నేడు సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్ల మితిమీరిన వినియోగం ముక్కుపచ్చలారని చిన్నారుల బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నాయని.. లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి శ్రీమతి. మజ్జి బబిత అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ –సీఆర్ఏఎఫ్’ ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక హోటల్ లో రెండురోజుల పాటు జరగనున్న రాష్ట్రస్థాయి కన్సల్టేషన్ కార్యక్రమాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ శ్రీ. కేసలి అప్పారావు, ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ. రామ మోహన్, ఏపీఎస్ఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ. హెచ్. అమర రంగేశ్వరరావు, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ పి.ఫ్రాన్సిస్ తంబి, ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ శ్రీమతి జి.ప్రమీల రాణి, పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి. మజ్జి బబిత మాట్లాడుతూ.. పోక్సో చట్టం క్రింద బాధితులకు కేంద్రీకృత విధానాలను అమలు చేయడంలో ఎదురయ్యే సవాళ్లు, వాటికి సంబంధించిన పరిష్కారాలను వివరించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసమే పోక్సో చట్టాన్ని రూపొందించారన్నారు. పోక్సో చట్టానికి సంబంధించి సదరు బాధితులకు నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.
ఏపీ బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ శ్రీ. కేసలి అప్పారావు మాట్లాడుతూ.. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో న్యాయశాఖ, పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ తదితర శాఖల సమన్వయం చాలా ముఖ్యమన్నారు. కొందరు మానవ మృగాలు తమ వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే పోక్సో చట్టం వారిని కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు.
ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీ. రామ మోహన్ మాట్లాడుతూ.. పోక్సో చట్టం ద్వారా పిల్లలపై జరిగే సైబర్ నేరాలపై ఏవిధంగా పోరాడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను వివరించారు. నేటి సమాజంలోని వ్యవస్థల్లో ఎన్నో మార్పులు వచ్చాయని సామాజిక స్పృహతోపాటు సాంకేతికత కూడా పెరిగిందన్నారు. కాలానుగుణంగా ప్రతి ఒక్కరూ అప్ డేట్ అవుతున్నారని, అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు ఏ స్థాయిలో ఉంటాయో, అనర్థాలు కూడా అవే స్థాయిలో ఉంటాయన్నారు. నేడు చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వారి సంఖ్య పెరగడం బాధాకరమన్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందేవారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఏపీఎస్ఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ. హెచ్. అమర రంగేశ్వరరావు మాట్లాడుతూ.. పోక్సో చట్టం ద్వారా బాధితులకు అందించే సహాయ వ్యవస్థ యొక్క పాత్ర మరియు దాని బాధ్యతల గురించి సవివరంగా తెలియజేశారు. 2012లో వచ్చిన పోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందని, బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపొందించారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు, పిల్లల సంక్షేమ కమిటీ సభ్యులు, దిశ పోలీస్ అధికారులు, పోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, వివిధ జిల్లాల లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ మరియు వన్ స్టాప్ సెంటర్ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.