“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అన్న దాశరధి మాటలు.. “తెలంగాణలో కవులు లేరు అన్నమాటకు చెంపపెట్టుగా “గోల్కొండ కవుల సంచిక” తెచ్చిన సురవరం ప్రతాపరెడ్డి గారు,” యాది” అంటూ తన జీవిత అనుభవాలను మొత్తం తెలంగాణ మాండలికంలో రాసుకున్న సామల సదాశివ గారు… “బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష గావాలె” అని నినదించిన కాళోజి గార్ల మాటలకు ప్రాణం పోస్తూ.. మన బాల సాహితీ ప్రవీణ పైడిమర్రి రామకృష్ణ గారు “జోర్దార్ కతలు” పేరిట తెలంగాణ భాషలో 12 కథలు కలిగినటువంటి ఒక బాలల కథల పుస్తకాన్ని తీసుకొచ్చారు.
నేటి సాంకేతిక యుగంలో పిల్లలంతా ఆంగ్లభాషకే అలవాటు పడ్డారు. కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ భాష కనుమరుగై పోతుందేమో అని భయం కూడా కలుగుతుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణ భాషకు పట్టం కడుతూ తెలంగాణ యాసలో కథలను తీసుకొచ్చారు మన పైడిమర్రి రామకృష్ణ గారు.
1969 నుండి మొదలైన తెలంగాణ ఉద్యమం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రంగా పురుడు పోసుకుంది. ఈ దశాబ్దాల కాలంలో తెలంగాణ భాష ఆంధ్ర పాలకుల చేతుల కింద నొక్కి వేయబడింది. సినిమాల్లో.. సీరియల్లో తెలుగు భాషను ప్రయోగిస్తున్నామని చెప్పి, తెలంగాణ భాషను హాస్యం కోసం ఉపయోగించేవారు.
ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ తరువాత తెలంగాణ భాషకు పట్టంగడుతూ సినిమాల్లో హీరోలకు ..ప్రధాన పాత్రలకు తెలంగాణ భాషను పెట్టడం గర్వించదగిన విషయం.
12 కథలు కలిగిన జోర్దార్ కథల పుస్తకంలో మొదటి కథ “ఉల్టా పల్టా” ఒకసారి గుడ్డేలుగుకు కోడి కూర తినాలన్న ఖాయుష్ కలుగుతుంది.”పదా నేను చాలా సార్లు తిన్న. నీకు కూడా తినిపిస్తా..” అని గుడ్డేలుగును నక్క తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏనుగు గేటు దగ్గర నిలబడి ఎవరు మీరు? అంటే నక్క బింకనాలకు పోతుంది. పిలవని పేరంటానికి పోతే ఏం జరిగింది?అని తెలుసుకోవాలంటే ఆ ఉల్టా పల్టా కథ చదవాల్సిందే!. మంచి హాస్యంతో పాటు ,నీతిని కూడా బోధిస్తుంది.
“ఎవరి గొప్ప వాళ్ళది” అనే కథలో బాతుకు కొంగకు దోస్తు కుదురుతుంది. అయితే కొంగకు బాతు అంటే చాలా అలకన. ఒకసారి దావత్ కు పోదామని రమ్మంటే బాతుతోని పోతే లేట్ అయితదని కొంగ అనుకుంటుంది. మరి బాతు ముందు చేరిందా? ఎవరు దావత్ కు వెళ్లారు.కొంగ కు ఎలా బుద్ధి చెప్పింది? అనే విషయం గురించి తెలుసుకోవాలంటే కథను చదవాల్సిందే. అన్ని కథలు మనకు ఆనందాన్ని,హాస్యాన్ని,మంచి బోధిస్తాయి.
అల్కగా,ఎర్క, నడ్సుకుంటా, సమాజ్ కాలే, గిట్లెందుకు, ఇలా అనేక పదాలు ఈ తరం విద్యార్థులకు కొత్తగా పరిచయం చేసినట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ భాషకు పట్టం కట్టిన “జోర్దార్ కతల “పుస్తక ముఖ చిత్రం చాలా బాగుంది. కథలకు తగ్గ బొమ్మలు వేసిన వడ్డేపల్లి వెంకటేష్ అభినందనీయులు. ఇంకా ఎందుకు ఆలస్యం మీరూ చదవండి. తెలంగాణ భాషా మాధుర్యాన్ని రుచి చూడండి.
పుస్తకం వెల 80 రూపాయలు. పుస్తక ప్రతులకు పైడిమర్రి రామకృష్ణ 92475 64699 ను సంప్రదించండి.
ముక్కామల జానకీరామ్
బాల కథా రచయిత
6305393291.