కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. 20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా గుర్తింపు పొందారు ఆయన. జాతిపిత మహాత్మాగాంధీ శారీరకంగా దుర్బలుడు అయినా, మానసికంగా మేరు నగధీరుడు. అహింస, సహాయ నిరాకరణ ఉద్యమం లాంటి విషయాల్లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, బరాక్ ఒబామా లాంటి ఎందరో మేధావులకు ప్రేరణగా నిలిచిన గాంధీ జీవితంలో ఆరోగ్య రక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు, ఆచరణ పద్ధతులు ఉండేవి. దేశ స్వాతంత్ర సాధనే ఏకైక లక్ష్యంగా, సత్యాగ్రహమే ఆయుధంగా, అహింసా మార్గంలో పయనించి, నిరంతరం అంకిత భావంతో పోరాటాలను నడిపించి, పలు మార్లు జైలు పాలైనా, ఆహారపు అలవాట్లను ఖచ్చితంగా ఆయన పాటించారు. అసలైన విలువ అనేది మన ఆరోగ్యంలోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము” అని అంటుండే వారు.. గాంధీజీ ఐదేళ్ల పాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాల పాటు ప్రయోగాలు చేశారు. “ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం, గాంధీ డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్, కీ టు హెల్త్ ” అనే పుస్తకాలు కూడా రచించారు. సాత్వికాహారంతో మనిషి బుద్ధి వికసిస్తుందని గాంధీగారు త్రికరణ శుద్ధితో విశ్వసించే వారు. లండన్ లోనూ గాంధీ శాకాహారిగానే ఉండేవారు. విధి లేక శాకాహారం తినడం కాదు, లండన్ లో స్వయంగా గాంధీ శాకాహారాన్ని ఎంపిక చేసుకున్నారని, తన రూమ్మేట్ సహాయంతో “లండన్ వెజిటేరియన్ సొసైటీ” ఉందనే వాస్తవం కూడా గాంధీజీ తెలుసుకున్నారని, చివరకు గాంధీ, ఆయన మిత్రుడు వారి నెం.52, సెయింట్ స్టీఫెన్స్ గార్డన్, బేస్ వాటర్ హోమ్ లో మిత్రులకు పప్పుల చారు, అన్నం, ఎండు ద్రాక్షలతో విందు చేసేవారని “గాంధీ బిఫోర్ ఇండియా” అనే పుస్తకంలో చరిత్రకారుడు రామచంద్రగుహ వివరంగా రాశారు. ఇక గాంధీ డైట్ అండ్ డైట్ రిఫార్మ్స్, ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజమ్, కీ టు హెల్త్ అనే పుస్తకాలు కూడా రచించారు. గాంధీజీ ఉద్దేశ్యంలో మంచి ఆహారపు అలవాట్లు అనేవి మంచి ఆరోగ్యానికి తప్పనిసరి. ఒక్కో వ్యక్తి శరీరం దాని తత్వాన్ని బట్టి, ఒక్కో రకమైన ఆహారానికి అలవాటుపడుతుంది. కాబట్టి, దానికి అనుగుణంగానే మనిషి ఆహారపు అలవాట్లను చేసుకోవాలి.
తాను శాకాహారానికే ప్రాధాన్యం ఇస్తానని గాంధీజీ చెప్పేవారు. శాకాహారంలోకి పాలు, పాల ఉత్పత్తులను కూడా చేర్చాలని గాంధీజీ అనేవారు. పాలు, పాల ఉత్పత్తులను ఆరేళ్ళ పాటు సేవించక పోవడం వల్ల విరోచనాలతో బాధపడ్డాననీ, కట్టె పోగులా తయారయ్యాననీ, ఎంతమంది సలహా ఇచ్చినా మందులు తీసుకోలేదని, మేక పాలను తాగడం వల్ల తాను మళ్ళీ మామూలు స్థాయికి చేరుకున్నాననీ, గాంధీజీ తన ఆత్మ కథలో వివరించారు. గాంధీ తొలుత పాల పదార్థాలకు దూరంగా ఉండేవారు. కేవలం ఒక వెజిటేరియన్‌గానే ఉండాలని కోరుకొనేవారు. అయితే సమయానుసారం తన ఆహారపు అలవాట్లలో మార్పులు సంభవించాయి. పాల ఉత్పత్తులను మానేయాలని గాంధీజీ భావించారు. కానీ ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తర్వాత మేకపాలు తాగడం ప్రారంభించారు. తాజా మేక పాలకోసం కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లేవారు.. వైద్యుడి సలహా మేరకు మేక పాలను తన డైట్‌లో భాగంగా చేసుకున్నారు. ఆహారం అనేది ప్రాణాన్ని నిలబెట్టేందుకే అయినప్పటికీ, మితాహారం, సాత్వికాహారం వల్ల మనిషిలో ఆలోచనా శక్తి పెరుగుతుందని గాంధీగారు విశ్వసించేవారు. పాలు సంపూర్ణ ఆహారం కావడం వల్ల దేహం ఎదుగుదలకు కావల్సిన మాంస కృతులు, విటమిన్లు లభ్యమవుతాయని, అలాగే తృణ ధాన్యాలు, వరి, జొన్న, రాగులు వంటివి కూడా శరీరానికి బలం ఇస్తాయని గాంధీజీ విశ్వసించేవారు. ఆయన ఆహారంలో ఒక లీటరు మేక పాలు, 150 గ్రాముల చిరు ధాన్యాలు, 75 గ్రాముల ఆకుకూరలు, 125 