మేడారం మహా జాతరను పురస్కరించుకొని మేడారం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలలో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్టు, స్వచ్ఛ మేడారం కోసం నిరంతరంగా కృషి చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తెలిపారు. మేడారంలో ఆయన మాట్లాడుతూ గత నెల 15 రోజులుగా అధిక సంఖ్యలో భక్తులు రాక మొదలైందని, ఈ సందర్భంగా భక్తులు వదిలి వేసిన తిను బండారాలు ఇతర వస్తువులను సేకరించి డంపు యార్డులకు తరలించడానికి ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలోని 9 మండలాల ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, 174 పంచాయతీ కార్యదర్శులు వారంలో 24 గంటల పాటు పనిచేస్తున్నారన్నారు. మేడారంలోని హరిత కాటేజిలను వివిఐపిల విడిది కొరకు శుభ్రం చేయించామని, మహా జాతరను పురస్కరించుకొని అదనంగా కార్మికులను నియమించుకొని పారిశుద్ధ్య పనులను చేపడతామని ఆయన వివరించారు. కార్యక్రమంలో తాడ్వాయి ఎంపీడీవో సత్యంజనేయ ప్రసాద్, పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.