కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలన్నిటినీ స్తంభింపజేస్తూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. సకాలంలో ఆదాయ పన్ను రిటర్నులను అందజేయనందుకు జరిమానాగా రూ. 210 కోట్లు చెల్లించాలని కూడా ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. నిజానికి, ఆ పార్టీ చేసిన తప్పిదానికి, ఈ జరిమానాకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై అపిలేట్ ట్రైబ్యునల్ ను
ఆశ్రయించడంతో ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసు వ్యవహారం తేలేవరకు బ్యాంకు ఖాతాల్లో రూ. 115 కోట్లు ఉండేలా చూసుకోవాలని కూడా ట్రైబ్యు నల్ సూచించింది. అయితే, తమ కరెంట్ అకౌంటులో అంత డబ్బు లేదని కాంగ్రెస్ పార్టీ తెలియ జేసింది. ఒకటి రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయనగా ప్రధాన ప్రతిపక్షం అకౌంట్ల మీద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయ పన్ను శాఖ ఇటువంటి చర్య తీసుకోవడం సహజంగానే సందేహాలు రేకెత్తిస్తోంది. పాలక భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు, సంస్థల మీద ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాడులు జరుపుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఆదాయ పన్ను శాఖ రొటీనుగా తీసుకున్న చర్యల్లో ఇదొక భాగమే తప్ప తమకు ఇందులో ప్రమేయమేమీ లేదని పాలక పక్షం ఇప్పటికే వివరణ ఇచ్చింది. 2018-19 నాటి ఆదాయానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీ మీద ఈ చర్య తీసుకోవడం జరిగింది. 2019 డిసెంబర్ 31 నాటికి ఈ పార్టీ తమ ఆదాయ పన్ను రిటర్నులను చేయవలసి ఉండగా 45 రోజుల ఆలస్యం జరిగిందని ఆదాయ పన్ను శాఖ ఈ చర్య తీసుకున్నట్టు తెలిసింది. ఆ ఏడాది కాంగ్రెస్ పార్టీ రూ. 199 కోట్లు వసూలు చేయగా, అందులో సుమారు రూ. 14.40 లక్షలు నగదు రూపంలో వసూలు చేయడం జరిగింది. తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు నగదు రూపేణా ఆ మొత్తాన్ని చెల్లించడం జరిగిందని పార్టీ తెలియజేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం జరుగుతోందంటూ విమర్శలు వస్తున్నాయి.
రాజకీయాలకు, విరాళాలకు మధ్య ఉన్న లింకును తెంచేస్తూ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఒకటి రెండు రోజులైనా గడవక ముందే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఈ సంఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రూలింగు ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని కూడా స్పష్టం చేసింది. ఎన్నికల కోసం నిధులు సేకరించడం అనేది ఎన్నికలను, రాజకీయాలను ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు సేకరించినా, ఇతర విధాలుగా విరాళాలు సేకరించినా జవాబుదారీతనం, పారదర్శకత లేనప్పుడు అవి తప్పకుండా దుష్ప్ర భావానే కలిగిస్తాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిధులను స్తంభింపజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పదలచుకున్నదీ, దీన్ని ఏవిధంగా సమర్థించుకోబోతున్నదీ అర్థం కావడం లేదు. బీజేపీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఇది రొటీనుగా జరిగిన వ్యవహారం కాదని, ఆదాయ పన్ను శాఖ చేస్తున్న వాదన కూడా సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
తమను లక్ష్యంగా చేసుకునే ఆదాయ పన్ను శాఖను కేంద్ర ప్రభుత్వం ప్రయోగించిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అవినీతిపై పోరాడుతున్న పాలక పక్షం ఇటువంటి విషయాల్లో మరింత పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలకు మాత్రమే కాదు, జవాబుదారీతనమనేది పాలక పక్షానికి కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే దేశ ప్రజాస్వామ్యానికి అంత మంచిది.