Saturday, November 23, 2024
HomeదైవంMedaram jatara: మూడు రోజుల్లో మేడారం మహా జాతర ప్రారంభం

Medaram jatara: మూడు రోజుల్లో మేడారం మహా జాతర ప్రారంభం

మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణ నాయక్ పోడ్ ల లక్ష్మి మరో దేవర

మేడారం జాతరలో గుర్రం తలతో ఉన్న ఒక దేవతాకృతిని ధరించి సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రారంభంలోనూ, జంపన్న వాగు వద్ద డప్పు, వాయిద్యాల మధ్య ఆడుతూ తిరగడం ఇక్కడికి వచ్చే భక్తులను ఆకర్షిస్తుంది. లక్ష్మి దేవర అని పిలిచే ఈ ఆదివాసీ దేవుడికి సంబంధించి ఆసక్తికరమైన కధానాలున్నాయి. లక్ష్మి దేవర నాయక్ పోడ్ అనే గిరిజన తెగకు ఆరాధ్య దేవత.
సమ్మక్కకు ఓ ఆడపడుచు ఉంది. ఆమె లక్ష్మీదేవర. జయశంకర్‌ జిల్లా గణపురం మండలం బూరుగుపేట నగరంపల్లిలో నేటికీ ఆమె మహిమలు వెదురు చెట్టురూపంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అక్కడ ఓ పురాతన ఆలయమూ ఉంది. లక్ష్మీదేవర గుర్రం రూపంలో ఉండగా పోతరాజు, కిష్టస్వామి.. చెక్కబొమ్మ రూపంలో ఉన్నారు. మేడారం జాతర సందర్బంగా, పగిడిద్దరాజు సోదరి అయిన లక్ష్మీదేవర అమ్మవారిని నాయకపోడ్ గిరిజనులు గద్దెల వద్దకు తీసుకెళ్లారు. మేళతాళాలతో నృత్యాలతో తమ ఆరాధ్య దైవాన్ని పగిడిద్దరాజు వద్దకు తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో సంతానం కలగని దంపతులు వచ్చి వీళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకునే ఆచారం ఉంది.
గద్దెలకు చేరే మొదటి దేవత
మేడారంలో అందరికన్నా ముందు చేరుకునే దేవత లక్ష్మీదేవర. నాయక్ పోడ్ కు చెందిన రెడ్డి, తగిన మేకల వంశం వారు సుమారు 55 కిలోమీటర్లు నడుచుకుంటూ అటవీ మార్గంలోని బూర్గుపేట, కాల్వపల్లి, దూదేకులపల్లి మీదుగా అమ్మవారిని మేడారం తీసుకెళ్తారు. వీరు ఏటా ఇక్కడి నుంచి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షతో తీసుకెళ్తారు. ఆ వనదేవతల ప్రతిరూపమైన వెదురు చెట్లు ఇంకా బతికి ఉండటానికి కారణం లక్ష్మి దేవర మహత్యానికి నిదర్శనమని పూజారులు చెబుతుంటారు. నగరంపల్లిలోని నాయక్‌పోడ్‌ వీధిలో లక్ష్మీదేవర నివసించిన ప్రాంతంలో నేటికీ రెండు వెదురు చెట్లు వందల ఏళ్ల నుంచి పచ్చగా ఉంటున్నాయి. లక్ష్మి దేవర జాతర ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగు పేట గ్రామంలో నాయకపోడ్ గిరిజనులు ప్రతీ సంవత్సరం ఉగాది తర్వాత ( మార్చి, ఏప్రిల్ మాసంలో) నిర్వహిస్తారు.

- Advertisement -


లక్ష్మి దేవర కు సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న కధనం

    తెలుగు విశ్వ విద్యాలయం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరపై 2008 లో ఒక ప్రత్యేక సంచిక ప్రచురించింది. దీనిలో లక్ష్మి దేవరపై ఈ విధంగా కధనం ఉంది.    పాండవులు మగధ రాజ్యంపైకి దండెత్తి యుద్ధం చేస్తుండగా.. రుక్మిణీదేవి తన అన్నను రక్షించుకోవాలని అనుకొంటుంది. ఆ తపనతో మారువేషం ధరించి యుద్ధానికి బయలుదేరుతుంది. యుద్ధ రంగంలో మారువేషంలో ఉన్న రుక్మిణిని చూసి, నందిగాముని తమ్ముడు అనుకొని అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆమె తల తెగి, అడవిలో ఉన్న మద్దిచెట్టు సమీపంలోని పుట్ట దగ్గర పడుతుంది. యుద్ధంలో నందిగాముని జయించి తిరిగివచ్చిన పాండవులకు, కృష్ణుడికి రుక్మిణి కనిపించదు. యుద్ధరంగంలో వెతకగా ఆమె మొండెం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుడు బాధతో, సైనికులను పిలిపించి, ఆడగుర్రం తల తీసుకురమ్మంటాడు. అదే సమయంలో అడవిలోకి వెళ్లిన నాయక్‌పోడ్‌ పెద్దలకు రుక్మిణి తల లభిస్తుంది. వారికి జరిగిన విషయం చెప్పి, తన తలను కృష్ణుడికి అప్పగించమని కోరుతుందామె. మరోవైపు సైనికులు తీసుకొచ్చిన గుర్రం తలను రుక్మిణి మొండానికి పెట్టి సంజీవని మంత్రం చదవడానికి పూనుకొంటుండగా, నాయక్‌పోడ్‌ వాళ్లు రుక్మిణి తలను తీసుకొస్తారు. దీంతో సంతోషించిన కృష్ణుడు గుర్రం తలను పక్కనపెట్టి, రుక్మిణి తలను మొండానికి పెట్టి సంజీవని మంత్రం చదువుతాడు. దీంతో రుక్మిణితోపాటు గుర్రం తలకూ ప్రాణం వస్తుంది. రుక్మిణి ప్రాణం కాపాడిన నాయక్‌పోడ్‌ పెద్దలకు ప్రాణం ఉన్న గుర్రం తలను కానుకగా ఇస్తాడు కృష్ణుడు. ‘మీ ఇంటికి ఇలవేల్పుగా, మీ జాతికి రక్షణగా ఉంటుంది’ అని దీవించాడు. అప్పటినుండి నాయక్‌పోడ్‌లు గుర్రం తలను లక్ష్మీదేవరగా పూజిస్తూ వస్తున్నారని ఐతిహ్యం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News