బిజెపి మెడికల్ విభాగంతో కలిసి మేడారంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం పట్ల ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లతామా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొంపెల్ల మాధవిలత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈవిషయమై ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారన్నారు. వారందరికీ బిజెపి మెడికల్ విభాగం ద్వారా సేవ చేసే భాగ్యం తనకు కలగడం ఆనందంగా ఉందన్నారు. లతామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరించి హాస్పిటల్స్ సౌజన్యంతో మేడారం జాతరలో ఏర్పాటు చేశామన్నారు. అందుకోసం నాలుగు ఆంబులెన్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, మందులు ఇతరాత్ర సామాగ్రిని సమకూర్చామన్నారు.
బుధవారం ఉదయం జెండా ఊపి వాటిని పంపించామని వెల్లడించారు. కేవలం మేడారం జాతరలోనే కాకుండా అంతుకు ముందు నుంచే లతామా ఫౌండేషన్ ఉచిత మెడికల్ క్యాంపులను హైదరాబాదు పార్లమెంటు పరిధిలో పేదల కోసం నిర్వహిస్తోందని చెప్పారు. ఉచిత మెడికల్ క్యాంపులే కాకుండా అవసరమైన వారికి ఇతరత్రా వైద్య సహాయం కూడా అందిస్తోందన్నారు. సమ్మక్క, సారమ్మల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.