వనదేవతలైన సమ్మక్క సారలమ్మలు మేడారంలోని గద్దెలపై కొలువు తీరడంతో మేడారం జాతర తారాస్థాయికి చేరింది. నాలుగు రోజుల పాటు మేడారం జాతర వైభవంగా జరుగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుండి గిరిజనులు వచ్చి ఇక్కడ తమ మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనులు, గిరిజనేతరులతో పాటు సెలబ్రిటీలు, పలు రంగాల ప్రముఖులు ఇక్కడికి వచ్చి కొత్త మొక్కులు మొక్కుకోవటం, పాత మొక్కులు తీర్చుకోవటం సెంటిమెంట్ గా మారింది.
బంగారంగా భక్తులు పిలుచుకునే బెల్లాన్ని ఇక్కడ నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా పంచుతారు. భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని, కొబ్బరికాయలను వనదేవతలకు మొక్కులుగా చెల్లిస్తారు. ఈసారి ఆన్లైన్లో కూడా బంగారం సమర్పించే సదుపాయాన్ని రేవంత్ సర్కారు కల్పించగా దానికి కూడా మంచి స్పందన వస్తోంది. మరోవైపు ఆర్టీసీ కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని మేడారానికి కూడా వర్తింపచేయటంతో కనివిని ఎరుగని రీతిలో మహిళా భక్తులు ఈసారి ఇక్కడికి రావటం హైలైట్.