హిమంతా బిస్వా, జ్యోతిరాదిత్యా సింధియా, గులాం నబీ ఆజాద్..అసలు వీళ్లంతా ఎందుకు కురువృద్ధ కాంగ్రెస్ పార్టీని వీడారు ? వీరు కాంగ్రెస్ పార్టీ వీడలేదు కానీ వీడక గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు కాంగ్రెస్ నుంచి బయటపడ్డారు. పైగా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా.. వేరే పార్టీని వేదికగా చేసుకుని పోరాడుతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి వచ్చి చేరారు బాదల్. కాంగ్రెస్ ఇలా టాప్ లీడర్స్..చెరిష్మా, సొంత ఇమేజ్ ఉన్న లీడర్లను వదులుకుంటే ఎలా ?
పాదయాత్రతో పార్టీ ఇమేజ్, రాహుల్ వ్యక్తిగత గ్రాఫ్ పెరిగినప్పటికీ పార్టీని వీడకుండా.. మరింత బలోపేతం అయ్యేలా చర్యలపై ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. జైరాం రమేష్, దిగ్విజయ సింగ్ వంటివారు రాహుల్ పాదయాత్రలో మునిగి తేలుతున్నారు. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గేకు ఏం చేయాలో తోచట్లేదు..మరోవైపు అంతో ఇంతో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు ప్రియాంక..ఈమధ్య కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వుమెన్ మ్యానిఫెస్టో అంటూ సందడి చేసే ప్రయత్నం చేశారు ప్రియాంక. మిగిలింది సోనియా గాంధీ ఆమె ఆరోగ్య రీత్యా మెత్తబడ్డారు..ఈమధ్యనే ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో శ్వాసకోస వ్యాధులకు చికిత్స తీసుకుని డిస్చార్జ్ అయ్యారు. దీంతో ఖర్గేకు ఏం చేయాలని బోధించేవారు లేక సైలెంట్ గా., రొటీన్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ ఇప్పటికే డీలా పడింది. మాజీ సీఎం అమరిందర్ సింగ్ పతనంతోనే పార్టీకి అడ్రస్ గల్లంతైంది. మరోవైపు ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఆర్థికశాఖా మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కూడా పార్టీని వీడటం చూస్తుంటే పంజాబ్ లో ఇక కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పదని తెలుస్తోంది. అధిష్ఠానం ఆడుతున్న గేమ్ లో ఫ్యాక్షనిజం, గ్రూపిజం ఎక్కువైందని బాదల్ ఆరోపిస్తున్నారు. భారత్ జోడో యాత్ర పంజాబ్ బార్డర్స్ దాటిందో లేదో ఈలోగా బాదల్ చేసిన ఈ ఆరోపణలు షాక్ ఇస్తున్నాయి. బీజేపీలో చేరిన ఆయన రాహుల్ కు సంధించిన లేఖ వైరల్ గా మారింది. అందులో బాదల్ చేసిన ఆరోపణలు కొత్తేమీ కాకపోయినా వీటిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకుంటుందనేది అర్థం కాని బేతాళ ప్రశ్న.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ ఢిల్లీలోని ఓ కోటరీ చేతుల్లో సాగుతోందని బాదల్ ఆరోపించారు. ఈ కోటరీ గ్రూపిజంను పెంచి పోషిస్తోందని రాహుల్ కు సంధించిన లేఖలో బాదల్ మండిపడ్డారు. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి ఏమాత్రం కొత్త కాదు. నిజానికి సోనియా, రాహుల్ కు ఇవన్నీ రొటీన్ గా వినే కంప్లైంట్లే.
2015లో ఇలాంటి ఫిర్యాదులతోనే హిమంతా బిస్వా శర్మ కాంగ్రెస్ వీడి బీజేపీలో వెలుగుతున్నారు. ప్రస్తుతం ఈయన అస్సాం సీఎంగా, హిందుత్వ ఇమేజ్ తో వెలిగిపోతూ, ఈశాన్య రాష్ట్రాల్లో చక్రం తిప్పే స్టేజ్ కి ఎదిగారు. ఇక ఈమధ్య పార్టీ వీడిన వారి లిస్టు చూస్తే చాలా పెద్దది. గులాం నబీ ఆజాద్ గత సెప్టంబర్ లో పార్టీ వీడారు..ఆతరువాత జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, అశ్వని కుమార్, ఆర్పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద, సుష్మితా దేవ్, సునీల్ జాకర్, హార్దిక్ పటేల్, ఎన్ బీరేన్ సింగ్, ప్రేమా ఖండూ, పీసీ చాకో, జైవీర్ షెర్గిల్.. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన కొందరు సొంత పలుకుబడి ఉన్నలీడర్లంతా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆజాద్ రాసిన లేఖ విషయాన్ని కాంగ్రెస్ నేతలంతా పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చర్చలు, చర్చించటం అనే సంప్రదాయాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ ధ్వంసం చేశారని ఆజాద్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అప్పట్లోనే హిమంతా చాలా క్లియర్ గా చెప్పారు..తన కుక్కతో టైం పాస్ చేసుకునే రాహుల్ కు పార్టీ లీడర్లతో చర్చించే టైం, ఆసక్తి ఉండదనే ఆరోపణలే చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు.
