Friday, October 18, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: బాలసాహిత్య రచన - ఆసక్తి

Telugu literature: బాలసాహిత్య రచన – ఆసక్తి

బాల్యంలో బాగా చదివే పిల్లలు మంచి రచయితలు అవుతారు

మనం ఒక పనిని ‘ఆసక్తి’ తో అంటే ‘ఇష్టపడి’ చేస్తే దాని ఫలితం కూడా అద్భుతంగా వస్తుంది. ఆసక్తి లేకుండా ఏ పనిని మొదలు పెట్టలేము. అది మనము చదవటమో, రాయటమో, వినటమో ..ఏదైనా కావచ్చు.సాహిత్యం రాయాలన్నా దానిపై మొదట మనకు ఇష్టం కలగాలి.అది పెద్దలకోసం రాసే సాహిత్యమైనా, బాలలకోసం రాసే బాలసాహిత్యమైనా !. కథలు రాయాలంటే మొదట కథలు ఇష్టపడి చదవాలి. అలా చదవగా ..చదవగా కొందరికి తాము కూడా రాయాలన్న ఆసక్తి కలుగుతుంది.
కేవలం ఆసక్తి ఉంటేనే సరిపోదు. ఆ దిశగా కృషి చేయాలి. మెళకువలు నేర్చుకోవాలి. అలా కథలు రాయటం ప్రారంభించి విలువైన బాలసాహిత్యం సృష్టించిన బాలసాహితీవేత్తలు ఎందరో ఉన్నారు. పెద్దలు రాసిన బాలసాహిత్యం చదవకుండా రాయటం అసాధ్యం. నాకు తెలిసి అలా రాసిన వారు ఒక్కరు కూడా ‘ బాలసాహితీవేత్త ‘ గా రాణించలేక పోయారు. నేడు ప్రముఖ బాలసాహితీవేత్తలుగా గుర్తించబడిన వారంతా బాల్యంలో బాలసాహిత్యం ఇష్టపడి విన్నవారే.. చదివినవారే !. ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత, వందకు పైగా బాలసాహిత్య గ్రంథాలు రాసిన చొక్కాపు వెంకటరమణ బాల్యంలో మొదట తన అక్కయ్య చెప్పే కథలు వినటం అలవాటు చేసుకున్నారు. ఆమె బాల, చందమామ పత్రికలు చదివి కథలు చెప్పేది.

