తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యా స్నానాలు ఆచరించేందుకు గాను స్నాన ఘట్టాలతో పాటు షవర్ బాతులను ప్రభుత్వం నిర్మించడం జరిగింది. 6 కోట్ల 11 లక్షల రూపాయలు వ్యయంతో స్నాన ఘట్టాల మరమ్మత్తులు చేయడంతో పాటు నూతనంగా 354 స్నాన ఘట్టాలు నిర్మించడం, 132 మహిళల దుస్తుల మార్పిడి కంపార్ట్మెంట్ల ఏర్పాటు చేశారు. జంపన వాగులో భక్తుల రక్షణార్థం 250 గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు నిరంతర త్రాగునీటి సరఫరా టాయిలెట్ల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం 13 కోట్ల యాభై లక్షలు రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశారు. త్రాగునీటి కోసం 6 కోట్ల రూపాయలతో 17 ఇన్ ఫిల్టరేషన్ బావుల నిర్మాణం, 495 ప్రాంతాలను గుర్తించి నిరంతరాయంగా త్రాగునీరు అందించేందుకు 5 వేల ట్యాపులను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ అంతరాయం కలగకుండా 40 జనరేటర్ లను ఏర్పాటు చేశారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 8400 టాయిలెట్లను 500 ప్రాంతాల్లో చేపట్టడం ద్వారా జాతరకు విచ్చేసిన భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.