Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Budget 2024: ముందున్నది ముసళ్ల పండుగ

Budget 2024: ముందున్నది ముసళ్ల పండుగ

ఏం చేయబోతుందో వెల్లడించింది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది మధ్యంతర బడ్జెట్టే అయినందువల్ల ఎక్కువగా ఏమీ ఆశించడానికి ఉండదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ ఏ విషయంలోనూ స్పష్టమైన హామీ ఇవ్వలేదు కానీ, ఎన్నో ఆశలు పెట్టడం జరిగింది. దేశం ఏ విధంగా అభివృద్ధి సాధించిందో, దేశ ఆర్థిక పరిస్థితి ఏ దశలో, ఏ స్థితిలో ఈ మధ్యంతర బడ్జెట్‌ అనేక గణాంకాలతో వివరించింది. మున్ముందు కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తుకు ఏం చేయబోతుందో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ, సూచనప్రాయంగానూ తెలియజేసింది. సాధారణంగా ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్లు ఈ విధంగానే ఉంటాయి. ఇది కూడా అందుకు భిన్నమేమీ కాదు. దేశం సానుకూల పరిణామ దశలో ఉందని, ఇందుకు అనేక రంగాల అభివృద్ధే కారణమని కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం మీద ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం తనకు అవకాశంగా, అనుకూలంగా మార్చుకోగలిగింది.
ఆదాయ, వ్యయాల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. జనాకర్షణ పథకాల జోలికి పోదలచుకోనట్టు కనిపిస్తోంది. 2024-25 సంవత్సరానికి ద్రవ్యలోటు అంచనా కొద్దిగా తగ్గింది. దీన్ని 5.1 శాతానికి కుదించింది. ఇది నిజంగా సానుకూల పరిణామమే. మూలధన వ్యయాన్ని పెంచుతూ ఇటీవలి కాలంలో బడ్జెట్‌ లలో అవకాశాలు కల్పించడం కూడా శుభ పరిణామమే. 2023-24 బడ్జెట్‌ లో సవరించిన అంచనాల్లో మూల ధన వ్యయాన్ని కొద్దిగా తగ్గించడం ఆలోచిం చాల్సిన విషయం. సుమారుగా 50,175 కోట్ల రూపాయల మేరకు గత బడ్జెట్లో మూల ధన వ్యయాన్ని తగ్గించడం జరిగింది. ఇక అనేక అంశాల్లో ప్రభుత్వ సాఫల్యాలు ఆశించిన మేరకు రికార్డు చేయగలిగామని కేంద్రం ప్రకటించింది. యువతీ యువకులు సొంతగా కంపెనీలు, వ్యాపారాలు ప్రారంభించడానికి గత ఏడాది ప్రధాని ముద్రా యోజన కింద 43 వేల కోట్ల రూపాయలను పెంచామని, ప్రస్తుతం యువతకు 22.05 లక్షల కోట్ల వరకు రుణ సదుపాయాన్ని కల్పించడం జరిగిందని కేంద్రం తెలియజేసింది. ఇందులో 30 కోట్ల రూపాయలను అతి తక్కువ వడ్డీకి మహిళా వ్యవస్థాపకులకు రుణాలుగా ఇవ్వడం జరిగిందని, ఈ ముద్రా యోజన కింద లబ్ధి పొందే మహిళల సంఖ్యను ఈ ఏడాది మూడు కోట్లకు పెంచే ఉద్దేశం ఉందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ యోజనను ప్రవేశపెట్టిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కోటి మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా లక్షాధికారులయ్యారని కూడా ప్రభుత్వం తెలియజేసింది.
ఆర్థిక నిపుణులు, వ్యూహకర్తలు, ప్రణాళికావేత్తలు కూడా ఊహించలేనంతగా ప్రభుత్వ ఆర్థిక విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని, సాధారణ ప్రజానీకం, ముఖ్యంగా గ్రామీణ ప్రజానీకం ఈ పథకాల వల్ల ఎంతగానో లబ్ధి పొందడం జరుగుతోందని కూడా ప్రభుత్వం వివరించింది. నిజానికి తమ పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరడానికి ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం, వీటి గురించి మరింతగా తెలుసుకోవడానికి వికసిత్‌ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పేద ప్రజలకు ఒకపక్క ఇటువంటి పథకాలను అమలు చేస్తూనే మరో పక్క కేంద్రం దేశంలో దాదాపు 81 కోట్ల మంది పేదలకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేయడం కూడా జరుగుతోంది. దేశ ప్రజల్లో దాదాపు 60 మందికి ధాన్యానికి కొరత ఏర్పడుతుందన్న దిగులు, ఆందోళన లేకుండా చేశామని ప్రభుత్వం తన మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా కోట్లాది మంది యువతీ యువకులకు ముద్రా యోజనను అమలు చేస్తున్నప్పటికీ, గ్రామీణ ఉపాధి హామీ కింద రైతు కూలీలకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించడం కూడా జరుగుతోంది.
ఇక దేశంలో నిరుద్యోగ సమస్య 8-10 శాతం వరకూ ఉందనడంలో సందేహం లేదు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ డి. సుబ్బారావు కూడా ఈ మధ్య ఈ విషయంలో వెల్లడించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దేశంలోని యువత కోసం మరెంతో చేయాల్సి ఉందని, మరెన్నో పథ కాలు చేపట్టాల్సి ఉందని అర్థమవుతోంది. ఆర్థికాభివృద్ధిని సాధించడంతో పాటు అసమానతలను తగ్గించాల్సి ఉంది. ఉపాధి అవకాశాలను, ఉద్యోగావ కాశాలను మరింతగా పెంచాల్సి ఉంటుంది. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, మహిళలు, పేదలు, బడుగు వర్గాల సాధికారికతను కూడా వృద్ధి చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News