- Advertisement -

కథలంటే ఇష్టం ఉండటంతో ఆ తరువాత సొంతగా పుస్తకాలు చదవటం మొదలు పెట్టారు. అప్పటి బాల సాహితీవేత్తల పుస్తకాలు చాలా చదివారు. దాంతో ఒకరోజు తనకూ కథలు రాయాలనిపించింది. 6 వ తరగతిలో రాసిన మొదటి కథ 1962లో ”చంద్రభాను’ పత్రికలో అచ్చయింది. ఆ రోజుల్లో బాలానందం, బాల రాజ్యం, బాలబంధు పత్రికలకు వీరు పంపిన కథలు కొన్ని మార్పులతో అచ్చయ్యాయి. కథలు ఎలా రాయకూడదు , ఎలా రాయాలి అనే మెళకువలు పెద్దలు రాసిన కథలు చదివే నేర్చుకున్నారు. పత్రికలు, పుస్తకాలు, డిటెక్టివ్ నవలలు చిన్నప్పటి నుంచీ వీరిలో చదివే అలవాటును పెంచాయి. భాష మీద అవగాహన కలిగించాయి. చొక్కాపు వెంకటరమణ 12 వ తరగతి లో రాసిన ‘అల్లరి సూర్యం’ నవల ‘ప్రగతి’ వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. చిన్న వయసులోనే ఒక నవల రాసే స్ధాయికి ఎదిగారంటే కారణం బాలసాహిత్యంపై ప్రేమను పెంచుకోవటమే !.
మరో ప్రముఖ బాలసాహితీవేత్త, చందమామ ఉప సంపాదకులుగా సేవలందిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్
4వ తరగతి నుండే బాలసాహిత్యం చదవటం ప్రారంభించారు. చందమామ, బాలమిత్ర వంటి పత్రికలు వీరి తండ్రి కొని ఇంటికి తెచ్చి చదివించేవారు. బాల్యం నుండే గ్రంథాలయానికి వెళ్ళే అలవాటు చేసుకున్నారు. అలా బాలల పత్రికలు చదవగా, చదవగా 8వ తరగతి చదివేటప్పుడు కథలు రాయాలనే కోరిక కలిగింది.రాసి ‘ బాలమిత్ర’ కు పంపారు. కానీ, ప్రచురణ కాలేదు. ఐతే చదవటం మాత్రం ఆపలేదు. పట్టుదలతో 10వ తరగతిలో రాసిన ‘ కబుర్ల దేవత ‘ అనే కథ రాసి పంపారు. ఆ కథ అచ్చయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాస్తూనే వున్నారు. ఎక్కువగా ‘ చందమామ ‘ కు రాశారు. ఒక విధంగా చెప్పాలంటే అచ్చులో పేరు చూసుకోవాలనే కోరికే వీరు రచయిత కావటానికి కారణం. ‘చందమామ’ చదవడమే మంచి శైలిని వీరికి నేర్పింది. బాలల కథలమీదే పరిశోధన చేయడం చందమామలో పనిచేయటం వలన బాలసాహిత్యంతో వీరికి గాఢమైన అనుబంధం కలిగింది.
ఇంకో ప్రముఖ బాలసాహితీవేత్త, పొట్టి శ్రీరాములు సాహితీ పురస్కార గ్రహీత, చందమామలో దయ్యాల కథలు రాసిన మాచిరాజు కామేశ్వరరావు తన బాల్యంలో తెలుగులో ఉత్తరాలు చాలా బాగా రాసేవారు. తెలుగు బాగా రాయటం గమనించిన వీరి తండ్రి ఒక కథా వస్తువు యిచ్చి కథ రాయన్నారు. దాన్ని కథగా అల్లి ‘చందమామ ‘ కు పంపించారు. అది ‘ గుడ్డి వాడి డబ్బు’ పేరుతో సెప్టెంబర్ 1969 చందమామలో అచ్చయింది. అప్పుడు వీరి వయసు 14 ఏళ్లు. చిన్నవాడే కాబట్టి అప్పటి నుంచీ పిల్లల కథలే సొంతంగా ఆలోచించి రాయటం మొదలు పెట్టారు. మొదట్లో కథలు తిరిగి వచ్చినా నిరుత్సాహ పడకుండా రాస్తూనే వుండేది. రాసినకొద్దీ శైలి మెరుగు పడటమే కాకుండా కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తూ ఉండేవి. ఆ విధంగా చందమామ లో 256 కథలు రాశారు.
ఇంకా ఇతర పిల్లల పత్రికలలో వందకుపైగా కథలు అచ్చయ్యాయి. ఇలా బాల్యంలోనే బాలసాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న కలువకొలను సదానంద, దాసరి వెంకటరమణ, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, రెడ్డి రాఘవయ్య, డి.కె. చదువులబాబు, పుప్పాలకృష్ణమూర్తి, భూపాల్ వంటి ప్రముఖులంతా ఇష్టపడి మొదటితరం బాలసాహితీవేత్తల రచనలు విని, చదివి, మెళకువలు నేర్చుకుని మాత్రమే రాయటం మొదలు పెట్టారు. ఇక మనం కథ రాయాలంటే ‘ కథా వస్తువు ‘ కావాలి కదా ! కథా వస్తువు అంటే ఏమిటి ? ఎలా దొరుకుతుంది ? మన పెద్దలు కథ కోసం ‘ విషయాలు ‘ ఎలా తీసుకుంటారో వచ్చేవారం తెలుసుకుందాం

— పైడిమర్రి రామకృష్ణ
(కోశాధికారి – బాలసాహిత్య పరిషత్)
సెల్ : 92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News