బాలసాహిత్యంలో ఏ రచన చేయాలన్నా మొదలు మనకు ‘వస్తువు’ కావాలి. ఇక్కడ వస్తువు అంటే మనం రాయాలనుకున్న విషయం. మన దగ్గర శనగపిండి ఉందనుకోండి దానితోని బజ్జీలు చేసుకోవచ్చు, బూందీ చేసుకోవచ్చు, కారప్పూస చేసుకోవచ్చు..ఎంచక్క తియ్యటి మైసూర్ పాక్ చేసుకోవచ్చు..ఇక దోసలూ పోసుకోవచ్చు. అంటే ఇక్కడ వస్తువు ఏంటీ ‘ శనగపిండి’. అలాగే మనం ఒక ‘విషయం’ తీసుకుని దానితో కధ, గేయం, వ్యాసం, నవల, నాటిక, సినిమా, ఇక సీరియల్ కూడా రాసుకోవచ్చు. కావలసిందల్లా వస్తువు.. అంటే విషయం.
” ఒక వాహనం రోడ్డు మీద నడవాలంటే చమురు ఎలా అవసరమో కథ రాయాలంటే కథా వస్తువు అంతే అవసరం. కథకు ప్రాణం పోసేది, పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసేది కథా వస్తువే. అయితే ఆ కథావస్తువును రాయబోయే కథ ఎలాంటి పాఠకుల కోసమో నిర్ణయించుకున్న తరువాతనే వారికి తగ్గ అంశాన్ని ఎంచుకుని రాయాలి ” అంటారు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు.
ఏదైనా ఒక వంటకం చేయాలంటే కావలసిన పదార్ధాలన్నీ ఎలా సమకూర్చుకుని వంట చేయడం మొదలు పెడతామో అలాగే కథ రాయాలంటే అవసరమైన అంశాన్ని ఎన్నుకుని , ఆ కథ రాయడం వలన కలిగే మంచీ చెడులను ముందుగానే మనసులో చర్చించుకుని , కథ వలన పాఠకులకు ప్రయోజనం కలుగుతుందనుకుంటేనే రాయాలి. మానవజీవితంలో కనిపించే దృశ్యాలు, ఎదురయ్యే అనుభవాలు, జరిగే సంఘటనలన్నీ కథా వస్తువులే. కాకపోతే కథా రచనా దృష్టితో వాటిని పరిశీలించాలి. ఎనిమిది వందలకు పైగా బాలల కథలు రాసిన నారంశెట్టి ఉమామహేశ్వరరావు కథ రాయడానికి ముందుగా ‘ ముడిసరుకు’ ని ఇలాగే సేకరిస్తారు. కథ వలన సమాజానికి మంచి జరుగుతుందని భావించినప్పుడే వీరు కథ రాస్తారు. ఐతే కథ రాశాక వెంటనే పత్రికలకు పంపే ప్రయత్నం చేయరు. ఒకటికి రెండు సార్లు చదివి పరిశీలించుకున్న తరువాతనే సంపాదకులకు పంపుతారు నారంశెట్టి ఉమామహేశ్వరరావు.
ఈరోజు మనకు కథలు అందిస్తున్న బాలసాహితీవేత్తలు కథలకు ముడిసరుకులు ఎలా సేకరిస్తున్నారో పరిశీలిధ్ధాం.
కర్నూలుకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త, తెలుగు బంధువు డాక్టర్ ఎం. హరికిషన్ వందల సంఖ్యలో బాలల కథలు రాశారు. డెబ్బయికి పైగా బాలసాహిత్య గ్రంథాలు ముద్రించారు.వీరు కథ రాయటానికి
కథా వస్తువు ఎలా ఎన్నుకుంటారో గమనిస్తే.. మొదట ఏవైనా కథలకు ఉన్న బొమ్మలు చూసి ఆలోచించడం మొదలు పెడతారు. దానితో అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఆధారంగా వీరికి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అలా కొత్త కథకు జన్మనిస్తారు. ఇంకా సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతుంటారు. పాత కథలు చదువుతూ ఉన్నప్పుడు కూడా వీరికి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. కథ ముగింపును తాను ముందుగానే ఊహించుకుని చదువుతుంటారు. అప్పుడు భిన్నమైనటువంటి ముగింపులు సృష్టించవచ్చు.అవి మరో కొత్త కథగా రూపాంతరం చెందుతాయి. బాలలకోసం రాస్తున్నప్పుడు కథలో చాలా మార్పులు, చేర్పులు చేస్తుంటారు. కొన్నిసార్లు వీరు మొదట అనుకున్న కథ పూర్తిగా మారిపోయి కొత్త కథ కూడా తయారవుతుంది.చాలా వరకు సులభమైన పదజాలంతో పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా కథ రాయడానికి ప్రయత్నిస్తారు. వాక్యాలలో ఒక లయ ఉండేలా చూసుకుంటారు. సరళమైన కర్నూలు నగర మాండలికాన్ని కొంచెం కలుపుతారు. అందుకే డాక్టర్ ఎం.హరికిషన్ అన్ని కథలు రాయగలిగారు. వీరు తెలిపిన టెక్నిక్స్ మనము ఉపయోగించి మనం కూడా కథలు సులువుగా రాయవచ్చు.
