Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Capital politics in AP: రాజధానితో రాజకీయ క్రినీడ

Capital politics in AP: రాజధానితో రాజకీయ క్రినీడ

10 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ

బ్రిటీష్ వాళ్ల నుంచి దేశానికి స్వాతంత్రం కోసం ప్రజలు చేపట్టిన ఉద్యమాలను చూశాం. అయితే ఏపీలో ఉంది బ్రిటీష్ ప్రభుత్వం కాదు అంతకు మించి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజా రాజధాని రైతులు, మహిళలు 1500 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా ముఖ్యమంత్రి మనస్సు కరగలేదు. పైపెచ్చు తాను నియంతలా చేసిందే శాసనం, చెప్పిందే చట్టంలా భావిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తూ రాచరికం పాలనకు తెరతీశారు.
ఏపీ ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి చేయలేని పాలకులు మూడు రాజధానులంటూ రాష్ట్రం పరువు తీశారు. ఏపీకి రాజధాని ఏది? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేయని అరాచకాలు లేవు. రాజధాని కోసం రైతులు పోరాటం చేస్తూ పాదయాత్ర చేపడితే ఏపీ ప్రభుత్వం దానిని విధ్వంసం చేసి రాజధాని పేద ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ప్రయత్నం చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే 144 సెక్షన్, పోలీసు చట్టంలో సెక్షన్ 30 వంటివి ప్రయోగించి గ్రామాల్నీ తన గుప్పిట్లో పెట్టుకుంది. పోలీసుల లాఠీ దెబ్బల్ని, హింపాకాండను తట్టుకుని, మహిళలు, రైతులు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించడం వారి ధీరత్వానికి నిదర్శనం. న్యాయ దేవతని నమ్మకున్న రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళి వరుస విజయాలు సాధిస్తున్నా సీఎంకు కనువిప్పు కలగడం లేదు.
అమరావతి లో రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూముల్ని రైతులు ఇచ్చారు. వారి మనోభావలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. డిసెంబరు 17న నాలుగేళ్ల క్రితం శాసనసభలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నప్పుడు ఏపీకి ఉంటే తప్పేంటని వితండవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అమరావతికి మద్ధతు తెలిపి తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. రాజధానిలో టీడీపీ నాయకులు ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 5 ఏళ్లైనా ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. అమరావతిలో ఇన్ సైడింగ్ ట్రేడింగ్ జరగలేదని జనవరి 19, 2021న హైకోర్టు తెలిపినా అధికారపక్షం నాయకులు కావాలనే అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. మూడు ముక్కల రాజధాని ఏర్పాటు అధికారం శాసనసభకు లేదని జగన్‌కి తెలిసినా ప్రజలను మభ్యపెట్టేందుకు రాజ్యసభలో రాజ్యాంగ సవరణ కోరుతూ విజయసాయిరెడ్డిచే ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టి భంగపడ్డారు. ‘A New Capital’ అని పేర్కొనడం ద్వారా మన రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఒకే రాజధాని ఏర్పాటుకు అవకాశం ఉందన్న విషయాన్ని మార్చి 03, 2022న హైకోర్టు చారిత్రత్మకమైన తీర్పిచ్చింది.
సిఆర్‌డిఏ చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులతో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం రాజధానిలో ఏ మార్పు చేయాలన్నా మూడింతలు పరిక్ష్రం, లేదా వారి భూములు నష్టపరిహారం చెల్లించాలి. ఇది సాధ్యమా? రైతులకు అభివృద్ది చేసిన ప్లాంట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన ఎటువంటి చర్యలు లేవు. గత ప్రభుత్వం చేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ కొనసాగించి ఉంటే 139 సంస్థలు మరియు సింగపూర్ సంస్థలు పెట్టుబడి పెట్టుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. 175 నియోజకవర్గాల యువతకు ఉపాధి వచ్చి ఉండేది. ప్రపంచంలోనే అత్యద్బుతమైన 6 భవిష్య నగరాల జాబితాలో ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ‘‘ఆర్కిటెక్చర్ డైజెస్ట్’’ అమరావతికి చోటు కల్పించింది. ముఖ్యమంత్రి తీసుకున్న మూడు రాజధానుల విధానంతో రూ.2 లక్షల కోట్ల ఆస్తి నిరర్థకంగా మిగిలిపోయింది.
టీడీపీ హయాంలో అమరావతి, గుంటూరు, తెనాలి చుట్టూ 189 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి డిజైన్ చేశారు. ఇంకా పనులే ప్రారంభించని ఓఆర్ఆర్ లో అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇళ్లు లేని పేదలపై జగన్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ముందు చంద్రబాబు నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లు అందించాలి. ఆ ఇళ్లు నాలుగేళ్లుగా పేదలకు అందించకుండా ఎందుకు పాడుపెడుతున్నారు.? ఆర్ – 5 జోన్ లోని స్థలాలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ కంపెనీలు నెలకొల్పేందుకు కేటాయించారు. అవి వస్తే రాష్ట్రంలోని యువతకు సుమారు 3.80 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ యువత నోట్లో మట్టికొట్టే విధంగా, పరిశ్రమలు రాకుండా చేసేందుకు పరిశ్రమలకు అనుకూలమైన స్థలాలను పేదలకు ఇంటి పట్టా పేరుతో అక్కడ కేటాయిస్తున్నారు.
