మేడారం జాతరలో భక్తుల సంఖ్య నామమాత్రం ఉన్నప్పటికీ పోలీస్ అధికారులు అత్యుత్సం ప్రదర్శించి అధికారులతో పాటు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బుధవారం సాయంకాలం సార్లమ్మ దేవతను కన్నెపల్లి గ్రామం నుండి తీసుకొస్తున్న సమయంలో అమ్మవారి గద్దెల చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు దిగ్బంధం చేసి ఎవరిని మేడారం గ్రామంలోకి అనుమతించలేదు. టీటీడీ కల్యాణ మండపంలో గల ప్రధాన ఆసుపత్రిలో కొందరు వ్యక్తులకు అత్యవసర చికిత్స నిర్వహించాల్సి ఉండగా కిందిస్థాయి సిబ్బందికి సూచనలు చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య బస్టాండ్ ప్రాంతం నుండి మేడారం ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించగా డీఎస్పీ స్థాయిలో ఉన్న అధికారితో పాటు సిఐ స్థాయి అధికారులు అడ్డుకున్నారు. తాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని అత్యవసర సమయంలో ప్రధాన ఆస్పత్రికి వెళ్లడానికి అనుమతించాలని కోరినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతించ లేదు. దాదాపు గంటసేపు రోడ్డుపై ఉన్న అప్పయ్య తన చరవాణి ద్వారా కింది స్థాయికి సిబ్బందికి సూచనలు చేస్తూ నిలిచిపోయారు. ఈ సందర్భంలో కొందరు పాత్రికేయులు డాక్టర్ అత్తయ్య వివరాలను వెల్లడించినప్పటికీ ఎవరైనా మంచిదే మాకు జిల్లా ఎస్పీ ఆర్డర్ ఉందని ఎవర్ని అనుమతించబోమని మొండి చేశారు. చివరికి పాత్రికేయులు సంబంధిత పోలీసు అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ సంబంధిత అధికారులు సైతం స్పందించకపోవడం శోచనీయం. ఇలాంటి సంఘటనలు జరుగవని స్వయంగా జిల్లా ఎస్పీ పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. కొందరు పోలీసు అధికారులు అధికారుల పట్ల, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం.