ఆ అధికారి పేరు చెప్తేనే భూ కబ్జాదారుల గుండెల్లో వణుకు పుడుతుంది. కరీంనగర్ జిల్లాలోని భూ కబ్జాదారులను షేక్ చేస్తున్న పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తీరు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బడా రాజకీయ నాయకులు, భూ అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు దర్జాగా పాగా వేయడం అన్యాక్రాంతం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. అంతేకాకుండా ఇండ్ల నిర్మాణాల అనుమతి కోసం లక్షల్లో వసూలు చేయడం, తప్పుడు పత్రాలు, డబుల్ రిజిస్ట్రేషన్లు, వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకోవడం భూ కబ్జాదారులకు నిత్య కృత్యంగా మారిన తరుణంలో కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ మహంతి తన పనితీరుతో అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టేలా చేస్తున్నారు.
దీనికి తోడు ప్రభుత్వం కూడా మారడంతో ఇన్నేళ్లపాటు ఎవరి అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోయారో వారి ఆగడాలకు అడ్డుపడినట్లు అయింది. భూ బాధితులు సైతం పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతో తోచని స్థితిలో ఇన్నాళ్లపాటు మనోవేదన గురయ్యారు. ప్రస్తుతం సిపి భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుండడంతో భూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులపై భూ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో సిపి ఫిర్యాదులు స్వీకరించేందుకు (ఈవో డబ్ల్యూ) ఎకనామిక్ అఫేన్స్ వింగ్ ఏర్పాటు చేశారు. భూ బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులపై ఉన్నతాధికారుల చేత విచారణ చేయించేందుకు ఏర్పాటు చేసిన సెల్ కు బాధితుల నుండి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. అత్యధికంగా కరీంనగర్ కార్పొరేటర్ల పై ఫిర్యాదులు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూ కబ్జాలకు పాల్పడినట్లు పూర్తి ఆధారాలు ఉండడంతో ఇప్పటికే నలుగురు ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తీరుతో భూ కబ్జాదారుల్లో ఆందోళన నెలకొంది. తమను ఈ సమస్య నుంచి గట్టెక్కించాలంటూ వారికి తెలిసిన రాజకీయ నాయకుల పై ఒత్తిడి తెస్తున్నారు. సిపి అభిషేక్ మహంతి భూ కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతుండడంతో ఏ క్షణాన ఎవరిని అరెస్టు చేస్తారోనని భయాందోళనలు భూకబ్జాదాల్లో నెలకొన్నాయి.
భూబాధితులు సైతం సీపీ పై ఉన్న నమ్మకంతో తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తుండడంతో రోజురోజుకు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ఎన్నేళ్లపాటు అడ్డు అదుపు లేకుండా భూకబ్జాలకు పాల్పడ్డ వారి వివరాలు బయటకు వస్తున్నాయి. సిపి భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్న తీరుపై జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం భూకబ్జాలపై సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరి కొంతమంది భూకబ్జాదారులను అరెస్టు చేసేందుకు అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనాప్పటికీ ఇన్నేళ్లపాటు ఇలాంటి పోలీస్ ఉన్నతాధికారి తమ ప్రాంతంలో విధులు నిర్వర్తించకపోవడంతో భూ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఇప్పటికైనా భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం సంతోషాన్ని కలిగిస్తుందని పలువురు భూ బాధితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు .