గాంధీజీ, నేతాజీల సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఈ మధ్య కాలంలో అనేక తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. గాంధీజీ మీద నేతాజీ చేసినట్టుగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి. విచిత్రంగా, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం ఇటువంటి దుష్ప్రచా రానికి ఒడిగట్టడం జరుగుతోంది. ఇటీవల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గాంధీజీ మీద ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం దేశంలో గాంధీజీ గురించి ఉన్న కొన్ని విపరీత అభిప్రాయాలనే ఇది ప్రతిబింబించింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత గాంధీజీ అహింసా విధానం నిష్ఫలం, నిరుపయోగం అయి పోయిందని, నేతాజీ సుభాస్ చంద్రబోస్ కారణంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశం వెలుపల నుంచి నేతాజీ సాగించిన సాయుధ పోరాటం వల్లే బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారని రవి చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన వ్యాఖ్యల్లో ఎంత వరకూ నిజం ఉందన్నది పరిశీలించాల్సి ఉంది.
నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఇతర దేశ నాయకులందరి మాదిరిగానే దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు సాగించారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆయన కూడా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల కోవకు చెందిన వ్యక్తి. 1927 నుంచి 1939 వరకూ, ఆ తర్వాత 1940 నుంచి 1945 వరకూ ఆయన అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించారు. జైలు శిక్షలు అనుభవించారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఆయన జర్మనీ, ఇటలీ, ఆ తర్వాత జపాన్ దేశాలను సందర్శించి సైన్యాన్ని కూడగట్టే ప్రయత్నం చేశారు. 1942-45 సంవత్సరాల మధ్య ఆయన స్వాతంత్య్ర పోరాటంలో నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది. ఆ సమయంలో బ్రిటిష్ పాలకులు దేశంలోని ముఖ్య నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో కూర్చోబెట్టడం జరిగింది. హిందూ మహాసభ , ఆర్.ఎస్.ఎస్ వంటి సంస్థల కన్నా ఆ సమయంలో నేతాజీ చేసిన సేవలే దేశాన్ని ఒక కుదుపు కుదిపాయి. ఇంతకూ 1920 నుంచి 1945 వరకూ దేశానికి గాంధీజీ సాగించిన పోరాటాల గురించి, దేశానికి చేసిన సేవల గురించి నేతాజీ అభిప్రాయాలేమిటన్నది ఇక్కడ చాలా ముఖ్యం.
నేతాజీకి సదభిప్రాయం
దేశ స్వాతంత్య్ర పోరాటం మీద నేతాజీ 1937లో ‘ది ఇండియన్ స్ట్రగుల్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. అయితే, ఆ పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అయితే, నెహ్రూ ప్రధాని అయిన తర్వాత 1948లో ఆ నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. నేతాజీ ఆ పుస్తకంలో గాంధీజీ సాఫల్య, వైఫల్యాల గురించి విశదంగా రాయడంతో పాటు, ఆయనపై తనకున్న అభిప్రాయాల గురించి కూడా రాశారు. 1920లలో భారతదేశం ఒక నాలుగు రోడ్ల కూడలిలో నిలబడిపోయి ఉంది. ఎక్కడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అవకాశం లేదు. సాయుధ తిరుగుబాటుకు, పోరాటాలకు అవకాశమే లేదు. ప్రతి వాడికీ మౌనం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. దేశ ప్రజలంతా సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న సమయం అది. అటువంటి క్లిష్ట సమయంలో గాంధీజీ తెర మీదకు వచ్చారు. అంతవరకూ ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితం అయిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక పోరాట సంస్థగా తీర్చిదిద్దారు. ఇంత తక్కువ కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీని, దేశ ప్రజలను పోరాటానికి సమాయత్తం చేయడం ఎలా సాధ్యమైంది?
ఆయన ఇదే లక్ష్యం మీద దృష్టంతా కేంద్రీకరించారు. అకుంఠిత దీక్షతో అహర్నిశలూ శ్రమించారు. దేశ సమైక్యత, సమగ్రతలే లక్ష్యంగా ఆయన దేశ ప్రజలను కూడగట్టారు. పార్టీని ఒక్క తాటి మీద నడిపించారు. హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా జీవించాలని కోరుకున్నారు. ఎక్కడా ఎక్కువా తక్కువన్న భేదభావం లేదు. వర్ణ, వర్గ వివక్ష లేదు. పేదలు, ధనికులన్న వ్యత్యాసం లేనే లేదు. 1931లో లండన్ లో జరిగిన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో గాంధీజీ మాట్లాడుతూ, ‘‘నేను ఇక నుంచి ఒక ప్రత్యేక లక్ష్యంతో పనిచేయబోతున్నాను. నా కౌపీనం నా దేశ పరిస్థితికి, నా దేశ ఉన్నతికి అద్దం పడుతోంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నాకు బ్రిటిష్ వారి నుంచి ఏమీ అవసరం లేదు. నేనేమీ ఆశించడం లేదు. నేను నా దేశ ప్రజలు బాధపడుతుంటే చూడలేను. నేను వారి కోసం ఎంత బాధనైనా ఓర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని గాంధీజీ ప్రసంగించడం నేతాజీని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.
