Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Electoral Bonds: బాండ్ల జారీ రాజ్యాంగ విరుద్ధం

Electoral Bonds: బాండ్ల జారీ రాజ్యాంగ విరుద్ధం

జారీని వెంటనే ఆపేయాలి..

ఎన్నికల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎన్నికల ప్రజాస్వామ్యానికి సంబంధించినంత వరకు ఇది ప్రజా విజయమనే చెప్పవచ్చు. రాజకీయ పార్టీలకు, వాటికి సంబంధించిన వ్యవస్థలకు ఎవరు ఎప్పుడు నిధులు సమకూరుస్తున్నారనే విషయాన్ని ఓటరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది అతని హక్కు కూడా. దీన్ని హరిస్తూ ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడం, దాని వివరాలను గోప్యంగా ఉంచడం అనేవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడం నిజంగా ప్రశంసనీయమైన విషయం. 2017లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టినప్పుడు, రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు, సంస్థలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శలు సరైనవేనని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టమవుతోంది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ బాండ్ల పథకాన్ని కొట్టి వేయడంపై ఈ వర్గాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని సమాచార హక్కుకు సంబంధించిన సెక్షన్ 19(1)(ఎ)కి ఇది విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పథకానికి అనుకూలంగా ప్రభుత్వం చేసిన వాదనలు, ఇచ్చిన వివరణలు చెల్లవని అది తేల్చి చెప్పింది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం 2017లో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఈ పథకం గురించి వెల్లడించింది. దీనిని ఆర్థిక బిల్లు కింద ఆమోదింపజేసింది. రాజకీయ నిధుల సమీకరణకు సంబంధించి ఈ పథకం పారదర్శకంగా ఉంటుందని అది పేర్కొంది. ఈ పథకం కింద బీజేపీ ప్రభుత్వానికి అజ్ఞాత వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి రూ. 13,000 కోట్ల పైచిలుకు నిధులు అందాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ పథకం ద్వారా దాదాపు అన్ని పార్టీలు లబ్ధిపొందడం జరిగింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఆదాయ పన్ను చట్టాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, కంపెనీల చట్టాన్ని సవరించడం కూడా జరిగింది. వివిధ పార్టీలకు అజ్జాతంగా దాతల నుంచి నిధులు అందడానికి, ఈ నిధులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభించడానికి ఇవన్నీ అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

ఈ బాండ్ల జారీలో పారదర్శకత లేకపోవడాన్నే సుప్రీంకోర్టు ప్రధానంగా తప్పు పట్టింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు కూడా దీనిమీదే విమర్శలు సాగిస్తున్నాయి. దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది పాలక పక్షాలేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యధికంగా లబ్ధి పొందడం జరుగుతోందని అవి ఆరోపించడం జరిగింది. పార్టీలకు నిధులు ఎవరి దగ్గర నుంచి, ఏ మొత్తంలో నిధులు అందుతున్నాయనే విషయాన్ని ప్రజలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు భావిస్తోంది. రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అవి పనిచేయాల్సింది ప్రజల కోసమేనని, అందువల్ల ప్రజలకు ఈ వివరాలన్నీ తెలియాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించింది. ప్రజలకు అటువంటి సమాచారాన్ని తెలియనివ్వక పోవడం సమాచార హక్కుకు, ప్రజల ప్రాథమిక హక్కుకు భంగకరమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇతర వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి రాజకీయ పార్టీలు రహస్యంగా నిధులు సేకరించడమంటే ఇందులో ఇచ్చిపుచ్చుకునే ఒప్పందమేదో ఉందనే అర్థం. రాజకీయ రంగంలో నల్లధనాన్ని ఈ పథకం నిరోధిస్తుందనే ప్రభుత్వ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

కాగా, నిధుల సేకరణ విషయంలో ఈ పథకం ప్రతిపక్షాల కంటే పాలక పక్షానికే ఎక్కువ అనుకూలంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ పార్టీకి ఎవరు నిధులిస్తున్నారనే విషయాన్ని ఎస్.బి.ఐ నుంచి పాలక పక్షం వివరాలు సేకరించడానికి అవకాశం ఉంటుంది కానీ, ప్రతిపక్షాలకు ఈ అవకాశం ఉండదు. అంతేకాక, సాధారణంగా ఏ సంస్థలైనా, ఏ వ్యక్తులైనా పాలక పక్షానికి నిధులు ఇవ్వడానికే ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఈ ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఎస్.బి.ఐని ఆదేశించింది. ఇంతవరకూ ఏ పార్టీకి ఏ మేరకు నిధులు అందాయన్న విషయాన్ని వెంటనే ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేయాలని, ఈ వివరాలను మార్చి 31లోగా ఎన్నికల అధికారి తమ అధికారిక వెబ్ సైట్ లో ఉంచాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు, సజావైన వ్యవహారాలకు అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీపైనా ఉంటుందనడంలో సందేహం లేదు. ఎలక్టోరల్ బాండ్లు ఉన్నా, లేకపోయినా, దాదాపు అన్ని పార్టీలకు వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి రహస్యంగా నిధులు అందుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉన్నందువల్ల ఈ నిధుల సమీకరణ ఏమాత్రం పారదర్శకత లేకుండా, మూడో కంటికి తెలియకుండా, కొనసాగుతూనే ఉంటుందనడంలో కూడా సందేహమేమీ లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News