలను కప్పిపెడుతుంది. అధికారిక సమాచారాన్ని తారుమారు చేస్తుంది. తమకు అధికారాన్ని ఇచ్చిన ప్రజలను మరియు ప్రజల వైపు నిలవాల్సిన మీడియా స్వేచ్ఛను నయానో భయానో హరిస్తూ, అక్రమ కేసులు, దాడులతో 180 దేశాల ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిలో 161వ స్థానానికి దిగజారి ఇండియా పరువు తీస్తుంది. గణాంకాలను రాజకీయ ఆయుధాలుగా, ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ఎన్నికలలో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఒకప్పుడు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన జాతీయ గణాంక వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వ చర్యల కారణంగా బలహీనపడి, విశ్వసనీయతను కోల్పోతున్నది. ఇలాంటి చర్యల మూలంగా వాస్తవాలు మరుగున పడుతున్నాయి. సర్వేల ఫలితాలు అటకెక్కుతున్నాయి. ఇవన్నీ మళ్లీ అధికారాన్ని చేపట్టే విన్యాసాలే. ఇలా అయితే వాస్తవాలు ప్రజలకు తెలిసేదెలా? అని ప్రజా సంఘాలు, విశ్లేషకులు బావిస్తున్నారు.
ఇప్పుడు మనదేశంలో సాధారణ ఎన్నికలకు చేరువవుతున్న వేళ చివరి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల చివరి నుంచి పది రోజుల పాటు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల కమీషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. కావున కేంద్ర ప్రభుత్వం ఇంకొన్ని ఓటు బ్యాంక్ కీలక నిర్ణయాలు తీసుకోవచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, నల్లధనం తెస్తామని ఉన్న కరెన్సీని రద్దుచేసి ఆ తర్వాత రిజర్వ్ బ్యాంకు వేదికగా ధనికులకు పక్షపాతం వహిస్తూ దేశాన్ని అప్పుల పాలు చేసింది. బుల్లెట్ ట్రైన్ చూపిస్తూ, రైల్వేలనే అమ్మేసింది. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలే లేకుండా చేశారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని విద్యను ప్రభుత్వం ఆధీనంలో లేకుండా అమ్మేస్తూ, అశాస్త్రీయతను పెంచి పోషించారు. ప్రతిపక్ష పార్టీ (నాయకు)లపై ఈడీ, ఐటీ, సీబిఐ లను ఉసిగొలుపుతున్న అప్రజాస్వామిక విధానం, మరోవైపు జీఎస్టి, సెస్సులు, పన్నులతో ప్రజల అరకొర ఆదాయాన్ని జలగల్లా పీల్చుచూ భారాన్ని మోపుతున్నారు. పేదరికం, ఉపాధిలేమి, నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, అధిక ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్, పంట గ్యాస్ వంటి వాటిపై పన్నులతో పాటు ఆకాశాన్ని తాకుతుంటే.మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల కారణంగా ప్రజల పరిస్థితి ఇప్పుడు “మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా” మారింది. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితిలో పేద, మధ్యతరగతి ప్రజలు విలవిల వాడుతున్నారు. తాజాగా బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పు గుజరాత్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను తప్పు పట్టిన తీరు ఇలాంటి పరిస్థితుల నుండి దేశ ప్రజలను దృష్టి మళ్లించడానికి మత రాజకీయాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి రాబోవు ఎన్నికల్లో లబ్ధి కోసం ఓటు బ్యాంకు విన్యాసాలకు పూనుకుంటున్నారు. ప్రజాస్వామ్య, లౌకిక రాజ్యంలో ఇలాంటి చర్యలను ప్రజలు విజ్ఞతతో చూడాల్సి ఉంటుంది. రాజకీయాలతో మతాన్ని ముడిపెడుతున్న క్రమంలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలా! వద్దా ! అనే అంశంపై అనేక పార్టీలు తేల్చుకోలేకపోతున్నాయి. వాస్తవానికి అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం వారి సొంత ఈవెంట్ గా మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోబోతుంది. ఎన్నికల విజయం కోసం మతాన్ని వాడుకోవడం లౌకిక రాజ్యంలో అప్రజాస్వామికం. భారత రాజ్యాంగం మేరకు ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది, కాని ప్రభుత్వానికి లేదనే వాస్తవాన్ని గ్రహించాలి.