గ్రాముల కాయగూరలు, 25 గ్రాముల సలాడ్లు, 40 గ్రాముల నెయ్యి, 40 గ్రాముల పంచదార ఉండేటట్లు చూసుకున్నారు. భుక్తాయాసం వచ్చేవరకూ ఆహారం తీసుకోవడం, అతినిద్ర, అలసత్వం మనిషికి శత్రువులని ఆయన తరచూ అనేవారు. భోజనం వేళ దాటిపోయిన తర్వాత చిరు ఆకలి అనిపిస్తే ఆయన వేరుశనగ గుళ్ళు తినేవారు. సబర్మతిలో ఆహారం అంటే ఉడికించిన వంకాయ, బీట్రూట్, మరికొన్ని కూరగాయలు, వెన్న లేని రొట్టె.. నెయ్యి కూడా ఉండదను, దాన్ని మందులాగా కష్టపడి తినేవారన్న విషయాలు గ్రంథస్థాలు. వెల్లుల్లిని పేదవారి కస్తూరి అని పిలుస్తారని గాంధీ పొర్కొన్నారు. చివరి దశకాల్లో గాంధీ చాలా ఆహారపు అలవాట్లను విడిచిపెట్టారు. మసాలా దినుసులు మానివేశారు. ఉడికించిన కాయగూరలు మాత్రమే తినేవారు. ఉల్లి, వెల్లుల్లి లేకపోతే గ్రామీణులు ఇంకేం తింటారని కూడా ప్రశ్నిస్తారు. తల్లితండ్రులు తమ పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలనీ, పిల్లల చదువు విషయంలోనే కాకుండా, ఆహార, విహారాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలని గాంధీజీ ప్రబోధించారు. బాల్యం నుంచే వారికి మంచి అలవాట్లు అబ్బేట్టు చూడాల్సిన బాధ్యత తల్లితండ్రుల దేనని ఆయన అన్నారు. భారత స్వాతంత్ర సమరం సాగుతున్న సమయంలో మహాత్మ గాంధీ అనేకసార్లు నిరాహారదీక్షను పాటించారు. దాదాపు 17 సార్లు ఉపవాసాన్ని ఒక వ్రతంగా స్వీకరించారు. అత్యధికంగా 21 రోజులు కేవలం తక్కువ మోతాదులో ద్రవాలను మాత్రమే తీసుకుంటూ నిరాహారదీక్ష చేశారు. తన అహింస సిద్దాంతాల్లో భాగంగా ఈ అంశం గురించి పేర్కొన్నారు. పలువురు ఆయుర్వేద వైద్య నిపుణుల ప్రకారం స్థూల కాయాన్ని తగ్గించుకోవడం, రక్తపోటును నియంత్రించుకోవడం, కొవ్వును తగ్గించు కోవడం లాంటివన్నీ కూడా పలు ఉపవాస నియమాల వల్ల సాధ్యమే. శారీరక శక్తి కోసం తినడం ఎంత అవసరమో, మానసిక శక్తి కోసం మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలనీ, గాంధీజీ నిరంతరం ధ్యానంలో నిమగ్నమయ్యేవారనీ, ఆయన మానసిక శక్తిలోని అసలు రహస్యమని పలు సందర్భాలలో గాంధీ చెప్పేవారు. మనిషి తన మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ప్రశాంతతను పెంపొందించుకోవడం కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నది గాంధీ సిద్ధాంతం. ఆయన ప్రతీరోజు ధ్యానం చేసేవారు. మరియు ఎక్కువసేపు ప్రార్థన చేసేవారు. ఆయుర్వేదం ప్రకారం కూడా ధ్యానం చేయడం వలన మానసిక రుగ్మతలు దూరం అవుతాయని చెపుతారు. గాంధీజీ ప్రబోధించిన అనేక విషయాలను ఆరోగ్య వికాసానికి ముడిపెడితే కొన్ని మంచి విషయాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు నిద్రలేమిని అరికట్టడం అనే విషయాన్ని గురించి తరిచి చూస్తే గాంధీ కూడా తొలుత కేవలం నాలుగు నుండి అయిదు గంటలు మాత్రమే నిద్రకు కేటాయించేవారు. అయితే తర్వాత రాత్రిళ్లు ఎక్కువ సేపు మేల్కొని ఉండకుండా, వేగంగా నిద్రపోవడం మరియు వేగంగా నిద్రలేవడం అనే నియమానికి కట్టుబడి ఉండేవారు. సూర్యోదయానికి ముందు నిద్రలేచి ధ్యానం చేయడం వలన శరీరంలో ఒక ఉత్తేజం ప్రారంభమై, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతామని ఈ ఉదాహరణ చెబుతోంది. అలాగే దండీ మార్చ్ చేసిన బాపూజీ జీవితం నుండి ఆ అంశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, నడక వలన కలిగే ఉపయోగాలు తెలుసుకోవచ్చు. గుండె బలహీనతను తగ్గించుకోవడం, కొవ్వు కరిగించుకోవడం, పక్కటెముకలు పటిష్ట పడేలా చూసుకోవడానికి నడక ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ప్రతీ వ్యక్తి రోజుకు ఎంతోకొంత దూరం నడవడం తప్పని సరిగా భావించాలి. గాంధీజీ నూరు శాతం శాకాహారి. మితాహారి. మిత భాషణుడు. గాంధీజీ 46.7 కిలోల బరువు ఉండేవారు. ఎత్తు 1.64 మీటర్లు. 78వ ఏట ఆయన నాథూరామ్ గాడ్సే జరిపిన కాల్పుల్లో మరణించారు.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494