Friday, November 22, 2024
HomeతెలంగాణTRS Party: పాపం.. తుమ్మలను అధిష్టానం దూరం పెట్టిందా?

TRS Party: పాపం.. తుమ్మలను అధిష్టానం దూరం పెట్టిందా?

- Advertisement -

TRS Party: ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్నేళ్లుగా జిల్లా రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్‌లో ఉన్న తుమ్మ‌లను జిల్లాలో ఏకాకిని చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకు నిద‌ర్శనం ఇటీవ‌ల స‌త్తుప‌ల్లిలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుల స‌న్మాన స‌భ జ‌రిగింది. ఈ స‌న్మాన స‌భ‌కు తుమ్మ‌ల మిన‌హా అధికార పార్టీలోని అన్ని ప్రాంతాల నేత‌లు పాల్గొన్నారు. తుమ్మ‌ల‌కు క‌నీసం ఆహ్వానం కూడా అంద‌లేద‌ని తెలుస్తోంది. ఇందుకు కార‌ణం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్ రెడ్డేన‌న్న చ‌ర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది.

కందాల ఉపేంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అనంత‌రం ప‌రిణామాల నేప‌థ్యంలో కేసీఆర్ స‌మ‌క్షంలో అధికార పార్టీలో చేరారు. అప్ప‌టి నుంచి పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో తుమ్మ‌ల వ‌ర్సెస్ కందాల అన్న‌ట్లుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నారు. తుమ్మ‌ల‌ను పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పంపించే క్ర‌మంలో కందాల అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కందాలకు ఉమ్మ‌డి జిల్లాలోని మిగిలిన అధికార పార్టీ నాయ‌కుల మ‌ద్ద‌తు ఉండ‌టంతో తుమ్మ‌ల‌ను ఏకాకిని చేసే ప్ర‌య‌త్నంలో విజ‌యం సాధించిన‌ట్లుగా జిల్లా అధికార పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

తుమ్మ‌ల‌కు సీఎం కేసీఆర్ అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తి. ఏరికోరి మ‌రీ తుమ్మ‌ల‌ను కేసీఆర్ టీఆర్ ఎస్‌లోకి ఆహ్వానించారు. గ‌త ఎన్నిక‌ల నాటి వ‌ర‌కు తుమ్మల నాగేశ్వ‌ర‌రావుకు కేసీఆర్ మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉంది. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో తుమ్మ‌ల పాలేరు నుంచి ఓడిపోవ‌టంతో పాటు ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్, ఎంపీగా నామా నాగేశ్వ‌ర‌రావులు విజ‌యం సాధించ‌డంతో తుమ్మ‌ల‌కు ప్రాధాన్య‌త త‌గ్గింది. ప్ర‌స్తుతం కేసీఆర్ తుమ్మ‌లను పూర్తిగా దూరం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లా నుంచి మంత్రి హోదాలో పువ్వాడ‌, పార్ల‌మెంట‌రీ నేత‌గా నామా, ఎమ్మెల్యేలు రేగా, సండ్ర‌ల‌తో పాటు అంద‌రికి ట‌చ్‌లో ఉంటున్న కేసీఆర్‌.. తుమ్మ‌ల‌తో మాట్లాడేందుకు క‌నీస ఆస‌క్తికూడా చూప‌డం లేద‌న్న చ‌ర్చ జిల్లా రాజ‌కీయాల్లో జ‌రుగుతుంది. ఇందుకు ప‌లు కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ.. రెండేళ్ల క్రితం వ‌ర‌కు జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రంతిప్పిన తుమ్మల ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం గ‌మ‌నార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News