గణతంత్ర స్ఫూర్తిని అక్షారాలా నింపేందుకు మోడీ సర్కారు సరికొత్త అడుగులు వేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలిచేలా మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి లైన్లో ఎప్పటిలానే వీవీఐపీలకు కాకుండా రిక్షా కార్మికులు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులకు కేటాయించినట్టు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ ఏడాది రిపబ్లిక్ డే థీమ్ కూడా ఇదే కావటం విశేషం. సామాన్యుల భాగస్వామ్యం అనే థీమ్ ఈసారి గణతంత్ర దినోత్సవ థీమ్. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మొత్తం 45,000 మంది ఈ పెరేడ్ లో కూర్చునే సదుపాయం ఉంది. రాజ్ పథ్ రోడ్డును కర్తవ్యపథ్ గా పేరు మార్చాక జరుగుతున్ తొలి రిపబ్లిక్ డే పెరేడ్ ఇదే. కాగా గతేడాది రిపబ్లిక్ డే పెరేడ్ కు కూడా ఆటో రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు వంటివారిని కేంద్రం పెరేడ్ కు హాజరుకావాల్సిందిగా ఆహ్వానించింది.
లో ప్రొఫైల్ లో ఉన్న అర్హులైన వారికి పద్మ అవార్డులు అందేలా పద్మా అవార్డుల కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జానపద కళాకారులు, సామాజిక కార్యకర్తలు, సంగీత విద్వాంసులు, క్రీడాకారులు, సమాజ సేవ చేసేవారిని కూడా పద్మ అవార్డులకు విస్తృతంగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేశారు.