Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Khaidis & Human rights: ఖైదీలకు మానవ హక్కులు వర్తించవా?

Khaidis & Human rights: ఖైదీలకు మానవ హక్కులు వర్తించవా?

కిక్కిరిసిన జైళ్లలో..

దేశంలో వందలాది జైళ్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్న ఖైదీలను పట్టించుకునేవారే కరువయ్యారు. వాళ్లూ మనుషులేనని, వారికీ హక్కులు ఉంటాయని గుర్తించడం తగ్గిపోతోంది. జైళ్ల పరిస్థితి, ఖైదీల దుస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంటోంది. నిజానికి, న్యాయం, మానవ హక్కులు వంటి సూత్రాల మీద పునాదులు నిర్మించుకున్న సమాజంలో నిందితులైనా, నేరస్థులైనా, సాధారణ ప్రజానీకానికైనా సరి సమాన హక్కులుంటాయి. ఈ విలువలకు కట్టుబడి ఉంటేనే ఏ సమాజమైనా మానవ సమాజంగా వర్ధిల్లుతుంది. ప్రజలందరి మాదిరిగానే నేరస్థులకు కూడా హక్కులుం టాయి. అయితే, వారి హక్కులను వారికి దక్కకుండా చేయడం జరుగుతోంది. జైళ్లలో నిందితులు, నేరస్థుల స్థితిగతులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతోంది. దాదాపు 90 శాతం మంది నేరస్థులకు హక్కులంటూ ఏమీ ఉండడం లేదని అది స్పష్టం చేసింది. నిందితులు, ఖైదీలు, నేరస్థులకు కూడా రాజ్యాంగం హక్కు లను కల్పించిందని, వారి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ చల్లా రామకృష్ణారెడ్డి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, నేరస్థులైనా, నిందితులైనా, విచారణలో ఉన్నవారైనా వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉంటుందని, వారికి కూడా రాజ్యాంగపరమైన హక్కులున్నాయనే విషయాన్ని గుర్తించాలని సుప్రీంకోర్టు రూలింగు ఇచ్చింది. ఈ హక్కులకు భంగం కలగకుండా ఉండడా నికి ప్రభుత్వాలు, జైళ్లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వారి హక్కులను కాలరాయడమన్నది కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

దేశంలో జైళ్లు క్రిక్కిరిసిపోవడమన్నది సర్వసాధారణ విషయమైపోయింది. ఒక్కొక్క గదిలో పది మందిని పైగా ఉంచుతున్న జైళ్లు కూడా దేశంలో ఉన్నాయి. గదిలో ఉంచాల్సిన ఖైదీల సగటు సంఖ్య రెండు మాత్రమే కాగా, ఎనిమిది మందిని ఉంచుతున్నట్టు సర్వేల్లో వెల్లడైంది. జైళ్లలో నేరస్థుల సంఖ్య 9.5 శాతం వరకూ తగ్గిన మాట నిజమే కానీ, విచారణలో ఉన్న నిందితుల సంఖ్య మాత్రం 2016-20 మధ్య 45 శాతానికి పైగా పెరిగిపోయిందని 2021 నాటి ఒక అధ్యయనాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, జైళ్ల సంఖ్యను పెంచినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని కొద్ది కాలం క్రితం జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చెప్పారు. విచారణలో ఉన్న నిందితులను ఎక్కువ కాలం జైలులో ఉంచడం సమంజసం కాదని ప్రధాన న్యాయమూర్తి కూడా చెప్పారు. కోర్టులో పెండింగులో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించడానికి, కేసులను వాయిదా వేసే సంస్కృతికి స్వస్తి చెప్పడానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని కూడా ఆయన సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేస్తున్న మాట నిజమే కానీ, వాయిదా సంస్కృతి బాగా వేళ్లూనుకుపోయినందువల్ల కేసుల సంఖ్య తగ్గడం లేదు. అంతేకాదు, ముందస్తు బెయిలును మంజూరు చేయడం ద్వారా కూడా జైళ్లలో నిందితుల సంఖ్యను, ఖైదీల సంఖ్యను తగ్గించవచ్చు. అయితే, తమిళనాడులో తప్ప దేశంలో మరెక్కడా ముందస్తు బెయిలు అంత త్వరగా వచ్చే అవకాశం ఉండటం లేదు.

క్రిక్కిరిసిపోతున్న గదులు
ఇక జైళ్లలో సిబ్బంది కొరత కూడా అత్యధికంగా ఉంది. దేశంలో దాదాపు 92 వేల మంది జైలు సిబ్బంది అవసరం కాగా, 63 వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా ఖైదీలను సాటి మానవులుగా పరిగణించడం, వారితో మానవత్వంతో వ్యవహరించడం అన్నది తగ్గిపోతోంది. 2022లో 1995 మంది ఖైదీలు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం, అకాల మరణాలు కూడా ఎక్కువ కావడం సిబ్బంది కొరతకు అద్దం పడుతోంది. ఖైదీలకు కారాగార శిక్షలు విధించే బదులు, సామాజిక సేవా కార్యక్రమాలు అప్పగించడం మంచిదని, జాతీయ జైళ్ల విధానాన్ని రూపొందించాలని 1980 ప్రాంతంలో ముల్లా కమిటీ చేసిన సిఫార్సులు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు.