ఇక కడప జిల్లాకు చెందిన కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత డి.కె.చదువుల బాబు బాలల కోసం కథ రాయటానికి ‘ కథాంశాలు’ ను ఈ క్రింద తెలిపిన పది విధాలుగా సేకరిస్తారు.
1) సమాజంలో చూసిన సంఘటనలు 2) వివిధ రకాల మనస్థత్వాలు
3) పిల్లల, తల్లిదండ్రుల సమస్యలు
4) మంచి సూక్తులను తీసుకుని కథలుగా అల్లటం
5) మంచీ,చెడు విచక్షణను పునాదిగా చేసుకుని కథను నిర్మించటం
6) ఒక పాత్ర స్వభావాన్ని పాజిటివ్ ను నెగిటివ్ గా, నెగిటివ్ ను పాజిటివ్ గా ముగించే టెక్నిక్ తో కథను తయారుచేయటం
7) ఒక సమస్యను సృష్టించి,దాన్ని ఉపాయంతో ఎదుర్కొనేలా కథను రూపొందించటం
8) హాస్య సంఘటనలను తయారు చేసుకుని కథగా తయారు చేయటం
9) మనుష్యులమధ్య ఉండవలసిన అనుబంధాలను ప్రాతిపదికగా చేసుకుని కథను రూపొందించటం
10) బేతాళ, కరాళ కథలవంటి కథలు ఊహా ప్రపంచంలోకి వెళ్ళి సృజనాత్మకతతో కథను ఊహిస్తూ అనేకమార్పులు, చేర్పులు చేసుకుంటూ తయారు చేయటం.
పైన పేర్కొన్న పది మార్గాలే కాకుండా పిల్లల కథలు రాయడానికి ఇంకా కొత్త టెక్నిక్స్ వాడుతూ అనేక దారుల్లో కథలు రాస్తున్నారు డి.కె.చదువుల బాబు.
ఏదిఏమైనా వీరు తన ‘ కథా వస్తువులు ‘ అన్నీకూడా తన చుట్టూ ఉన్న సమాజంనుండే తయారు చేసుకుంటారు.
‘ మన మనసులో ఏఆలోచనలు ఉంటాయో మనకు లోకం కూడా అలాగే కనిపిస్తుంది!’ అనే కథా వస్తువు తీసుకుని డి.కె.చదువుల బాబు ‘ అనగనగా ఒక కోతి ‘ కథను ఎలా రాశారో పరిశీలిద్దాం ! ఒక అడవిలో ఒక కోతి చెట్టుకు ఆనుకుని కళ్ళు మూసుకుని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి’ఇది రాత్రీ పగలూ బాగా దొంగతనాలు చేసినట్లుంది.అలిసిపోయి నిద్రబోతోంది.’ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విషయం కనపడిన ప్రతి జంతువుతో చెప్పింది. అటుగా వచ్చిన తిండిపోతు ఎలుగు కోతిని చూసింది.’ఈ కోతి పీకలదాకా తిన్నట్లుంది..’అనుకుంటూ వెళ్ళిపోయింది. ఈసంగతి కనపడిన ప్రతి జంతువుకూ చెప్పింది.