రాజధానిలోని పేదల కోసం ఆర్ – 3 జోన్ లో 2,500 ఎకరాలు భూముల్ని మాస్టర్ ప్లాన్ లో కేటాయించారు. కానీ సీఎం అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఆర్ -5 లో కేటాయించారు. దానికి కారణం మాస్టర్ ప్లాన్ ను చెడగొట్టే ప్రయత్నం. రాజధాని అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. రాజధాని రైతులకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే.. ఈ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు కూడా రద్దు అవుతాయి. అప్పుడు మేము మీకు స్థలాలు ఇవ్వదలచకుంటే రైతులు అడ్డుకున్నారని లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అమాయకత్వాన్ని సామాన్యులను బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజధానిలో పేదలు ఉండటానికి చంద్రబాబుకు ఇష్టం లేదని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం ఇంటి పక్కన ఉన్న పేదల ఇళ్లు కూల్చి, ఎక్కడో 40 కి.మీ దూరంలో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇచ్చారు. నీ ఇంటి పక్కన పేదలు ఉండకూడదా అని రాజధాని రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు అధికారపక్షం నాయకుల దగ్గర సమాధానాలు లేవు.
ఎలక్ట్రానిక్ సిటీ కోసం రిజర్వు చేసిన భూమిలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిలో ఎన్టీఆర్ జిల్లా కు 583.93 ఎకరాలు, గుంటూరు జిల్లాకు 550.65 ఎకరాలు మొత్తం 1,134 ఎకరాలు కేటాయిస్తున్నట్లు జీఓ లో పేర్కొన్నారు. పేదవారికి, అమరావతి రైతులకు మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలికాచుకోవాలని చూస్తున్నారు. స్థానికంగా ఉన్నచోట ఇళ్ల స్థలాలు కేటాయించకుండా..30,40కి.మీ దూరంలోని వాళ్లకు ఇక్కడ కేటాయించడాన్ని బట్టి చూస్తే తన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఇది. పేదవారంటే జగన్మోహన్ రెడ్డికి చులకన భావం, అసహ్యం గనుకనే ఈ విధంగా వివాదాల్లో ఉన్న భూమిని కేటాయించి రైతులకు, పేదవారికి మధ్య తగాదా సృష్టించి తాను రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు.
రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూసమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది, 5 ఎకరాలలోపు వారు 8,500 మంది ఉన్నారు. ప్రజా రాజధాని అమరావతి మహిళా రైతులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికారపక్షం నేలకరవక తప్పదు. రాష్ట్రం కోసం భూమిని ఇచ్చిన పాపానికి నేడు ఏలికల చేతుల్లో అవమానాలకు గురి అవుతున్నారు. నేడు ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు స్వచ్ఛంధంగా చేస్తున్న పోరాటం మహాభారత యుద్ధాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కిదున్నే రైతులు నేడు రాజధాని కోసం కురుక్షేత్రంలో అసువులుబాస్తున్నారు. అధికారపక్షం విస్పష్ట వైఖరితో ఆందోళనలో ఉన్న మహిళలపై విచక్షణా రాహిత్యంగా మానవత్వాన్ని మరిచి రక్తమోడునట్లు దాడులు చేయించారు.
త్యాగాలు చేస్తున్న రైతులను నీచ బుద్ధి గల కొందరు పెయిడ్ ఆర్టిస్టులని, బురదల్లో తిరిగే వాళ్లంటూ రైతులను అవమానపాలు చేసి అవవేళన చేశారు. రైతులను ఇళ్ల నుంచి భయటకు రానివ్వకపోగా వచ్చిన వారిని కక్షగినట్లుగా హింసించారు. ప్రార్ధనా మందిరాలు, దేవాలయాలకు వెళ్లే మహిళలను సైతం అడ్డగించి లారీచార్జ్ చేయించారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అత్యంత శక్తివంతమైన దుర్గమ్మ సాక్షిగా మహిళలకు ఈ విధంగా అవమనాలకు గురి చేసినా కోపానంత పంటి బిగువున దాచుకొని పోరాటాలు చేస్తున్నారు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్ కెమేరాలు తిప్పడం, అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులు పాటు జైలులో ఉంచారు. నాలుగున్నరేళ్ల ఉద్యమ క్రమంలో 2,000 మందిపై 750 కి పైగా కేసులు పెట్టారు. మరోవైపు అమరావతిపై బెంగతో గడిచిన నాలుగేళ్లలో 275 మంది రైతులు గుండె పగిలి చనిపోయారు. అవ్వన్ని జగన్మోహన్ రెడ్డి హత్యలే.
రాష్ట్రానికి రాజకీయ చీడపీడలు సోకి వ్యవస్థలు గుల్లబారిపోకుండా కాచుకోవడం ప్రజాతంత్ర బాధ్యత. సామాన్య జనావళి మాత్రం ప్రస్తుత పరిణామాలను నిష్క్రియగా గమనిస్తున్నారు. ఏది ఏమైనా రాజధానిపై లక్ష్యశుద్ధి చూపకపోతే ప్రజలు సహించే రోజులు నెమ్మనెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుందన్నట్లుగా మాకు 151 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న అధికార పక్షానికి ఒక్క అమరావతి అంశంతోనే మట్టికరుస్తుంది. ఇది తధ్యం.

- Advertisement -

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రివర్యులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News