వేములవాడ పట్టణంలో ఇసుక వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. స్థానిక అవసరాల నిమిత్తం రెవెన్యూ అధికారులు వారానికి రెండు లేదా మూడు రోజులు అనుమతులిచ్చి, వినియోగదారుల అవసరాలను తీర్చుతున్నారు. అయితే ఇదే అదునుగా భావించిన కొంతమంది ట్రాక్టర్ యాజమానులు అధికారుల మాటలు పెడచెవిన పెడుతున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సిన ఇసుక రవాణాను, అధికారులెవరు రాకున్నా వ్యాపారులకు ఇష్టం వచ్చినట్లు ఉదయం 8 గంటలకే పదుల కొద్దీ ట్రాక్టర్లను మూలవాగులోకి దించి, పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. దీనికి తోడు అనుమతి చిట్టీలను యూనియన్ లోని కొంతమంది తమకు నచ్చిన వారికే ఇస్తూ, మిగతా వారిని పక్కనపెట్టి కేవలం కొంతమందే జేబులు నింపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయంపై సంబంధిత రెవెన్యూ అధికారిని వివరణ కోరగా తాము బుధవారం ఉదయం 10గంటల నుండి మద్యాహ్నం రెండున్నర గంటల వరకు 75 ట్రాక్టర్లకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, అంతకంటే ముందు ఇసుకను తరలించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని, వెంటనే తమ సిబ్బందిని పంపించి, ఇసుక తరలింపును అడ్డుకుంటామని తెలిపారు.