Friday, November 22, 2024
HomeతెలంగాణMedaram no plastic: మేడారంలో ప్లాస్టిక్ వాడద్దు

Medaram no plastic: మేడారంలో ప్లాస్టిక్ వాడద్దు

ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో కలెక్టర్

రానున్న మేడారం మహా జాతర సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ ఉపయోగించుకోవడం పూర్తిగా తగ్గించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇప్పటినుండే మేడారంలోని ప్రభుత్వ కార్యాలయాలు, మంచినీటి ట్యాంకులు, రోడ్లను శుభ్రం చేస్తూ పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పటిష్ట కార్యాచరణతో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ ను విజయవంతం చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా ప్రధాన అజెండాగా ప్రత్యేక అధికారులు పనిచేయాలని సూచించారు.

- Advertisement -

బుధవారం నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్దేశిత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, గ్రామ పంచాయతీ విధులలో పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న త్రాగునీటి పైప్ లైన్ కుళాయి లీకేజీలను అరికట్టాలని, త్రాగునీరు సరఫరా ఇబ్బంది ఉన్న ఇండ్లు, వార్డులను గుర్తించి గ్రామీణ నీటి సరఫరా అధికారుల సమన్వయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో అధికంగా చెత్త ఉండే వల్నరబుల్ ప్రదేశాలను గుర్తించి, వాటిని శుభ్రం చేయాలని అక్కడ చెత్త వేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ నీటి నిల్వ ప్రాంతాల్లో విసరడం యాంటి లార్వా చల్లడం ఫాగింగ్ వంటి నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రత్యేక గ్రామసభలు ఏర్పాటు చేసి మద్యం, మాదక ద్రవ్యాలు, గుట్కా మొదలైన వాటి వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కల్పించాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ పి. శ్రీజ, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డి ఎల్ పి ఓ స్వరూప రాణీ, గ్రామల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News