Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Indo-France relations stronger: ఫ్రాన్స్, ఇండియా బంధం పటిష్టం

Indo-France relations stronger: ఫ్రాన్స్, ఇండియా బంధం పటిష్టం

అమెరికా, రష్యాలతో కుదరని అభిప్రాయాలు ఫ్రాన్స్ తో కుదిరాయి

భారత, ఫ్రాన్స్ దేశాల మధ్య గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇది నిజంగా ఎంతో సంతోషించాల్సిన విషయం. ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఎప్పుడు భారత ప్రధాని సమావేశమైనా కొత్త ఒప్పందమేదో చోటుచేసుకోవడం జరుగుతోంది. నిజానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మ్యాక్రాన్ భారత్ రావడం వల్ల ఉపయోగమేమీ లేదు. ఆయనను ఒప్పందాల కోసమో, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడానికో ఆహ్వానించి ఉంటే అది వేరే విషయం. అయితే, ఆయనను కేవలం ఒక అతిథిగా మాత్రమే ఆహ్వానించడం జరిగింది. పైగా మ్యాక్రాన్ కు ఇక్కడ ఎక్కువ సేపు ఉండే సమయం కూడా లేదు. ఆయనతో గతంలోనే ఒప్పందాలు పూర్తయి, కేవలం సంతకాల కోసమే ఢిల్లీ రావడం జరిగింది.

- Advertisement -

ఫ్రెంచ్ అధ్యక్షుడు భారతదేశానికి గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అతిథిగా రావడమనేది ఇది ఆరవసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఇక్కడకు రావడం కుదరకపోయే సరికి మ్యాక్రాన్ ను ఆహ్వానించడం జరిగింది. గత ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ, మ్యాక్రాన్ లు అనేక పర్యాయాలు కలుసుకోవడం, చర్చలు జరపడం, ముఖ్యమైన ఒప్పందాలు కుదర్చుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ రెండు దేశాల మధ్య స్నేహ బంధం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం కూడా జరిగింది.

ఇక 2047 వరకు తమ బంధం కొనసాగడానికి సంబంధించి ఈ రెండు దేశాలు గత ఏడాది ఒక టైం టేబుల్ ను రూపొందించుకోవడం కూడా జరిగింది. రక్షణ పరికరాల ఉత్పత్తి, టెక్నాలజీ బదిలీ, విమానాలు, జలాంతర్గాములు, ఇంజిన్ల కొనుగోలు వంటి విషయాల్లో ఒప్పందాలు కుదర్చుకున్నాయి. మోదీకి, మ్యాక్రాన్ కు ఒప్పందాల మీద చర్చలు జరపడానికి సమయం సరిపోనందు వల్ల ఈ ఇద్దరు నాయకులు దౌత్యవేత్తల ద్వారా ఇదివరకే చర్చలు పూర్తి చేసి, కొన్ని ఒప్పందాలు సిద్ధం చేయడం జరిగింది. జైపూర్ లో వీటి మీద సంతకాలు మాత్రం జరిగాయి. అయితే, పలువురు నిపుణులు, విశ్లేషకుల ఉద్దేశం ప్రకారం భారత ప్రభుత్వం ఈసారి మ్యాక్రాన్ ను కాకుండా దక్షిణాసియా దేశాల నుంచి కానీ, ఇతర వర్ధమాన దేశాల నుంచి కానీ అధినేతలను పిలిచి ఉంటే బాగుండేది. ఇప్పటికే అనేక పర్యాయాలు ఫ్రాన్స్ అధినేతను ఆహ్వానించినందు వల్ల ఈసారి కొత్త నాయకుడికి అవకాశం ఇచ్చి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఫ్రాన్స్ తో ముఖ్యంగా రక్షణ పరిశ్రమను విస్తరించడం మీద చర్చలు, ఆ తర్వాత ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా నౌకాదళం, వైమానిక దళం, సైనిక బలగాలకు సంబంధించిన ఆయుధ పరికరాలు, విమానాలు, యుద్ధ నౌకల ఉత్పత్తి, సహకారం వగైరా అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఇవి కాకుండా, వ్యవసాయ రంగం, టెక్నాలజీ, డిజిటల్ హెల్త్, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన అంశాలపై కూడా ఒప్పందాలు చోటుచేసేకున్నాయి. హెలికాప్టర్ల కొనుగోలుపై కూడా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇక ఉభయ దేశాలు అంతర్జాతీయ పరిణామాలపై సంయుక్త ప్రకటన కూడా జారీచేశాయి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన కొన్ని విషయాలలో అమెరికా, రష్యాలతో కుదరని అభిప్రాయాలు ఫ్రాన్స్ తో కుదిరాయి. ఇజ్రాయెల్ పై దాడులను ఖండిస్తూనే గాజాకు, ఉక్రెయిన్ లకు సహాయం పంపించడం మీద ఈ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైంది. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల మీద కూడా ఆందోళన వ్యక్తమయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్నతరహా అణు విద్యుత్కేంద్రాలను ఏర్పాటు చేయడం, రియాక్టర్లను నెలకొల్పడం వంటి విషయాల్లో గతంలో కుదిరిన ఒప్పందాలు అమలులో ఉన్నాయి. కాగా, దేశ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవడం మీదా, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మీదా ఉభయ దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News