ప్రస్తుతం మధ్య వయసు దాటిన రాహుల్ గాంధీని పార్టీలో యూత్ ఐకన్ గా ఇప్పటికీ చెబుతున్నారు కానీ.. రాహుల్ మాత్రం జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్, హిమంతా వంటివారెవరినీ ఎన్నడూ లెక్కపెట్టలేదు. ఇప్పటికీ సచిన్ పైలట్ రాహుల్ కు అత్యంత సన్నిహితుడైనా తన మాట ఎందుకు నెగ్గించుకోలేక పోతున్నారనేది అంతు చిక్కదు. రాహుల్ మాత్రం పాత కోటరీ, కురు వృద్ధులనే అతిగా విశ్వసిస్తూ వారిపైనే అన్నిటికీ ఆధారపడుతూ.. సోనియా కోటరీనే పెంచి పోషిస్తున్నారని యువ, మధ్య వయసు కాంగ్రెస్ లీడర్లు మండిపడుతున్నారు. జైరాం రమేష్, డిగ్గీ రాజా వంటి వారిని వెంటేసుకుని తిరిగే రాహుల్ కు కొత్త తరం అంటే భయమా లేక వారిని పోటీగా భావిస్తారా అన్నది రాజకీయ పండితులకే అర్థం కావటం లేదు.
జీ23 లీడర్లు లేఖ రాసినా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించలేదు. దీంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీలో ఇమడలేమంటూ సిబల్, ఆజాద్ వంటివారు తప్పుకున్నారు. ఇక శశిథరూర్ వంటివారు ఏం చేయాలో పాలుపోక ఇంకా పార్టీలో కొట్టుమిట్టాడుతూ మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ బలోపేతం అవుతోంది..మళ్లీ జనాదరణ లభిస్తోంది..రాహుల్ పప్పూ కాడు స్మార్ట్..ఇవన్నీ సరే..మరి అత్యధిక రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు సంక్షోభంలో నానాటికీ కూరుకుపోతోంది ? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి గురించి చర్చించుకోకపోవటమే బెటర్ అనేలా నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇక రాజస్థాన్ లో అయితే నిత్యం ఇక్కడ రావణ కాష్టం రగులుతోంది..ఓవైపు సచిన్ పైలట్ వర్గం మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి చేయి దాటుతోంది. మరోవైపు సచిన్ కు రాజస్థాన్ కాంగ్రెస్, ప్రభుత్వ పగ్గాలు అప్పగించి గెహ్లాట్ ను దించేస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నా అది ఎటూ తేలట్లేదు. ఇటు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు తన్నుకు వస్తుంటే.. రాహుల్ భారత్ జోడో యాత్ర కశ్మీర్ లో ముగిసాక రాజస్థాన్ సంగతి తేల్చేస్తామని బీరాలు పలుకుతోంది హైకమాండ్.
భారత్ జోడో యాత్రకు వస్తే రాహుల్ పాదయాత్రతో పార్టీ అధికారంలోకి రావటం ఖాయమనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఒకటి మాత్రం నిజం రాహుల్ ఇమేజ్ పప్పు కాదని స్మార్ట్ అని చాలామంది భావించే స్థితికి రాహుల్ ఇమేజ్ ను తెచ్చింది ఈ భారీ పాదయాత్ర. ఇక ఈనెలాఖరుకి భారత్ జోడో యాత్ర ముగుస్తుంది..మరి ఆతరువాత పార్టీని ఎలా ఉద్ధరిస్తారంటే దానికి జవాబు చెప్పే నాథుడు పార్టీలో లేరు..ఇందుకు అవసరమైన వ్యవస్థ ఏమీ ఏర్పాటు కాలేదు. పేరుకు ఖర్గే అధ్యక్షుడు కానీ పెత్తనం అంతా గాంధీ కుటుంబందే. అందుకే కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ స్టెప్ ఏంటంటే.. సింపుల్ భారత్ జోడో యాత్ర 2.0. ఇలా వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకూ పాదయాత్ర అంటూ నిత్యం రాహుల్ జనంలో ఉంటే చాలు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేస్తారని జైరాం, డిగ్గీ రాజా వంటివారు లెక్కలేస్తున్నట్టున్నారు.
తెల్ల టీ షర్ట్ ఒకటి వేసుకుని, రోజుకు 20-25 కిలోమీటర్లు నడిచేస్తే అధికారం చేతికి వస్తుందా ? ఓవైపు ఛత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నిత్య కుంపటి రగులుతుంటే రాహుల్ కు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదను కోసం ప్రతిపక్ష బీజేపీ ఇక్కడ కాచుకుని కూర్చుంది. బీజేపీలో చేరేందుకు ఆరోగ్య శాఖా మంత్రి టీఎస్ సింగ్ డియో తట్టా బుట్ట సర్దుకుని ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న డియో కాంగ్రెస్ వీడి..బీజేపీ పంచన చేరతారంటూ కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. అయినా పార్టీ పెద్దలెవ్వరికీ ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ వ్వవహారాలు పట్టడం లేదు. ఛత్తీస్ గఢ్ ఎన్నికలు కూడా వస్తున్న సమయంలో సొంత పార్టీ పెట్టేందుకు కూడా డియో వెనుకాడటం లేదు.