ఖైదీల ఆహారం, దుస్తులు, వైద్యం, విద్య, సంక్షేమాలకు ప్రభుత్వం ఏటా సగటున రూ. 10, 587 ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 6,818 కోట్లు కేటాయించినప్పటికీ, ఇందులో రూ. 5,250 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. దీనివల్ల వైద్య ఖర్చులు, ముఖ్యంగా మానసిక వైద్య ఖర్చుల్లో భారీగా కోతపడుతోంది. వీటన్నిటినీ పరిశీలించినప్పుడు జైళ్ల సంస్కరణలు ఎంత అవసరమో అర్థమవుతుంది. ఖైదీల సంక్షేమం కోసం భారీగా నిధులు ఖర్చు పెడుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, ఒడిశా, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఖైదీలకు వృత్తి విద్యలు నేర్పడం, వారు తయారు చేసిన వస్తువులను మార్కెట్లో విక్రయించడం వంటివి ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నాయి. ఖైదీలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అమ్మడంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది.

కనీస సౌకర్యాలు మృగ్యం
ఖైదీలకు పెరోల్ ఇవ్వడం, వారి ప్రవర్తనను బట్టి వారిని మధ్య మధ్య బయటికి పంపిస్తూ ఉండడం వల్ల వారికి కుటుంబ బంధాలు బలపడతాయి. అయితే, జైళ్ల అధికారులు ఇందుకు సంబంధించిన అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోవడం లేదు. ఖైదీలు దాంపత్య జీవితం గడపడానికి, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలను సందర్శించడానికి న్యాయస్థానాలు అనేక కేసుల్లో అవ కాశాలు కల్పించడం జరిగింది. ఇతరత్రా కూడా ఖైదీలను మధ్య మధ్య బయటికి పంపడానికి జైళ్ల అధికారులకు అధికారాలున్నాయి. అయితే, వాటిని ఉపయోగించుకోవడం జరగడం లేదు. ఖైదీల ప్రవర్తనను పరిశీలించడానికి గానీ, మానవత్వాన్ని ప్రదర్శించడానికి గానీ జైళ్ల అధికారు లకు, సిబ్బందికి అవకాశం ఉండడం లేదు. పోలీసులు, జైలు అధికారులు, న్యాయస్థానాలు, ఖైదీల మధ్య సమన్వయం ఏర్పడగలిగితే వారిని అధ్యయనం చేయడానికి, వారి శిక్షలను సమీక్షించ డానికి అవకాశం ఉంటుంది. న్యాయస్థానాల చొరవ కారణంగా ఇప్పుడిప్పుడే ఇందుకు సంబంధిం చిన టెక్నాలజీ కూడా రూపుదిద్దుకుంటోంది.

బెయిలు విధానాన్ని శీఘ్రతరం చేయడానికి మద్రాసు హైకోర్టు ఇ-మాడ్యూల్ విధానాన్ని ప్రవేశ పెడుతోంది. దీనివల్ల ఖైదీలు బెయిలుకు దరఖాస్తు చేసుకున్న దగ్గర నుంచి వారు బయటికి వచ్చే వరకూ మొత్తం ప్రక్రియను పరిశీలించడం జరుగుతుంది. ఖైదీల ఆరోగ్య సంరక్షణకు అవసర మైనంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీనికి కూడా ఒక కొత్త టెక్నాలజీని కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. టెక్నాలజీని ప్రవేశపెట్ట డంతో పాటు, జైళ్లకు దగ్గరగా రోగ నిర్ధారణ కేంద్రాలను నెలకొల్పడం, వైద్య శాలలను ఏర్పాటు చేయడం, జైళ్లలోనే వైద్య సిబ్బందిని పెంచడం వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే, ఇటువంటి చర్యలన్నీ మందకొడిగా సాగుతున్నందువల్ల ఖైదీల జీవితాల్లో పెద్దగా మార్పు ఉండడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఖైదీలను ప్రవర్తనను అధ్యయనం చేసే వ్యవస్థను ప్రతి జైలులోనూ నెలకొల్పుతోంది. జార్విస్ అనే ఈ వ్యవస్థ ద్వారా వారి ప్రవర్తననే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కూడా పరిశీలించడానికి అవకాశం కలుగుతుంది. జైళ్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది.

సంస్కరణలకు దూరం
నిజానికి, శిక్షలు విధించడం కంటే, జైళ్ల పరిస్థితులను మరింతగా మెరుగుపరచడం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఖైదీలకు ఇవి పునారావాస కేంద్రాలుగా ఉపయోగ పడాలే తప్ప నిర్బంధ కేంద్రాలుగా పనిచేయకూడదన్నది ఒక ప్రధాన సూత్రమని సుప్రీంకోర్టు ఏనాడో స్పష్టం చేసింది. ఖైదీలలో లేదా నేరస్థులలో పరివర్తన తీసుకు రావడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. విడుదలైన తర్వాత నేరస్థులు ఇతర ప్రజల మాదిరిగా జీవన స్రవంతిలో కలిసిపోవాలని, బాధ్యత కలిగిన పౌరులుగా జీవించాలని న్యాయస్థానాలు కూడా తరచూ వ్యాఖ్యానిస్తుంటాయి. జైళ్లలో ఉన్నప్పుడు ఖైదీలకు ఉన్నత విద్యను అందించడం, వారిలో విలువలు, ప్రమాణాలు పెంచడం, వారిని గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడం జైళ్ల అధికారుల ప్రధాన బాధ్యతగా ఉండాలి.

– జి.ఎస్. కౌముది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News