మహానంది క్షేత్రం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం రూ.10.50 కోట్ల అంచనాతో నూతనంగా నిర్మించనున్న ‘నంది సదనము’ వసతి గదుల సముదాయంకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటికి నేటికి మహానంది క్షేత్రం అభివృద్ధి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికీ, ప్రతి భక్తుడికీ కనబడుతుందని తెలిపారు. మహానంది ఆలయం అభివృద్ధికి తాను సొంత డబ్బు 3 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు వెచ్చించానని తెలిపారు.
ఆలయ అభివృద్ధికి విరాళాలు అందిస్తున్న దాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాడు దేవస్థానం ఖాతాలో కేవలం 50 లక్షల రూపాయలు ఉండగా నేడు 18 కోట్ల రూపాయలు చేరిందన్నారు. దాతల నుండి నిధులు సేకరణ, అభివృద్ధి పనులను పర్యవేక్షించడంలో తీవ్ర కృషి చేసిన మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులకు, ఆలయ అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం దేవస్థానంలో కాంట్రాక్టు ఏజెన్సీ ఉద్యోగస్తులకు నెలసరి వేతనాలు పెంచే విషయంలో కృషి చేసిన ఎమ్మెల్యే, ఈఓను ఏజెన్సీ ఉద్యోగస్తులు సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శిల్పా భువనేశ్వర రెడ్డి, ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మధు, మాజీ దేవస్థానం చైర్మన్ కొమ్మ మహేశ్వర్ రెడ్డి, జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ చలం శిరీష, కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్, దేవస్థానం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.