Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్One nation one election: ఏక కాలంలో ఎన్నికలు సాధ్యమా?

One nation one election: ఏక కాలంలో ఎన్నికలు సాధ్యమా?

జమిలి ఎన్నికలపై పెరిగిన కసరత్తు

జమిలి ఎన్నికల వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి మళ్లీ కొన్ని కార్యకలాపాలు ఊపందుకోవడంతో అందరి దృష్టీ దీని మీద పడింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించింది. జమిలి ఎన్నికలపై జనవరి 5 నుంచి 15 లోపల తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడు అయిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ కమిటీకి దీనిపై 20,972 సూచనలు, అభిప్రాయాలు అందాయని, ఇందులో 81 శాతం అభిప్రాయాలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయని తెలిసింది. దేశంలోని మొత్తం 56 నమోదైన పార్టీలలో 17 పార్టీలను నుంచి ఈ కమిటీకి ప్రాతినిధ్యాలు అందినట్టు కూడా తెలిసింది. అంతేకాక, జమిలి ఎన్నికలపై కోవింద్ పలు వురు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, న్యాయ నిపుణులు తదితరులతో ఇప్పటికే
సంప్రదింపులు ప్రారంభించారు.

- Advertisement -

ఈ కమిటీ తదుపరి సమావేశం జనవరి 27న జరిగే అవకాశం ఉంది. ఈ కార్యకలాపాలనన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, జమిలి ఎన్నికలపై కసరత్తులో వేగం పెరిగిందనే విషయం అర్థమవుతుంది. ఈ ప్రతిపాదనను అతి త్వరలో అమలు చేసే అవకాశం కూడా ఉందని భావించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనకు నీతి ఆయోగ్, లా కమిషన్ ఇప్పటికే ఆమోదం తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనేక పర్యాయాలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపారు. 2019లో తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో కూడా మోదీ దీని గురించి ప్రస్తావించి తన మద్దతును తెలియ జేయడం జరిగింది. 2017లో పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో కోవింద్ కూడా దీనికి తన అనుకూలత తెలియజేయడం జరిగింది. ఇక ఈ ఉన్నత స్థాయి కమిటీలోని ఇతర సభ్యులు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నట్టు తెలిసింది. దీన్ని గట్టిగా వ్యతిరేకించే సభ్యుడు అధీర్ రంజన్ చౌధురి మాత్రమే. అయితే, ఆయన ఈ కమిటీ సమావేశాల్లో పాల్గొనడం లేదు.

ఈ కమిటీ నియామకం తీరును బట్టే కేంద్ర ప్రభుథ్వం ఈ కమిటీ నుంచి సానుకూల నివేదికను ఆశిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే, అనేక వర్గాలు, పార్టీలతో సంప్రదించకుండా ఈ కమిటీ ప్రతిపాదనలను హడావుడిగా ఆమోదించడం భావ్యం కాదు. వివిధ కారణాలతో కాంగ్రెస్, మరి కొన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను ఇప్పటికే తిరస్కరించడం జరిగింది. కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఈ ప్రతిపాదన బాగా అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం కొన్ని పార్టీల్లో నెలకొని ఉంది. అంతేకాక, ఇది రాష్ట్రాల సమాఖ్య మూల సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమనే భావన కూడా ఉంది. జమిలి ఎన్నికలను నిర్వహించే పక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఇ.వి.ఎం) సంఖ్యను బాగా పెంచాల్సి ఉంటుందని, అందువల్ల 2029 లోపు జమిలి ఎన్నికలను నిర్వహించడం సాధ్యపడదని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పెద్ద సంఖ్యలో ఇ.వి.ఎంలను సమకూర్చలేకపోయిన పక్షంలో కొన్ని రాష్ట్రాల్లో అయినా బ్యాలెట్ పేపర్లను వాడాల్సి ఉంటుందని కూడా అది తెలిపింది.

నిధులు, ఓటింగ్ మెషీన్ల గురించే కాక, అనేక న్యాయపరమైన, చట్టపరమైన, రాజకీయ సంబంధమైన, ఆచరణాత్మకమైన అంశాలను కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అసలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థనే పునర్నిర్మించాల్సి ఉంటుంది. దేశంలోని విస్తృత స్థాయి రాజకీయ, సామాజిక వైవిధ్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణామం, పరిపక్వత చెందుతున్న క్రమంలో సహజసిద్ధంగా రాజకీయాలు ముందుకు సాగకుండా ఈ ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ నినాదం అడ్డుపడే ప్రమాదం ఉంటుంది. అనేక ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలో కొద్దిపాటి నిధుల మిగులు, కొన్ని సానుకూలతలు, అవకాశాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇది ఒక అప్రజాస్వామిక
లక్ష్యం కోసం ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించడమే అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News