ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించుకోవడంలో కొంతమంది తమ నైపుణ్యాన్ని చూపెడుతుంటారు. అదే ప్రభుత్వ భూమి కోట్లలో విలువ చేస్తుంది అనుకున్నప్పుడు ఎంతకైనా తెగిస్తారు. గత పది ఏళ్లలో భూముల రేట్లు ఒకటికి పదింతలు పెరగడంతో ప్రస్తుతం భూములను కొనాలంటే సామాన్యులకు సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. కానీ కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలకు ఫోర్జరీ కాగితాలు సృష్టించడం విశ్మాయాన్ని కలిగిస్తుంది.
ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే మీరు పొరపడినట్లే కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తిలోనే… గ్రామపంచాయతీ గా ఉన్న రేకుర్తి 2018 లో కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం అయింది. కానీ కొంతమంది అక్రమార్కులు ఒక్కరి పేరు పైనే సుమారు రూ,3,80,000 ఇంటి పన్నును 2019లో కట్టినట్లు గ్రామ పంచాయతీ కార్యాలయం పేరుతో ఫోర్జరీ పత్రాలను సృష్టించారు. 2018లో నగర పాలక సంస్థలో విలీనం కాబడిన రేకుర్తి 2019లో ఎలా గ్రామ పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించారు అనే విషయం అర్థం కాలేని పరిస్థితి నెలకొంది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకే వ్యక్తిపై 14 ఇంటి నెంబర్లను మంజూరు చేయడం చూస్తుంటే ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో ఇంటి పన్నులు చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు ఒకే వ్యక్తి పేరు పై ఎన్ని ఇండ్లనైనా మంజూరు చేస్తూ ప్రభుత్వ భూములను కాజేస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తినప్పటికీ అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంతో భూ కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక్కరి పేరు పైనే ఇలా జరిగిందంటే రేకుర్తిలోని ప్రభుత్వ భూములపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే ఇంకెన్నో అవినీతి కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది.
ఫోర్జరీ పత్రాలు సృష్టించిన వారిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తున్న నేపథ్యంలో భూ అక్రమాలకు పాల్పడ్డ వారి వెన్నులో వణుకు మొదలవుతుంది. రేకుర్తి పరిధిలోని ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం పై లోతైన విచారణ జరిపి భూ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. భూ అక్రమార్కులపై ఉన్నతాధికారులు ఏమేరకు చర్యలు చేపడతారో వేచిచూడాలి మరి.