Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Bhupalapalli: నిర్మాణ లోపాల అడ్డా.. కాళేశ్వరం మేడిగడ్డ

Bhupalapalli: నిర్మాణ లోపాల అడ్డా.. కాళేశ్వరం మేడిగడ్డ

మరమ్మత్తులపై తేలుస్తారా లేక కూలుస్తారా

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నిర్మాణంలో అనేక లోపాలను అధికారులు తమ విచారణలో గుర్తించారు. 2018 శాసనసభ ఎన్నికలకు ముందు ప్రారంభించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 2023 నవంబర్ లో ఎన్నికల సమయాన కుంగి పోయి, ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు ప్రధాన అస్త్రంగా మారింది. విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారించి బ్యారేజ్ నిర్మాణంలో వివిధ లోపాలున్నట్లు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా సమాచారం.

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ లో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పై విచారణకు ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్ ఏడవ బ్లాక్ కుంగి పోవడానికి నిర్మాణ లోపాలు అనేక ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ లోపాల కారణంగా బ్యారేజ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, వచ్చే వర్షాకాలపు వరదలను బ్యారేజ్ ఎంతవరకు తట్టుకునే నిలబడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నిర్మాణ లోపాలతో పాటు అనేక టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నిర్మాణ సంస్థకు పదేపదే గడువు పెంచడం, అంచనాలు సైతం ఇష్టమైన రీతిలో పెంచినట్లు అధికారులు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. 2021 సెప్టెంబర్ 6న 3260 కోట్ల నుండి 4613 కోట్లకు అంచనాలు పెంచడం జరిగిందని ఆ నివేదికలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వివరించినట్లుగా తెలుస్తోంది. బ్యారేజ్ నిర్మాణంలో కొన్ని పెండింగ్ పనులునప్పటికీ, నిర్మాణం పూర్తయినట్టు ఇంజనీరింగ్ అధికారులు గుప్తేదారు సంస్థకు సర్టిఫికెట్లు కూడా జారీ చేయడాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. మరోవైపు టెక్నికల్ సమస్యలు ఉత్పన్నం అయిన నేపథ్యంలో వాటిని తిరిగి బాగు చేయాలంటూ నిర్మాణ సంస్థకు లేఖలు రాసిన విషయాన్ని కూడా అధికారులు తన నివేదికలో గుర్తించి పొందుపరిచారు. ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తంగా ఆరుసార్లు నిర్మాణ గడువును పెంచారని కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకపోవడంతో వాటర్ ఫ్లోటింగ్ వల్ల బ్యారేజీ తీవ్రమైన ఒత్తిడి పడిందని అధికారులు తమ నివేదికలో వివరించారు.

మేడిగడ్డ విషయంలో ఇరిగేషన్ అధికారుల తప్పిదాలు అడుగడుగున కనిపిస్తున్నాయని నిర్మాణ సంస్థ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని విజిలెన్స్ అధికారులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు మేడిగడ్డ నిర్మాణంలో తమ గడువు ముగిసిందని బ్యారేజ్ కుంగి పోవడానికి తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి గుత్తేదార్ సంస్థ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను ముఖ్యమంత్రి పరిశీలించాక మరమ్మతులతో సరిపెడతారా లేక బ్యారేజ్ నిర్మాణాన్ని కూలుస్తారా?ఎలాంటి నిర్ణయం వెలబడుతుందో వేచి చూడాలి మరి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News