ఆదారిన వచ్చిన కొంగ వైద్యుడు కోతిని చూసింది.’ఈకోతి ఏదో రోగంతో పడిపోయినట్లుంది’అనుకుంటూ వెళ్ళిపోయింది.ఈవిషయం కనిపించిన ప్రతి జంతువుతో చెప్పింది. తర్వాత అటుగా వచ్చిన ఆకలిగొన్న కుందేలు ‘ఈకోతి ఆహారం దొరకక ఆకలి బాధతో కళ్ళు తిరిగి చెట్టుకు చేరగిలపడినట్లుంది.’ అనుకుంటూ వెళ్ళిపోయింది.ఈవిషయం కనిపించిన ప్రతిజంతువుకూ చెప్పింది. ఒక సోమరి నత్త కోతిని చూసి ‘ఇది చాలా సోమరిలాగా ఉంది’ అనుకుంటూ వెళ్ళి పోయింది, విషయం అనుమానపు సింహం చెవిన పడింది. ‘తన పదవిని కాజేయాలని కోతి పథకం పన్నుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుంది’ అనుకుంది సింహం.
కొంతసేపటి తర్వాత కోతిని మేల్కొల్పడానికి దొంగనక్క ఆకుదోనెలో చల్లని నీళ్ళు తీసుకొచ్చింది.ఎలుగు ఏదో పసరు తీసుకొచ్చింది.కొంగ వైద్యానికి మూలికలతో వచ్చింది.కుందేలు కోతి ఆకలితో పడిపోయిందని రెెండు అరటిపండ్లు సంపాదించి తీసుకొచ్చింది.జంతువులన్నీ చెట్టు కిందకు చేరాయి.సింహం కూడా వచ్చింది.అప్పుడు ఒక ముదుసలి గ్రద్ద వచ్చి అక్కడ వాలింది. అవి గుంపు కావడానికి కారణం అడిగి తెలుసుకుంది. “కోతి ఎందుకలా ఉందనుకుంటున్నారూ ?”అంది. దేని అభిప్రాయం అవి చెప్పాయి.
గద్దనవ్వి “ఇప్పుడు మీరందరూ మీమనసులో ఆలోచనలను చెప్పారు. మన మనసులో ఏ ఆలోచనలు ఉంటాయో అలాగే లోకంకూడా మనకు కనిపిస్తుంది. మన మనసు మంచి ఆలోచనలతో ఉంటే అంతటా మంచిని చూస్తాం. కోతి ఎందుకలా ఉందో అడిగి తెలుసుకుందాం!” అంది.
జంతువులన్నీ అరవడంతో కోతి కళ్ళు తెరిచి చూసింది. తనచుట్టూ చేరిన జంతువులను చూసి ఆశ్చర్యపడింది. గద్ద కోతికి జరిగిన సంగతులు చెప్పి ,కళ్ళు మూసుకుని ఏంచేస్తున్నావని అడిగింది. కోతి కిచకిచ నవ్వి “మీ ఆలోచనలు తప్పు. అవి మీమనసులో అభిప్రాయాలు మాత్రమే. నేను పట్నంలో ఓ మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటాము. అని విన్నాను” అంది.
గద్ద నవ్వి “నువ్వు విన్నదీ, చూసిందీ నిజమే.కానీ కదలకుండా, మెదలకుండా కళ్ళుమూసుకున్నంత మాత్రాన ధ్యానం కాదు. ‘గురువులేని విద్య గుడ్డివిద్య ‘అనే సామెత వినలేదా!ధ్యానం గురించి తెలిసిన ఎవరో ఒకరిని కలిసి ఎలా చేయాలో నేర్చుకో.ఏపనినీ ఆపని గురించి తెలిసిన వారినుండి నేర్చుకోకుండా గుడ్డిగా చేయకూడదు”అని చెప్పింది. “అలాగే నేను నేర్చుకుని వచ్చి,మీకూ నేర్పిస్తాను”అంది కోతి.
జంతువులన్నీ వాటి మనసులోని ఆలోచనలను కోతికి ఆపాదించినందుకు సిగ్గుపడుతూ వెళ్ళిపోయాయి.
కథ పేరు ‘ అనగనగా ఒక కోతి ‘.
ఆకోతి ఏదో కాదు మన ‘ మనస్సే ‘ .
అందుకే ఈ కథకు ఈ శీర్షికను అంటే
పేరును పెట్టారు డి.కె.చదువులబాబు.
పై కథలో శీర్షిక నుంచి కథా ప్రారంభం, మలుపు, కొససమెరుపు, ముగింపు, శైలి, శిల్పం అన్ని లక్షణాలను మనం గమనించ వచ్చు. ఐతే ఆ లక్షణాల గురించి ముందు ముందు తెలుసు కుందాం.
( వచ్చే వారం మరో ఇద్దరు బాలసాహితీవేత్తలు తాము తీసుకున్న కథా వస్తువుతో కథను ఎలా రాశారో తెలుసుకుందాం )
పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.