రాబోయే ఎన్నికల్లో గత 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకతను దృష్టి మళ్ళించడానికి పాన్ ఇండియా కథనాన్ని వండి వార్చారు. ఈ కథనం కాశ్మీరు లేదా పాకిస్తాన్ అంశాల కంటే భావోద్వేగాలను పురికొల్పే విధంగా ఉంది. ఈ అంశాల గురించి ప్రతిపక్షాలు, మీడియా, ప్రజాసంఘాలు వాస్తవాలను ప్రజలకు, ఓటర్లకు అవగాహన కల్పించాలి. రాముడు రాజకీయాలకు అతీతుడు అన్న విషయాన్ని ప్రజల మనసులో నాటేలా చేయాలి. ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్న రాజకీయ పార్టీకి, ప్రజల మత విశ్వాసాలకు సాధనంగా మారడాన్ని అనుమతించకూడదని స్పష్టం చేయాలి. ఓ హిందువు రాముడిని విశ్వసించే వాడు కేంద్రానికి ఓటర్ కానక్కర్లేదని నచ్చ చెప్పాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకే రామ మందిరాన్ని నిర్మిస్తున్న వాస్తవాన్ని ప్రతిపక్షాలు, మీడియా, ప్రజా సంఘాలు ప్రజలు గుర్తించేలా ప్రయత్నించాలి. రాజకీయ మందిరంగా మార్చిన ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ సమాజం కూడా ఉంది. రాజకీయ పార్టీ వేరు? రాముడు వేరు? అనే భావన కల్పించే మతగురువులు కొందరు దీన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సి ఉంది. ఇక పౌరులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంక్లిష్ట భావోద్వేగ పరిస్థితులను విచక్షణతో ఆలోచిస్తూ.. ఎన్నికల్లో ఓటు కోసం వచ్చిన వారిని తన రోజువారి జీవితంపై ప్రభావం చూపే అంశాలపై ప్రశ్నించాలి. సార్వత్రిక ఎన్నికల ముందు ఓటర్లు ప్రభుత్వాన్ని ఏమని అడగాలంటే? ఉద్యోగ అవకాశాలు కల్పించారా! మీరు ధరలను అదుపు చేసేందుకు ఏం చేశారు. ప్రజలకు వైద్యం- ఆరోగ్యం, విద్య అందుబాటులో ఉంచేందుకు ఏం చేశారు. మన సరిహద్దులు సురక్షితంగా భద్రంగా ఉండేందుకు మీరు ఏం చేశారు? అంతేకాదు సరిహద్దుల సంగతి ఏమో కాని మొన్న పార్లమెంటుపై దుండగులు చేసిన దానికి మూడు అంచెల భద్రతా లోపం ప్రభుత్వ వైఫల్యం కాదా!. ఇట్లా ప్రజల జీవన వికాసానికి, అభివృద్ధికి తోడ్పడే అంశాలను పక్కనపెట్టే ద్వంద్వ విధానాలను గురించి ప్రజలు విజ్ఞతతో అర్థం చేసుకోవాలి. పాలకులకు ప్రజల జీవన స్థితిగతులపై కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఎందుకంటే వారి జీవితాలను బాగు చేయాలంటే ఆ అవగాహన అవసరం. ప్రజలు ఎలా జీవిస్తున్నారు, వారు ఏం పని చేస్తున్నారు. ఎంత అర్జిస్తున్నారు. ఆదాయం-సంపదల్లో, సామాజిక లింగ పరమైన అసమానతలు, కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా.. విద్యా నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి వంటి వాటిని ప్రభుత్వం వాస్తవాలు తెలియజేయకుండా, వీటిపై దృష్టి సారించకుండా రెచ్చగొడుతూ మతాలకు రాజకీయ రంగు పులమడం ఎంత మాత్రం క్షేమం కాదు. ఈ అసమాన ఆర్థిక, సామాజిక భారతంలో 10 ఏళ్ల పాలనలో మీరేం సాధించారో ఎన్నికల ముందు చెప్పండి. మీరు ఇంకేం చేయబోతున్నారో చెప్పండి. కానీ ఇలాంటి తప్పుదారి పట్టించే విధానాలు ఏ మాత్రం క్షేమము కాదు, వాస్తవాలను దాస్తున్నారు. మనిషి ఉన్నతమైన దేవాలయాన్ని ( మతమేదైనా) నిర్మించవచ్చు కాని విద్యాలయం జీవితంలో ఉన్నత మార్గాన నిలుపుతుందనే యదార్థాన్ని విస్మరించకండి..
మేకిరిదామోదర్, సామాజిక విశ్లేషకులు, వరంగల్.