సమ్మక్క సారలమ్మ దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలోని కన్నూర్, కమలాపూర్, మాదన్నపేట మరిపెళ్లి గూడెం గ్రామలలో సమ్మక్క సారలమ్మ దేవతలను గురువారం సాయంత్రం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ… ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే వనదేవతల పండగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా జాతర కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల అనుగ్రహం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగానే ముందుకు వెళుతుందని, ప్రజల సమస్యలు తీర్చేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. వన దేవతల అనుగ్రహం వల్ల ప్రతి ఒక్క కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.