ఈనెల 21 నుండి 24 వరకు జరిగే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని అమ్మవార్లను మంత్రి జిల్లా అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 23 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తో పాటు రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
భక్తులు తల్లులను దర్శించుకోవడానికి క్యు లైన్లు సంఖ్యను పెంచామన్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మహా జాతరను పురస్కరించుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.