సమ్మక్క సారక్క అబ్బియా… జాలారు బండల్లో అబ్బియా.. జంపన్న వాగుల్లో అబ్బియా.. అంటూ సమ్మక్క, సారలమ్మ జాతర ప్రాంగణాలు మారుమోగాయి. డప్పుల చప్పుళ్లు.. శివసత్తుల పూనకాల మధ్య ఆ తల్లులు వనం వీడి జనారణ్యంలోకి వచ్చారు. ఆ దేవతల రాక కోసం నిలువెల్లా కనులై.. వారి దీవెనల కోసం పెద్దఎత్తున భక్తులు ఎదురుచూశారు. భక్తుల ఇలవేల్పు.. కొంగు బంగారం.. కోరిన వరాలు ఇచ్చే ఆ దేవతలను పదిహేను రోజుల నుంచి మది నిండా తలచుకుంటూ పూజిస్తున్న భక్తులు వారిని దర్శించుకుని పునీతులయ్యారు. వారిని అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న భక్తులు ప్రతి రెండేళ్లకోసారి వారిని తలచుకుంటూ మొక్కులు అప్పగించారు. జాతర ప్రాంగణాలన్నీ జనారణ్యంగా మారాయి. సారలమ్మ గద్దెలపై కొలువు దీరడంతో జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి వెదురు కంక, కుంకుమ భరిణెల రూపంలో ఉండే సమ్మక్కను గిరిజన పూజారులు పూజలు నిర్వహించి ఊరేగింపుగా డప్పుల చప్పుళ్ల మధ్య తీసుకవచ్చారు. ఈ సందర్భంగా దారిలో మహిళలు మంగళహారతులు పట్టుకుని జేజేలు పలికారు. సమ్మక్కను తీసుకవచ్చే వడ్డె పూనకంతో ఊగిపోయారు. గద్దెపైకి సమ్మక్కను తీసుకవచ్చిన తర్వాత భక్తులు ఇద్దరు తల్లులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు మొక్కుల ప్రకారం ఆ తల్లులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. జాతరలో ఆ తల్లులను దర్శించుకుని పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బంగారం(బెల్లం) సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎక్కువగా శుక్రవారం రోజున జాతర ప్రాంగణాలు కిక్కిరిసిపోనున్నాయి. జాతరల్లో భక్తులు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, వైద్య సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. గద్దెలను అందంగా అలంకరించి విద్యుత్తు కాంతులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు.