తెలంగాణ వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన సురవరం ప్రతాపరెడ్డి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. లబ్ధ ప్రతిష్ఠుడు. ఒకపక్క స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే అపురూపమైన, అపూర్వమైన, అద్భుతమైన సాహిత్యాన్ని పండించారు. చరిత్ర పరిశోధనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆయన రచయిత, కవి, పరిశోధకుడు, సంఘ సంస్కర్త, అభ్యుదయవాది, పత్రికా రచయిత, సంపాదకుడు, అంతేకాక వివిధ సామాజిక, సాంస్కృతిక, విద్యాసంస్థల సంస్థాపకుడు. తన జీవితంలో ఒక్క నిమిషాన్ని కూడా వృథా చేయని అద్భుత వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. నిజాం కాలంలో తెలంగాణలో సాహిత్యం, సంస్కృతి, తెలుగు భాష క్రమంగా కనుమరుగవుతున్న సమయంలో ఆయన తెర మీదకు వచ్చి కలం ఝళిపించారు. వాటిని పునరుద్ధరించే బాధ్యతను, వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే కర్తవ్యాన్ని ఆయన తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన సాధారణంగా పట్టుబట్టరు. పట్టుకుంటే మాత్రం విడిచిపెట్టారు. చివరికి ఆయన తాను అనుకున్నది సాధించారు.
తెలుగు భాష, సాహిత్యం, విద్య, సామాజిక వికాసం, పత్రికా రచన వంటి అంశాల పునరుజ్జీవనానికి సంబంధించి ఆయన నిజాం పాలనపై అవిశ్రాంతంగా పోరాడారు. నిజానికి నిజాం పాలనపై పోరాడడం ఆ రోజుల్లో ఒక పెద్ద సవాలుగానే చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో సామాజిక అవగాహన పెంచడానికి, ముఖ్యంగా సంస్కరణలు తీసుకు రావడానికి ఆయన చేసిన పోరాటాలు ఆయన పేరును సార్థకం చేస్తాయి. ఆయన స్త్రీ విద్య, కుల వ్యవస్థ నిర్మూలన, దేవాలయాల్లో సర్వజనులకు ప్రవేశం కల్పించడం, బాల్య వివాహాలను నిలువరించడం, వితంతు వివాహాలను ప్రోత్స హించడం వంటి వాటి కోసం ఆయన చేసిన కృషి వీరేశలింగం పంతులు, రాజారామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు వంటి వారిని మరిపిస్తాయి.
నిజాం పాలకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ పట్టించుకోని సురవరం ప్రతాపరెడ్డి తన ఆశయాలను, లక్ష్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పత్రికా రచనను కూడా ఒక అస్త్రంగా చేసుకున్నారు. వార్తాపత్రిక అనేది ఒక సమర్థవంతమైన, ప్రభావవంతమైన ఆయుధంగా భావించిన ప్రతాపరెడ్డి 1926లో ‘గోలకొండ పత్రిక’ను ప్రారంభించారు. అందులో ఆయన తిరుగుబాటుతో కూడిన రచనలు తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయి. 1896 మే 28న మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాలపాడు గ్రామంలో పుట్టి పెరిగిన ప్రతాపరెడ్డి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ, తిరువాన్కూరులో బి.ఎల్ చదివారు. కొద్దికాలం పాటు న్యాయవాద వృత్తిని నిర్వహించిన ఆయన అనేక భాషలను, వాటి లోతుపాతులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
ఆయన నెలకొల్పిన ‘గోలకొండ పత్రిక’ సామాజిక, స్వాతంత్య్ర ఉద్యమాల్లో ఒక మైలు రాయి. ఇందులోని సంపాదకీయాలు, వ్యాసాలు, వార్తలు నిజాం పాలకుడిని అనేక విషయాల్లో నిలదీయడం, ప్రశ్నించడం జరిగేది. వీటి మీద మండిపడిన నిజాం ప్రభుత్వం సమాచార శాఖ అనుమతించిన తర్వాతే సంపాదకీయాలను ప్రచురించాలనే నిబంధన పెట్టింది. దాన్ని తిప్పికొడుతూ ఆయన ప్రపంచ ప్రముఖులు, మేధావుల సూక్తులను ఎంపిక చేసి సంపాదకీయాలకు ప్రత్యామ్నాయంగా ప్రచురించడం ప్రారంభించారు. ఆయన రాసిన ‘రామాయణ విశేషము’, ’మొగలాయి కథలు’, ‘సురవరం
ప్రతాపరెడ్డి వ్యాసాలు’, ‘సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు’, ‘యువజన విజ్ఞానం’, ‘భక్త తుకారాం’, ‘ప్రజాధికారములు’ వంటి గ్రంథాలు నిజాం కాలం నాటి తెలుగు సాహిత్యం, చరిత్ర, అణచివేత ధోరణులు వగైరా సమకాలీన పరిణామాలకు అద్దంపడతాయి. తెలుగువారికి చూపునిచ్చిన మహానుభావుడుగా ఆయన గుర్తింపు పొందారు.