క్రాన్బెర్రీ టీ తాగారా? ఈ టీతో పొందే ఆరోగ్య లాభాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ టీ మనకు అందించే ఐదు రకాల ఆరోగ్యాలను తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఈ టీ మీ శరీరానికే కాదు మనసుకు కూడా ఎంతో సాంత్వననిస్తుందంటున్నారు క్రాన్బెర్రీ తేనేటి ప్రియులు. ఈ టీ చూడడానికి మనసు దోచుకునేలా ఉండడంతో పాటు రుచిలోనూ వహ్ అనిపిస్తుంది.
డైట్ విషయంలో నేటి తరంలో ఎందరో ఆచి తూచి వ్యవహరిస్తున్న విషయం అందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్లు క్రాన్బెర్రీ ని ఆరోగ్యవంతమైన ఆప్షన్ గా మర్చిపోరాదని పలువురు పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. కారణం శరీరంపై క్రాన్బెర్రీ టీ చూపే అద్భుతాలు అలాంటవంటున్నారు వీరంతా. ఇపుడు గ్రీన్ టీ, బ్లాక్ టీ, లట్టె టీలు తాగడం పాతవై పోయాయి. చాలామంది నేడు ఫ్లవర్ టీలు, ఫ్రూట్ టీల ఛాయిస్ ను ఎంచుకుంటున్నారు. తమ శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. క్రాన్బెర్రీ టీ కూడా అలాంటి ఫ్రూట్ టీనే. ఇది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో, మన మనసులను అంతటి ఆనందంతో నింపుతుంది కూడా. ఇది పొద్దున్నే లేచిన వెంటనే మీరు తాగే టీకి ఏమ్రాతం తీసిపోదు. రాత్రి ఎంజాయ్ చేసే గ్రీన్ టీకి రెట్టింపు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
ఈ టీని ఇంట్లోనే మనం సులువుగా తయారుచేసుకోవచ్చు కూడా. ఈ టీని తయారుచేయడానికి ఒక ప్యాకెట్ క్రాన్బెర్రీలు, నీళ్లు, దాల్చినచెక్క, లవంగాలు, నిమ్మచెక్క,కమలాలు ఉంటే చాలు దీన్ని ఎంతో పసందుగా చేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నింటినీ ఒక కుండలో వేసి నీళ్లు పోసి అరగంట పాటు మరిగించాలి. వీటన్నింటి సుగంధాలు ఆ నీటిలోకి ఇంకి క్రాన్బెర్రీ టీ మధురమైన సువాసనలను చిందిస్తుంది. క్రాన్బెరీ టీ వల్ల మనం పొందే ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనాలు ఐదున్నాయి. ఈ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రాన్బెర్రీ టీలో పలు రకాల పోషకవిలువలు ఉన్నాయని ఇటీవల చేసిన ఒక స్టడీలో కూడా వెల్లడైంది. అంతేకాదు పోలిఫెనాల్స్, జెక్సాన్థిన్, ఫ్లెవనాయిడ్స్, లూటిన్ వంటి యాంటాక్సిడెంట్లు ఈ టీలో ఉన్నాయి.అంతేకాదు చాలా కొద్ది పండ్లల్లో మాత్రమే పుష్కలంగా ఉండే ప్రొయాంథో కెనడిన్స్ కూడా క్రాన్బెర్రీలో ఉంది. ఈ యాంటాక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అంతేకాదు క్రానిక్ జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి కూడా.
అంతేకాదు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా క్రాన్బెరీ బాగా ఉపయోగపడుతుంది. దీంతో బాధపడేవాళ్లు ఒక కప్పు క్రాన్బెర్రీ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుందని పోషకాహారనిపుణులు చెపుతున్నారు. ఒక స్టడీలో క్రాన్బెర్రీ ఉత్పత్తులు, క్రాన్బెర్రీ టీల వల్ల మూత్రాశయ ఇన్ఫెక్లన్ల సమస్య తగ్గుతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్లన్ల (యుటిఐ) నుంచి చిన్నా పెద్దా అందరినీ సంరక్షిస్తుందని డైటీషియన్లు వివరిస్తున్నారు. బాక్టీరియా యూరినరీ ట్రాక్ లైనింగ్ కు చేరకుండా క్రాన్బెర్రీల్లోని పోషకాలు, యాంటాక్సిడెంట్లు రక్షిస్తాయి. అంతేకాదు క్రాన్బెరీ టీ వల్ల మనం బరువు కూడా తగ్గుతాం. అందుకే వెయిట్ లాస్ కావాలనుకునే వారు ఈ టీని బాగా తాగుతుంటారు.
క్రాన్బెర్రీ టీలో విటమిన్ సి, బి1, బి3, బి6 వంటి విటమిన్లు, ఖనిజాలు బాగా ఉన్నాయి. క్రాన్బెర్రీలో కాలరీలు తక్కువగా ఉండి, డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అందుకే దీన్ని తీసుకున్న వాళ్లకు కడుపు నిండుగా ఉండి ఆకలి తొందరగా వేయదు. చిరుతిళ్ల మీదకు మనసు పోదు. క్రాన్బెర్రీల్లో ఉండే సహజసిద్ధమైన తీయదనం మన తీపి కోరికను తీరుస్తుంది కూడా. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల క్రాన్బెర్రీ టీ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.క్రాన్బెర్రీల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, వాటిల్లోని రకరకాల పదార్థాలు రక్తపోటును తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అంతేకాదు గుండెజబ్బులకు కారణమయ్యే ఎన్నో రిస్కుల నుంచి కూడా ఈ టీ బయటపడేస్తుంది. ఒక కప్పు క్రాన్బెర్రీ టీ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మరెంతో శుభ్రంగా ఉంటుంది. క్రాన్బెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. వీటిల్లో సలిసిలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంది. ఇది చర్మంపై మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది కూడా.