పాకిస్థాన్ లో ఈ నెల 8న పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయనగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రెండు కేసుల్లో అరెస్టు చేయడాన్ని బట్టి సైనిక వ్యవస్థ ఉద్దేశాలేమిటో అర్థం చేసు కోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రాక్ ఎ ఇన్సాఫ్ (పి.టి.ఐ) గత 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టినప్పుడు ప్రతిపక్ష పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పి.ఎం.ఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సైనికాధికారులు పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిపించి ఇమ్రాన్ పార్టీ గెలిచేలా చేశారంటూ తీవ్రంగా విమర్శలు సాగించాయి. అంతకు ముందు సంవత్సరమే పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పి.ఎం.ఎల్-ఎన్) అధినేత, మాజీ ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్ ‘పనామా పేపర్స్’ ఆరోపణల కారణంగా పదవి నుంచి తప్పుకోవడమే కాకుండా, ఆయనకు కోర్టు ద్వారా శిక్ష పడడం, అనర్హుడుగా ప్రకటించడం వంటివి జరిగి, ఆయన అజ్థాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ శిక్షలు, అనర్హత వేటులు ఇమ్రాన్ ఖాన్ మీద పడడం, నవాజ్ షరీఫ్ అజ్జాతం నుంచి బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతోంది.
ఇమ్రాన్ ఖాన్ ను, ఆయన పార్టీని ప్రభుత్వమే కాకుండా, ప్రతి ప్రభుత్వ సంస్థ వెంటాడి వేధించిన తీరును చూసిన వారికి న్యాయస్థానం తీర్పులు ఏవిధంగా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా కూడా ప్రకటించింది. ఆయన ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టాడనేది ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత మరో న్యాయ స్థానం ఆయన మీద తోషాఖానా కేసులో విచారణ జరిపి, ఆయనకు, ఆయన భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అధికారంలో ఉండగా తమ ప్రభుత్వానికి అందిన బహుమతులను ఆయన తన వద్దే ఉంచుకున్నాడని ఆరోపణ చేయడం జరిగింది.
సైనిక వ్యవస్థతో సరిపడని కారణంగా ఆయన 2022 ఏప్రిల్ నెలలో బలవంతంగా పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తనను పదవి నుంచి తొలగించడానికి సైనిక వ్యవస్థ, అమెరికా ప్రభుత్వం కలిసి కుట్రపన్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు 2022లో అప్పటి పాకిస్థాన్ రాయబారి అమెరికా ప్రభుత్వానికి పంపించిన ఒక కేబుల్ సమాచారాన్ని ఆయన ఒక ర్యాలీలో ప్రదర్శించడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ సమాచారాన్ని ర్యాలీలో ప్రదర్శించినందుకు ప్రభుత్వ రహస్యాల ప్రదర్శన చట్టం కింద ఆయనను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. కేసు మధ్యలో తమను తొలగించి ప్రభుత్వం తమ అటార్నీలను నియమించిందని, సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ తన కేసును తాను వాదించుకోవడానికి కూడా అవకాశమివ్వలేదని, పైగా కోర్టు విచారణంతా జైలులోనే సాగిపోయిందని ఆయన పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత గత ఏడాది మే నెలలో పాకిస్థాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, అప్పటి నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కలిసి ఆయన పార్టీని బలహీనపరచడానికి చేయవలసిందంతా చేశారు.
కాగా, పాకిస్థాన్ తెహ్రక్ ఎ ఇన్సాఫ్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. కొంతమంది పరారీలో ఉన్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొత్తానికి పార్టీ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ పార్టీ చిహ్నమైన క్రికెట్ బ్యాట్ ను ప్రభుత్వం నిషేధించింది. దాంతో పలువురు ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ తో సహా పలువురు నాయకులు జైలుపాలవడం, పార్టీ కకావికలం కావడం నవాజ్ షరీఫ్ కు అనుకూలంగా మారింది. ఆయన దీనినంతా చోద్యంగా చూస్తూ తన విజయావకాశాలను లెక్కవేసుకుంటున్నారు. తనకు సైనిక వ్యవస్థ మద్దతు ఉందని ఆయనకు బాగా తెలుసు. ఎన్నికల ఫలితాలు ముందుగానే నిర్ధారణ అయిపోయాయనే సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆయన రాజకీయంగా మళ్లీ తెర మీదకు వస్తే రావచ్చు. కానీ, దేశంలో త్వరలో జరగబోయే ఎన్నికలు అసలు విజేత సైనిక వ్యవస్థేనని, ఓడిపోబోతున్నది ప్రజాస్వామ్య మేనని అందరికీ తెలిసిన విషయమే. దేశం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సర్వనాశనం అయిపోతున్న స్థితిలో, అనేక సవాళ్లను ఎదుర్కోవలసిన స్థితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ కావడం ఈ దేశానికి అంత శ్రేయస్కరం కాదు.