తప్పుడు ప్రచారాలు
గాంధీజీ 1934 వరకూ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రారంభించకపోవడాన్ని నేతాజీ తీవ్రంగా విమర్శించారు. గాంధీజీకి దేశమన్నా, దేశ ప్రజలన్నా అపారమైన అభిమానం ఉంది కానీ, ఆయన తన శత్రువుని, అంటే బ్రిటిష్ వారిని అంచనా వేయడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారని నేతాజీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆయన ఎన్ని పోరాటాలు జరిపినప్పటికీ, బ్రిటిష్ వారి కుయుక్తులను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం మాత్రం జరగలేదని కూడా బోస్ అన్నారు. ఈ కారణంగానే తాను చివరి వరకూ గాంధీజీతో చేతులు కలపలేకపోయానని కూడా బోస్ రాశారు. ఇక 1942లో ప్రవాసంలో ఉంటూ, ఐరోపా, దక్షిణాసియా దేశాల్లో సాయుధ పోరాటానికి మందీ మార్బలాన్ని సిద్ధం చేస్తూ, వ్యూహాలు పన్నుతున్న నేతాజీకి గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం కోసం తీర్మానం చేసినట్టు తెలిసి భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం అవసరమైతే మరణించడానికైనా తాను సిద్ధమేనని, ఒంటరిగా పోరాటం సాగించడానికి కూడా తాను జంకేది లేదని స్పష్టం చేశారు. ఇక్కడ తొంభై నిమిషాల సేపు చేసిన ప్రసంగం నేతాజీని కదల్చి వేసింది. గాంధీజీతో తెగతెంపులు చేసుకున్న నాలుగేళ్లకు, అంటే 1943లో నేతాజీ సింగపూర్ లో రేడియోలో ప్రసంగిస్తూ గాంధీజీని బాపూజీ అని, జాతి పిత అని సంబోధించడం కూడా జరిగింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతో నేతాజీ సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఇందులో ఒక దళానికి గాంధీ దళమనీ, మరొక దళానికి నెహ్రూ దళమనీ పేరు పెట్టడం కూడా జరిగింది. 1944లో ఆయన ఢిల్లీ చలో ఉద్యమాన్ని చేపట్టి, ఎర్ర కోట మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీజీకి అప్పగించాలన్న ఆలోచన కూడా చేశారు.
గాంధీజీని నియంత అనీ, ఉన్మాది అనీ విమర్శించిన నేతాజీ తన గ్రంథంలో గాంధీజీ లేకుండా దేశానికి స్వాతంత్య్రం రావడం అసాధ్యమని కూడా చెప్పారు. గాంధీజీ హఠాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించడం, మరికొన్ని ఉద్యమాలను కూడా అకారణంగా రద్దు చేయడం, కొందరు దేశ నాయకులను ఉరికంబాల నుంచి కాపాడలేకపోవడం వంటి విషయాలను కూడా నేతాజీ విమర్శించడం జరిగింది. తాను కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికవడం గాంధీజీకి నచ్చలేదని తెలిసిన మరుక్షణం నేతాజీ ఆ పార్టీకి రాజీనామా చేసి గాంధీజీకి మరింత దూరం జరిగారు. నిజానికి, గాంధీజీ ప్రవచించిన విలువలు, ఆయన సాగించిన పోరాటాలు నేతాజీకి స్ఫూర్తినిచ్చాయి కానీ, కొన్ని విషయాల్లో ఆయన వ్యవహరించిన తీరును మాత్రం నేతాజీ ససేమిరా అంగీకరించలేదు. గాంధీజీ అంటే నేతాజీకి ఇష్టం లేదని ఎవరూ అనలేదు. కానీ, నేతాజీ చేపట్టిన సాయుధ పోరాటం కారణంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే అభిప్రాయం మాత్రం వ్యక్తం అవుతూ వచ్చింది. బ్రిటిష్ వారి రికార్డులు సైతం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
– వి. వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు