బీసీ, మైనారిటీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్స్ తో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ రివ్యూలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలన్న సీఎం రేవంత్, అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామన్నారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని, అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలన్నారు. ఆ తరువాత సొంత భవనాలు నిర్మించేందుకు అంచనా వ్యయాన్ని రూపొందించాలన్నారు. కళ్యాణమస్తు పథకం ద్వారా నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ ను రూపొందించాలని రేవంత్ ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ గా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు అంశంపై పూర్తి అధ్యయనం చేయాలని సీఎం అన్నారు.