ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో జర్నలిస్ట్ ల ఇంటి స్థలాల మంజూరుకు సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జివో నెం.535 లో పొందుపరిచిన నిబంధనల ప్రకారం అర్హులైన జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు మంజూరు కు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 5 సంవత్సరాల అనుభవం కలిగిన 368 మంది అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల జాబితా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా వచ్చిందని, ఈ జాబితాను మండల వారీగా విభజించి తహసీల్దార్లకు పంపించి వెరిఫికేషన్ చేయించడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకున్న విలేకరులు కోరుకున్న విధంగా ఆయా మండలాల్లో, డివిజన్ కేంద్రాల్లో, కర్నూలు నగరంలో ఇళ్ళ స్థలాల కోసం భూములను గుర్తించడం జరిగిందన్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ స్కీం కు సంబంధించిన కమిటీ సభ్యులు ఆ స్థలాలను పరిశీలించాలని కలెక్టర్ కమిటీ సభ్యులు నాగిరెడ్డికి సూచించారు.
కర్నూలు నగరానికి సంబంధించి రెండు చోట్ల భూమిని గుర్తించినట్టు తహశీల్దార్లతో కలిసి వెంటనే ఆ భూములను పరిశీలించి తమ అభిప్రాయం చెప్పాలని కలెక్టర్ తెలిపారు. గురువారం సాయంత్రం పరిశీలిస్తామని కమిటీ సభ్యులు నాగిరెడ్డి తెలిపారు. అనర్హులుగా గుర్తించిన జర్నలిస్టులు వెరిఫికేషన్ కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే డి ఆర్ ఓ లేదా సంబంధిత తహసీల్దార్ కు తెలియచేయవచ్చని కలెక్టర్ సూచించారు. అదే విధంగా నంద్యాల జిల్లాకు సంబంధించిన 15 మంది విలేకరులు కర్నూలు జిల్లాలో పని చేస్తున్నామని, కర్నూలు నగరంలో స్థలం కావాలని కోరియున్నారని, ఆ జాబితాను నంద్యాల డిఆర్ఓ కి పంపించి వెరిఫై చేయించి, అర్హులైన వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్ఓ మధుసూదనరావు, సమాచార శాఖ డిడి జయమ్మ, కమిటీ మెంబర్ నాగిరెడ్డి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్ తహసీల్దార్లు మునివేలు, రామాంజులు నాయక్, మోహన్ కుమార్ పాల్గొన్నారు.